Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
పేదలకు మెరుగైన వైద్యం అందించాలనే లక్ష్యంతో టిమ్స్ : కేటీఆర్

పేదలకు మెరుగైన వైద్యం అందించాలనే లక్ష్యంతో టిమ్స్ : కేటీఆర్

హైదరాబాద్ ప్రజలకు అంతర్జాతీయ స్థాయి వైద్య సేవలు అందించాలనే లక్ష్యంతో టిమ్స్ హాస్పిటల్స్‌ను ఏర్పాటు చేశామని బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తెలిపారు.

గతంలో గాంధీ, ఉస్మానియా వంటి ప్రభుత్వ ఆసుపత్రులపైనే ప్రజలు ఎక్కువగా ఆధారపడాల్సి వచ్చేదని, బీఆర్‌ఎస్ ప్రభుత్వ హయాంలో ఆధునిక సదుపాయాలతో టిమ్స్ హాస్పిటల్స్ నిర్మాణం ఒక కీలక ముందడుగుగా నిలిచిందన్నారు. ఎయిమ్స్ స్థాయి వైద్యాన్ని హైదరాబాద్‌లోనే అందించాలనే ఉద్దేశంతో ఈ ప్రాజెక్ట్‌ను రూపుదిద్దామని తెలిపారు. సనత్‌నగర్‌లో 22 ఎకరాల విస్తీర్ణంలో అత్యాధునిక సాంకేతికత, అంతర్జాతీయ ప్రమాణాలతో టిమ్స్ హాస్పిటల్ నిర్మాణం చేపట్టినట్లు తెలిపారు. ప్రైవేట్ కార్పొరేట్ ఆసుపత్రులకు ప్రత్యామ్నాయంగా సామాన్య ప్రజలకు నాణ్యమైన వైద్యం అందించాలనే సంకల్పంతో మాజీ సీఎం కేసీఆర్ ప్రభుత్వం టిమ్స్‌ను ప్రారంభించిందన్నారు.

హైదరాబాద్‌లోని సనత్‌నగర్, ఎల్‌బీనగర్, ఆల్వాల్ ప్రాంతాల్లో టిమ్స్ హాస్పిటల్స్ ఏర్పాటు చేసినట్లు చెప్పారు. అలాగే వరంగల్‌లో 2000 పడకల భారీ ప్రభుత్వ ఆసుపత్రి నిర్మాణం కొనసాగుతుండగా, నిమ్స్ విస్తరణ పనులు కూడా జరుగుతున్నాయని వెల్లడించారు. సనత్‌నగర్ టిమ్స్‌లో మూడు బ్లాకులు నిర్మించామని, 300 ఐసీయూ పడకలతో అత్యవసర వైద్య సేవలు అందుబాటులో ఉంటాయని తెలిపారు. రోగుల బంధువుల కోసం ప్రత్యేక ధర్మశాల కూడా ఏర్పాటు చేశామని చెప్పారు.

సుమారు రూ.1200 కోట్ల వ్యయంతో ఈ ప్రాజెక్ట్‌ను నిర్మించామని పేర్కొన్నారు. బీఆర్‌ఎస్ ప్రభుత్వం కొనసాగి ఉంటే ఈ ఆసుపత్రి మరింత ముందుగానే పూర్తయ్యేదని వ్యాఖ్యానించారు. ఈ హాస్పిటల్‌లో 16 అత్యాధునిక ఆపరేషన్ థియేటర్లు, ఎంఆర్‌ఐ, సీటీ స్కాన్ సహా అన్ని డయాగ్నస్టిక్ సదుపాయాలు ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ప్రత్యేక వీఐపీ సూట్స్‌తో పాటు కిడ్నీ వ్యాధులపై పరిశోధనలకు అనువైన సౌకర్యాలు కల్పిస్తున్నామని చెప్పారు.

దేశంలోనే అత్యధిక వైద్య సిబ్బందితో కూడిన ప్రభుత్వ వైద్య వ్యవస్థగా టిమ్స్‌ను అభివృద్ధి చేస్తున్నామని పేర్కొన్నారు. ప్రత్యేక రీసెర్చ్ బ్లాక్స్, అకాడెమిక్ విభాగాలు, భారీ ఆడిటోరియం నిర్మాణం చేపట్టినట్లు తెలిపారు. ఒకేసారి వెయ్యి కార్లు పార్క్ చేసే ఆధునిక పార్కింగ్ వ్యవస్థను ఏర్పాటు చేశామని చెప్పారు. టిమ్స్ హాస్పిటల్ డిజైన్ దేశంలోనే అత్యుత్తమ ప్రభుత్వ వైద్య నిర్మాణాల్లో ఒకటిగా నిలుస్తుందని కేటీఆర్ అన్నారు.

అత్యవసర సేవల కోసం ప్రత్యేక ఎమర్జెన్సీ ర్యాంప్ ఏర్పాటు చేసినట్లు, లిఫ్టుల పనితీరును మరింత మెరుగుపరచాలని అధికారులకు సూచించినట్లు తెలిపారు. రాష్ట్రవ్యాప్తంగా 350 బస్తీ దవాఖానాలు ఏర్పాటు చేసి ప్రజలకు చేరువలో వైద్యం అందించామని గుర్తుచేశారు. మిగిలిన పనులను ప్రభుత్వం వేగంగా పూర్తి చేసి టిమ్స్‌ను పూర్తిస్థాయిలో ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలని ఆయన డిమాండ్ చేశారు.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Telugu One