తెలంగాణ ఎండల తీవ్రత రికార్డు స్థాయికి చేరింది. భానుడి భగభగలకు రాష్ట్రం నిప్పుల కొలిమిలా మారిపోయింది. ఆకాశం నుంచి నిప్పుల వాన కురుస్తోందా అన్నట్లుగా ఎండ చండప్రచండంగా కాస్తున్నది.
ఉష్ణోగ్రతలకు తోడు వడగాడ్పుల కూడా వీస్తండటంతో.. రాష్ట్రంలో ఇప్పటివరకు 34 మంది వడదెబ్బకు గురై మరణించారు. ఎండ తీవ్రతకు తోడు వాయువ్య దిశ నుంచి వీస్తున్న వేడి, పొడి గాలుల కారణంగా రాష్ట్రంలోని దాదాపు 20 జిల్లాల్లో ఉష్ణోగ్రతలు 46 డిగ్రీల సెల్సియస్ మార్కును దాటి నమోదౌతున్నాయి. ముఖ్యంగా ఉత్తర, తూర్పు తెలంగాణ ప్రాంతాలను ఈ ఉష్ణోగ్రతలు, వడగాల్పులు వణికించేస్తున్నాయి.
కుమురం భీం ఆసిఫాబాద్ జిల్లా సిర్పూర్ (టి), పెద్దపల్లి జిల్లా ముత్తారం, సూర్యాపేట జిల్లా మునగాల ప్రాంతాల్లో అత్యధికంగా 46.5 డిగ్రీల సెల్సియస్ రికార్డు స్థాయి ఉష్ణోగ్రత నమోదైంది. కేవలం ఈ ప్రాంతాల్లోనే కాకుండా, రాష్ట్రంలోని దాదాపు 16 జిల్లాల్లో పగటి ఉష్ణోగ్రతలు 46.2 డిగ్రీల నుంచి 46.5 డిగ్రీల సెల్సియస్ మధ్య రికార్డవడం ప్రస్తుత పరిస్థితి తీవ్రతకు అద్దం పడుతోంది. ఇక ఉమ్మడి వరంగల్, నల్గొండ, ఖమ్మం, కరీంనగర్ పరిసర జిల్లాల్లో వడదెబ్బ మరణాల సంఖ్య ఎక్కువగా ఉన్నాయి. వడదెబ్బ కారణంగా మరణించిన వారిలో ఎక్కువ మంది వృద్ధులు, రైతులు, భవన నిర్మాణ కార్మికులు ఉన్నారు.
సాధారణంగా వేసవి కాలంలో పగటిపూట ఎంత తీవ్రమైన ఎండలు ఉన్నప్పటికీ, రాత్రి వేళల్లో చల్లటి గాలులు వీచి కాస్త ఉపశమనం లభిస్తుంది. కానీ ప్రస్తుత వాతావరణంలో గాలిలో తేమ శాతం కనిష్ఠ స్థాయికి పడిపోవడంతో రాత్రి వేళల్లో కూడా వేడి సెగలు తగ్గడం లేదు. పలు జిల్లాల్లో రాత్రిపూట నమోదయ్యే ఉష్ణోగ్రతలు సాధారణం కంటే భారీగా పెరిగిపోయాయి. పగలు, రాత్రి అనే తేడా లేకుండా నిరంతరం వీస్తున్న ఈ వడగాలుల వల్ల ప్రజలు ఇళ్ల నుంచి బయటకు రావడానికే భయపడుతున్నారు. రోడ్లన్నీ మధ్యాహ్నం వేళల్లో జనసంచారం లేక కర్ఫ్యూను తలపిస్తున్నాయి.

