Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
మోడీ పంచదేశాల పర్యటన.. ఆర్థిక ప్రగతికి సరికొత్త బాటలు

మోడీ పంచదేశాల పర్యటన.. ఆర్థిక ప్రగతికి సరికొత్త బాటలు

ప్రధాని నరేంద్ర మోదీ ఇటీవలి ఐదు దేశాల అధికారిక పర్యటన భారత దౌత్య రంగంలో సరికొత్త మైలురాయిగా నిలిచింది. యూఏఈ, నెదర్లాండ్స్, స్వీడన్, నార్వే, ఇటలీ దేశాల్లో ఆయన జరిపిన విస్తృత పర్యటనలు దేశ ఆర్థిక ప్రగతికి సరికొత్త ఊపునిచ్చాయి.

ఈ పర్యటనల ద్వారా సుమారు 40 బిలియన్ డాలర్లు అంటే దాదాపు 3.3 లక్షల కోట్ల కొత్త పెట్టుబడుల హామీలు లభించడం విశేషం. అంతర్జాతీయ వ్యాపార వర్గాల్లో భారతదేశంపై ఉన్న నమ్మకానికి, పెరుగుతున్న క్రేజ్‌కు ఈ పెట్టుబడులే ప్రత్యక్ష నిదర్శనమని ఆర్థిక నిపుణులు విశ్లేషిస్తున్నారు. ఈ పర్యటన కేవలం విదేశీ నిధుల సమీకరణకే పరిమితం కాకుండా, గ్లోబల్ సప్లై చైన్‌లో భారతదేశాన్ని ఒక అగ్రగామి శక్తిగా నిలిపే వ్యూహాత్మక అడుగుగా నిలిచింది. ప్రస్తుత ప్రపంచ ఆర్థిక సమీకరణాలు వేగంగా మారుతున్న తరుణంలో..

భవిష్యత్ కు అత్యంత కీలకమైన రంగాలపై భారత్ ప్రత్యేక దృష్టి సారించింది. ఇందులో భాగంగానే సెమీకండక్టర్ల తయారీ, హరిత ఇంధన వనరులు, ఆధునిక లాజిస్టిక్స్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) వంటి హై గ్రోత్ రంగాలలో భారీ పెట్టుబడులను ఆకర్షించడమే లక్ష్యంగా ప్రధాని చర్చలు సాగించారు. ఆధునిక మౌలిక వసతుల కల్పన, డిజిటల్ నెట్‌వర్క్‌ల విస్తరణ, పునరుత్పాదక ఇంధన రంగాల్లో అంతర్జాతీయ భాగస్వామ్యాలు, దేశీయ తయారీ రంగానికి కొత్త జవాన్ని ఇస్తాయని భావిస్తున్నారు. ఈ పెట్టుబడులు రాబోయే రోజుల్లో దేశంలో పెద్ద ఎత్తున ఉపాధి అవకాశాలను సృష్టించడంతో పాటు సాంకేతిక పరిజ్ఞాన బదిలీకి ఎంతో దోహదపడతాయి.

పర్యటనలో భాగంగా యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (యూఏఈ)తో కుదిరిన ఒప్పందాలు అత్యంత ప్రాధాన్యతను సంతరించుకున్నాయి. యూఏఈ నుంచి సుమారు 5 బిలియన్ డాలర్ల మేర పెట్టుబడులు రానున్నాయి. ఇరు దేశాల మధ్య రక్షణ రంగ సహకారం, ఇంధన భద్రత, సముద్ర తీర ప్రాంతాల్లో మౌలిక వసతుల కల్పన వంటి అంశాలపై ఏడు కీలక ఒప్పందాలు జరిగాయి. ముఖ్యంగా వడినార్ వద్ద ప్రతిపాదించిన ప్రతిష్టాత్మక మెరైన్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ ప్రాజెక్ట్ భారత్‌కు వ్యూహాత్మకంగా ఎంతో కీలకం కానుంది.

ఇది భారతదేశ సముద్ర మార్గాల భద్రతను, ఆర్థిక ప్రయోజనాలను మరింత బలోపేతం చేస్తుందని దౌత్య వర్గాలు భావిస్తున్నాయి. ఐరోపా దేశాలైన నెదర్లాండ్స్, స్వీడన్, నార్వేలతో సాంకేతిక బంధాన్ని భారత్ మరింత దృఢం చేసుకుంది. సాధారణ వాణిజ్య చర్చలకు భిన్నంగా, భవిష్యత్ అవసరాలైన క్వాంటం కంప్యూటింగ్, గ్రీన్ హైడ్రోజన్, పర్యావరణ మార్పుల నియంత్రణ, కీలక ఖనిజాల అన్వేషణ వంటి అంశాలపై ఈ దేశాలతో అవగాహన కుదిరింది. నెదర్లాండ్స్‌తో వ్యూహాత్మక రోడ్‌మ్యాప్, స్వీడన్‌తో 2026-2030 ఉమ్మడి కార్యాచరణ ప్రణాళిక, నార్వేతో స్వచ్ఛ ఇంధన పరివర్తనపై జరిగిన చర్చలు భారతదేశాన్ని యూరోపియన్ టెక్నాలజీ గ్రిడ్‌లో భాగస్వామిని చేయనున్నాయి.

దీని ద్వారా భారత విదేశాంగ విధానంలో సంప్రదాయ వాణిజ్యంతో పాటు టెక్నాలజీ దౌత్యంఒక బలమైన శక్తిగా ఆవిర్భవించింది. ఇక ఇటలీ పర్యటనలో ఆ దేశ ప్రధాని జార్జియా మెలోనితో ప్రధాని మోదీ జరిపిన చర్చల ఫలితంగా, ఇరు దేశాల బంధం ప్రత్యేక వ్యూహాత్మక భాగస్వామ్యం స్థాయికి చేరుకుంది. ఇది కేవలం ఒక లాంఛనప్రాయ ప్రకటన మాత్రమే కాదు, యూరోపియన్ అంతర్గత రాజకీయ, ఆర్థిక సమీకరణాల్లో భారత్‌కు మరింత మైలేజ్ ఇచ్చే పరిణామం. రక్షణ పరిశ్రమలు, మధ్యధరా ప్రాంతంలో సముద్ర వాణిజ్య భద్రత, ఇంధన రంగాల్లో ఇటలీతో కలిసి పనిచేయడం వల్ల ద్వైపాక్షిక సంబంధాల్లో సరికొత్త అధ్యాయం మొదలుకానుంది.

ఐరోపా మార్కెట్లలోకి భారతీయ ఉత్పత్తుల విస్తరణకు ఇది రహదారిగా మారుతుందని విశ్లేషకులు భావిస్తున్నారు. ఈ ఐదు దేశాల పర్యటనలో మోడీ దౌత్యపరమైన భేటీలతో పాటు పారిశ్రామిక రంగానికి సమాన ప్రాధాన్యతనిచ్చారు. ప్రపంచవ్యాప్తంగా అగ్రగామిగా ఉన్న 50కి పైగా బహుళజాతి సంస్థల (ఎంఎన్సీ) సీఈఓలతో ప్రధాని మోదీ ప్రత్యేకంగా సమావేశమయ్యారు. ఈ కంపెనీల మొత్తం మార్కెట్ విలువ దాదాపు 3 ట్రిలియన్ డాలర్లు కావడం గమనార్హం.

ఈ సంస్థలలో మెజారిటీ కంపెనీలకు ఇప్పటికే భారతదేశంలో సుమారు 180 బిలియన్ డాలర్ల వ్యాపార సామ్రాజ్యం ఉంది. కాబట్టి, తాజా చర్చలు కేవలం కొత్త పెట్టుబడుల కోసమే కాకుండా.. ప్రస్తుతం ఉన్న ప్లాంట్ల విస్తరణకు, అంతర్జాతీయ తయారీ హబ్‌గా భారత్‌ను మార్చే వ్యూహంలో భాగమని స్పష్టమవుతోంది. ప్రస్తుత ప్రపంచ పరిస్థితుల్లో భారతదేశం సాధిస్తున్న స్థిరమైన ఆర్థిక వృద్ధి రేటు, దేశీయంగా పెరుగుతున్న మార్కెట్ డిమాండ్ అంతర్జాతీయ ఇన్వెస్టర్లను ఎంతగానో ఆకర్షిస్తున్నాయి.

ప్రపంచ ఆర్థిక వ్యవస్థ పునర్వ్యవస్థీకరణ చెందుతున్న ఈ తరుణంలో, భారత్ కేవలం ఒక వినియోగదారుల మార్కెట్‌గా మిగిలిపోకుండా, అంతర్జాతీయ ఆవిష్కరణలకు కేంద్ర బిందువుగా ఎదుగుతోంది. సెమీకండక్టర్ హబ్‌గా మారాలనే భారత్ కల నెరవేరడానికి, డిజిటల్ ఇండియా మౌలిక వసతుల పటిష్టతకు ఈ విదేశీ పర్యటన ద్వారా లభించిన పెట్టుబడుల హామీలు ఎంతో ఊతాన్ని ఇస్తాయని నిపుణులు అంచనా వేస్తున్నారు. ప్రపంచవ్యాప్తంగా భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలు, ఇంధన సంక్షోభాలు ఉన్నప్పటికీ, భారతదేశం తన వ్యూహాత్మక స్వతంత్రతను కాపాడుకుంటూనే ఆర్థికంగా దూసుకుపోతోంది. ఇంధన భద్రత, సురక్షిత సముద్ర రవాణా మార్గాలు, కీలక ఖనిజాల నిరంతర సరఫరా, సాంకేతిక భాగస్వామ్యం అనే నాలుగు సూత్రాల ఆధారంగా భారత్ తన భవిష్యత్ వ్యూహాన్ని నిర్మించుకుంటోంది.

అయితే, కాగితాలపై జరిగిన ఈ భారీ ఒప్పందాలు మరియు పెట్టుబడి హామీలు ఎంత వేగంగా క్షేత్రస్థాయిలో అమలవుతాయనే దానిపైనే ఈ పర్యటన యొక్క అసలు విజయం ఆధారపడి ఉంటుంది. వేగవంతమైన అనుమతులు, మౌలిక వసతుల కల్పన ద్వారా ఈ నిధులను సద్వినియోగం చేసుకుంటే భారత ఆర్థిక వ్యవస్థ మరింత ఎత్తుకు ఎదగడం ఖాయం. -సీతారాం కంఠంనేని ఈ విశ్లేషణ మీకు నచ్చినట్లయితే, దయచేసి https://www.teluguone.com పోర్టల్ ను ఫాలో అవ్వండి. లైక్ చేయండి. షేర్ చేయండి. మీ విలువైన అభిప్రయాలను తెలియజేయండి.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Telugu One