Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
నకిలీ వైద్యుల ఉచ్చులో పడకండి.. అప్రమత్తంగా ఉండండి.. సీపీ సజ్జనార్

నకిలీ వైద్యుల ఉచ్చులో పడకండి.. అప్రమత్తంగా ఉండండి.. సీపీ సజ్జనార్

వైద్యం పేరుతో అమాయక ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్న నకిలీ వైద్యుల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హైదరాబాద్ పోలీస్ కమిషనర్ వీసీ సజ్జనార్ సూచించారు.

ప్రజారోగ్య పరిరక్షణలో భాగంగా కల్తీ ఆహారంపై ఇప్పటికే చర్యలు చేపడుతున్న హైదరాబాద్ పోలీసులు.. తాజాగా నగరంలో నకిలీ వైద్యులపై ప్రత్యేక నిఘా ఏర్పాటు చేశారు. ఈ క్రమంలో ఇప్పటివరకు 12 మంది నకిలీ వైద్యులను గుర్తించి చట్టపరమైన చర్యలు తీసుకున్నట్లు కమిషనర్ వెల్లడించారు. ఎలాంటి విద్యార్హతలు, కనీస వైద్య పరిజ్ఞానం లేకపోయినా కొందరు నకిలీ వైద్యులు అసలైన వైద్యుల మాదిరిగా నటిస్తూ ప్రజలకు చికిత్స అందిస్తున్నారని సజ్జనార్ తెలిపారు.

రోగులకు యాంటీబయాటిక్స్, స్టెరాయిడ్లు, బీపీ, మధుమేహం మందులను విచక్షణారహితంగా ఇవ్వడంతో పాటు ఇంజెక్షన్లు, సెలైన్లు ఎక్కిస్తూ వారి ఆరోగ్యాన్ని తీవ్ర ప్రమాదంలోకి నెడుతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. అవగాహన లేకుండా రోజుల తరబడి మందులు వాడాలని సూచించడం వల్ల ఊపిరితిత్తులు, గుండె, మూత్రపిండాలపై తీవ్ర ప్రభావం పడే ప్రమాదం ఉందని హెచ్చరించారు. చికిత్స కోసం క్లినిక్ లేదా ఆసుపత్రికి వెళ్లే ముందు ప్రజలు జాగ్రత్తలు పాటించాలని పోలీసులు సూచించారు. క్లినిక్ లేదా ఆసుపత్రి రిసెప్షన్ వద్ద జిల్లా వైద్యారోగ్య శాఖ (DMHO) జారీ చేసిన అధికారిక రిజిస్ట్రేషన్ సర్టిఫికెట్‌ను ప్రదర్శించారో లేదో పరిశీలించాలని తెలిపారు.

అలాగే వైద్యుల బోర్డులపై వారి పేరు, విద్యార్హతలతో పాటు తెలంగాణ స్టేట్ మెడికల్ కౌన్సిల్ (TSMC) కేటాయించిన రిజిస్ట్రేషన్ నంబర్ తప్పనిసరిగా ఉండాలని స్పష్టం చేశారు. వైద్యుడి వివరాలపై అనుమానం ఉంటే onlinetsmc.in వెబ్‌సైట్‌లోని Doctor Searchలో పేరు లేదా రిజిస్ట్రేషన్ నంబర్ నమోదు చేసి వివరాలను పరిశీలించుకోవచ్చని తెలిపారు. అక్కడ వివరాలు కనిపించకపోతే అప్రమత్తంగా ఉండాలని సూచించారు. చికిత్స విధానం లేదా సిబ్బంది ప్రవర్తనపై అనుమానం కలిగితే అర్హత కలిగిన మరో వైద్య నిపుణుడిని సంప్రదించి సెకండ్ ఒపీనియన్ తీసుకోవాలని సూచించారు. నగరంలో ఎక్కడైనా నకిలీ వైద్యులు చలామణి అవుతున్నట్లు సమాచారం తెలిస్తే వెంటనే డయల్ 112కు లేదా సమీప పోలీస్ స్టేషన్‌కు సమాచారం అందించాలని సీపీ వీసీ సజ్జనార్ ప్రజలను కోరారు. నకిలీ వైద్యులపై పోలీసుల నిఘా, కఠిన చర్యలు కొనసాగుతాయని, ప్రజలు కూడా అప్రమత్తంగా ఉండి అమాయకుల ప్రాణాలను కాపాడేందుకు సహకరించాలని విజ్ఞప్తి చేశారు. Fake Doctors Hyderabad, CP VC Sajjanar, DMHO, TSMC, CM Revanth reddy, Minister damodara, Telangana Health Department, Telugu News, Telugug One

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Telugu One