Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
రాజ్యసభ ఎన్నికల షెడ్యూల్ విడుదల...జూన్ 18న పోలింగ్!

రాజ్యసభ ఎన్నికల షెడ్యూల్ విడుదల...జూన్ 18న పోలింగ్!

దేశవ్యాప్తంగా ఖాళీ కానున్న రాజ్యసభ స్థానాల భర్తీకి కేంద్ర ఎన్నికల సంఘం గురువారం నాడు కీలక ప్రకటన చేసింది. పది రాష్ట్రాల పరిధిలోని మొత్తం 24 రాజ్యసభ స్థానాలకు సంబంధించిన ఎన్నికల షెడ్యూల్‌ను ఈసీ అధికారికంగా విడుదల చేసింది.

రాబోయే జూన్, జూలై నెలల్లో పలువురు సభ్యుల పదవీకాలం ముగియనుండటంతో ఈ ఖాళీలను భర్తీ చేసేందుకు వీలుగా తాజా ప్రక్రియను ప్రారంభించారు. ఎన్నికల సంఘం ప్రకటించిన వివరాల ప్రకారం.. ఈ 24 స్థానాలకు జూన్ 18వ తేదీన ఉదయం నుంచి పోలింగ్ నిర్వహించనున్నారు. ఈ ఎన్నికలకు సంబంధించిన అధికారిక నోటిఫికేషన్ జూన్ 1వ తేదీన వెలువడనుంది.

అదే రోజు నుంచి అభ్యర్థులు తమ నామినేషన్లను దాఖలు చేయవచ్చు. నామినేషన్ల దాఖలుకు జూన్ 8వ తేదీని చివరి గడువుగా నిర్ణయించారు. అనంతరం జూన్ 9వ తేదీన దాఖలైన నామినేషన్ల పరిశీలన ప్రక్రియ కొనసాగుతుంది. పోటీ నుంచి తప్పుకోవాలనుకునే అభ్యర్థులు తమ నామినేషన్లను ఉపసంహరించుకోవడానికి జూన్ 11వ తేదీ వరకు సమయం ఇచ్చారు.

జూన్ 18న పోలింగ్ ముగిసిన వెంటనే, అదే రోజు సాయంత్రం 5 గంటల నుంచి ఓట్ల లెక్కింపు చేపట్టి ఫలితాలు వెల్లడిస్తారు. జూన్ 20వ తేదీ నాటికి ఈ ఎన్నికల ప్రక్రియ అంతా పూర్తి కానుంది. ఈ ఎన్నికల్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించి కూడా అత్యంత కీలక పరిణామాలు చోటు చేసుకోనున్నాయి. ఏపీ నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న నలుగురు ప్రముఖ సభ్యుల పదవీకాలం ఈ జూన్ 26తో పూర్తి కానుంది.

ఇందులో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి చెందిన పిల్లి సుభాష్ చంద్రబోస్, ఆళ్ల అయోధ్యరామిరెడ్డితో పాటు పరిమళ్ నత్వానీ, సానా సతీష్‌లు ఉన్నారు. ఈ నేపథ్యంలో ఏపీలోని ఈ నాలుగు స్థానాలకు కూడా జూన్ 18నే పోలింగ్ జరగనుంది. ఈ ఎన్నికల షెడ్యూల్ విడుదల కావడంతో ఆయా రాష్ట్రాల్లోని రాజకీయ పార్టీలు ఇప్పటికే తమ వ్యూహాలకు పదును పెడుతున్నాయి. అసెంబ్లీలో ఉన్న బలబలాల ఆధారంగా సీట్లను దక్కించుకునేందుకు ముమ్మర ప్రయత్నాలు మొదలయ్యాయి.

ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్‌లో మారిన రాజకీయ సమీకరణాల నేపథ్యంలో ఈ నాలుగు స్థానాలు ఏ పార్టీ ఖాతాలోకి వెళ్తాయనే అంశంపై రాజకీయ వర్గాల్లో ఆసక్తికర చర్చ నడుస్తోంది. పెద్దల సభలో తమ బలాన్ని పెంచుకునేందుకు అటు అధికార కూటమి, ఇటు ప్రతిపక్షాలు అభ్యర్థుల ఎంపికపై కసరత్తులు ప్రారంభించాయి. జూన్ మొదటి వారంలో నామినేషన్ల ప్రక్రియ ప్రారంభం కానుండటంతో, రాబోయే రోజుల్లో దేశవ్యాప్తంగా రాజకీయ వేడి మరింత పెరిగే అవకాశం కనిపిస్తోంది.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Telugu One