రాజకీయాలు
పెను సవాలే.. అయినా జరిపి తీరుతాం! నోటిఫికేషన్ విడుదల చేసిన నిమ్మగడ్డ

ఆంధ్రప్రదేశ్ లో తొలి విడత పంచాయతీ ఎన్నికల నోటిఫికేషన్ విడుదలైంది. కరోనా వ్యాక్సినేషన్ చేపడుతూనే విజయనగరం, ప్రకాశం మినహా మిగిలిన జిల్లాల్లో తొలి విడత ఎన్నికలు నిర్వహించనున్నట్లు ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేశ్ కుమార్ తెలిపారు. పొలింగ్ సమయాన్ని సాయంత్రం నాలుగు గంటల వరకు పొడిగించామన్నారు. ముందుగా నిర్ణయించిన ప్రకారమే నాలుగు దశల్లో పంచాయతీ ఎన్నికలు జరుగుతాయని స్పష్టం చేశారు. 2019 ఓటర్ల జాబితా ప్రకారమే నిర్వహిస్తున్నామని,. విధి లేని పరిస్థితుల్లోనే ఇలా ఎన్నికల నిర్వహణ చేపట్టాల్సి ఉందని చెప్పారు నిమ్మగడ్డ. కొత్త ఓటర్ల జాబితాను సిద్ధం చేయడంలో పీఆర్ కమిషనర్ అలక్ష్యంతో ఉన్నారని విమర్శించారు. పంచాయతీ రాజ్ కమిషనర్ పూర్తిగా విఫలమవ్వడం చాలా బాధాకరమని.. ఆయనపై సరైన సమయంలో చర్యలు తీసుకుంటామని నిమ్మగడ్డ స్పష్టం చేశారు.
పంచాయతీ ఎన్నికల నోటిఫికేషన్ విడుదల సందర్భంగా నిమ్మగడ్డ కీలక వ్యాఖ్యలు చేశారు. తాము అన్ని నిబంధనల ప్రకారమే ముందుకు వెళ్తున్నామని తెలిపారు. రాజ్యాంగాన్ని రచించిన అంబేద్కర్ మానసపుత్రికే ఎన్నికల సంఘం అని ఆయన అన్నారు. దాని ప్రకారమే ఎన్నికలు సకాలంలో నిర్వహించడమనేది ఎన్నికల కమిషన్ విధి అని చెప్పారు. అందుకే తాము ఎన్నికల ప్రక్రియను ప్రారంభించి ముందుకు వెళ్తున్నామని తెలిపారు. కొందరు ప్రభుత్వ అధికారులు ఎన్నికల ప్రక్రియను సమర్థంగా కొనసాగించడంలో విఫలమయ్యారని ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేశ్ కుమార్ తెలిపారు. ఎన్నికల నిర్వహణ విషయంపై సుప్రీంకోర్టు ఏ నిర్ణయం తీసుకున్నా తప్పకుండా పాటిస్తామని స్పష్టం చేశారు. ఎస్ఈసీకి న్యాయవ్యవస్థపై విశ్వాసం, విధేయత ఉంటాయని చెప్పారు. ఎన్నికల నిర్వహణలో ఏపీ ప్రభుత్వం నుంచి మిశ్రమ అనుభవాలు ఉన్నాయని చెప్పారు. ఏదేమైనా సరైన సమయానికి ఎన్నికలు జరుపుతామని స్పష్టం చేశారు నిమ్మగడ్డ రమేశ్ కుమార్.
ప్రభుత్వ సూచనలు సహేతుకంగా లేవన్నారు నిమ్మగడ్డ రమేష్ కుమార్. ఎన్నికలను వాయిదా వేయాలన్న ప్రభుత్వ సూచనను తిరస్కరిస్తున్నామని చెప్పారు. ప్రభుత్వం తీరు కూడా సరిగా లేదని వ్యాఖ్యానించారు. సీఎస్ తనకు రాసిన లేఖ తనకంటే ముందుగానే మీడియాకు చేరిందన్నారు. ఆర్టీఐ నుంచి మినహాయింపులున్నా కమిషన్ విషయంలో జరిగే ఉత్తర ప్రత్యుత్తరాల్లో గోప్యత పాటించాల్సి ఉంటుందని నిమ్మగడ్డ రమేష్‌కుమార్ చెప్పుకొచ్చారు. సాయంత్రం వీడియో కాన్ఫరెన్స్ నిర్వహిస్తున్నామని... సీఎస్, డీజీపీలు సహా ఎన్నికల విధుల్లో పాల్గొనే అధికారులు వీడియో కాన్ఫరెన్సులో పాల్గొనాలని కోరారు. సెక్రటరీ, జాయింట్ సెక్రటరీ, జేడీ ఇలా ఎవ్వరూ లేరని.. అయినా ఎన్నికలు జరిపి తీరుతామని తేల్చిచెప్పారు. ప్రస్తుత పరిస్థితుల్లో ఎన్నికల నిర్వహణ తమకు పెను సవాల్ అని ఎస్‌ఈసీ నిమ్మగడ్డ రమేష్ కుమార్ చెప్పారు.
related stories
-
జాతీయం-అంతర్జాతీయం ఎన్నికల ముందు కాంగ్రెస్‌కు షాక్.. బీజేపీలోకి సీనియర్ నేత?
-
తాజావార్తలు మమతపై పోటీకి సై.. 12న సువేందు నామినేషన్
-
రాజకీయాలు ఇప్పుడు అందరి కళ్ల ఆయనపైనే.. ఒక్కసారిగా సీఎం క్యాండిడేట్ అయ్యారు..!