టాలీవుడ్ సీనియర్ హీరో, వర్సటైల్ యాక్టర్ జగపతి బాబు సినిమా ఇండస్ట్రీలో ఎప్పుడూ విభిన్నమైన వ్యక్తిగా గుర్తింపు తెచ్చుకున్నారు. ముక్కుసూటిగా మాట్లాడుతూ, తన మనసులోని భావాలను కుండబద్దలు కొట్టినట్లు చెప్పడం ఆయన నైజం.
తెరపై విలన్‌గా, క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా రాణిస్తున్న 'జగ్గూ భాయ్'.. తాజాగా సమాజం, కుటుంబ వ్యవస్థ, మరియు పిల్లల పెంపకంపై చేసిన కొన్ని సంచలన వ్యాఖ్యలు ఇప్పుడు ఇండస్ట్రీ వర్గాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారాయి. ఇటీవల ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న జగపతి బాబు.. ప్రస్తుత ప్రపంచ పోకడలపై తనదైన శైలిలో స్పందించారు.
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI), రోబోటిక్స్ వంటి టెక్నాలజీ శరవేగంగా విస్తరిస్తున్న ఈ కాలంలో మానవ సంబంధాలు పూర్తిగా కనుమరుగవుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. భవిష్యత్తు కాలం చాలా భయంకరంగా మారబోతోందని, కళ్లముందే కలియుగం కనిపిస్తోందని అన్నారు. ఇలాంటి విపత్కర పరిస్థితులున్న సమాజంలోకి కేవలం మన స్వార్థం, సంతోషం కోసం పిల్లలను తీసుకురావడం కరెక్ట్ కాదని ఆయన అభిప్రాయపడ్డారు. ఇదే క్రమంలో వివాహ వ్యవస్థ, పిల్లలపై తల్లిదండ్రుల ఒత్తిడి గురించి కూడా ఆయన బోల్డ్ స్టేట్మెంట్స్ ఇచ్చారు.
బాధ్యత అనే పేరుతో పిల్లలపై పెళ్లిళ్లు, కెరీర్ ఒత్తిడి తీసుకురావడం ప్రేమ అనిపించుకోదని స్పష్టం చేశారు. గతంలో తన పెద్ద కుమార్తెకు పెళ్లి చేయడం ఒక తప్పు నిర్ణయమని పేర్కొన్న ఆయన.. తన చిన్న కుమార్తెకు తాను పెళ్లి చేయనని, ఆమెకు నచ్చినట్లు బతికే స్వేచ్ఛను ఇస్తానని వెల్లడించారు. అలాగే తన పెద్ద కూతురు పిల్లలను కననని, అవసరమైతే దత్తత తీసుకుంటానని చెబితే తాను పూర్తి మద్దతు ప్రకటించానని జగపతి బాబు చెప్పుకొచ్చారు.
ఒకప్పుడు టాలీవుడ్‌లో ఫ్యామిలీ హీరోగా మహిళా ప్రేక్షకుల గుండెల్లో చెరగని ముద్ర వేసుకున్న జగపతి బాబు, సెకండ్ ఇన్నింగ్స్‌లో 'లెజెండ్' సినిమాతో పవర్‌ఫుల్ విలన్‌గా మారారు. అప్పటినుంచి సౌత్ ఇండియాలోనే మోస్ట్ వాంటెడ్ క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా దూసుకుపోతున్నారు. కేవలం సినిమాల్లోనే కాకుండా నిజ జీవితంలోనూ ఆయన జీవన తత్వానికి, వైవిధ్యమైన ఆలోచనలకు నెటిజన్లు ఆకర్షితులవుతుంటారు. ప్రస్తుతం ఈ సీనియర్ నటుడు చేసిన వ్యాఖ్యలపై సోషల్ మీడియా వేదికగా భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
కొంతమంది ఆయన ఆలోచనలు చాలా అడ్వాన్స్‌డ్‌గా ఉన్నాయని, ప్రాక్టికల్ లైఫ్‌కు దగ్గరగా మాట్లాడారని ప్రశంసిస్తుంటే.. మరికొందరు మాత్రం సాంప్రదాయ కుటుంబ వ్యవస్థను కించపరిచేలా ఉన్నాయంటూ భిన్నమైన కామెంట్లు పెడుతున్నారు. ఏదేమైనా జగ్గూ భాయ్ లేవనెత్తిన ప్రశ్నలు ఇప్పుడు నెట్టింట తెగ వైరల్ అవుతున్నాయి.

