సాధారణంగా ఆన్‌లైన్ మోసాలు చిన్న మొత్తాలకే పరిమితమవుతాయనుకునే సమయంలో.. రూ.24 కోట్ల రూపాయల మోసం కేసు కలకలం సృష్టించింది. హైదరాబాద్ కేంద్రంగా పనిచేస్తున్న ఒక అంతర్జాతీయ స్థాయి సైబర్ క్రైమ్ నెట్‌వర్క్‌ను కొచ్చి సిటీ పోలీసులు ఛేదించడం ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది.
ఈ కేసులో ప్రధాన నిందితుడు హైదరాబాద్‌కు చెందిన వ్యాపారి అల్లంరాజు సత్యనారాయణ మూర్తి అరెస్ట్ కావడం హాట్ సంచలనం సృష్టించింది. నిందితుడు కేరళలోని ఎర్నాకుళం ప్రాంతానికి చెందిన ఒక వ్యక్తిని లక్ష్యంగా చేసుకుని ఈ మోసానికి పథక రచన చేశాడు. మొదట నమ్మకాన్ని సంపాదించి.. తర్వాత చిన్న చిన్న ట్రాన్సాక్షన్లతో బాధితుడి విశ్వాసాన్ని చూరగొని ఆ తరువాత వలలో దింపాడు.
చివరికి పెద్ద మొత్తంలో డబ్బులు వసూలు చేశాడు. ఈ వివరాలు దర్యాప్తులో బయటపడ్డాయి. బాధితుడి నుంచి దాదాపు 24 కోట్ల రూపాయలను వివిధ దశల్లో వసూలు చేసినట్లు సమాచారం. ఆ తర్వాత ఈ నిధులను సూటిగా కాకుండా..
అనేక డిజిటల్ మార్గాల ద్వారా విదేశాలకు తరలించినట్లు దర్యాప్తు సంస్థలు చెబుతున్నాయి. షాకింగ్ అంశం ఏమిటంటే, ఈ విధంగా వసూలు చేసిన డబ్బును కేవలం దాచడానికే కాకుండా, విదేశాల్లో మైనింగ్ లో పెట్టుబడులు పెట్టినట్లుగా అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. దీంతో ఈ నెట్‌వర్క్ కేవలం లోకల్ గ్యాంగ్ కాదు, అంతర్జాతీయ స్థాయిలో పనిచేస్తున్న వ్యవస్థలా కనిపిస్తోందని పోలీసులు చెబుతున్నారు. నైజీరియా తరహా సైబర్ మోసగాళ్ల మోడల్‌ను పోలి ఉండటంతో, నిందితుడికి మరిన్ని దేశాలతో సంబంధాలు ఉన్నాయా అనే కోణంలో కూడా విచారణ కొనసాగుతోంది.కేసు నమోదు అయిన వెంటనే కొచ్చి సిటీ పోలీసులు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి వేగంగా దర్యాప్తు ప్రారంభించారు. టెక్నికల్ ట్రాకింగ్, డిజిటల్ ఫుట్‌ప్రింట్స్ ఆధారంగా నిందితుడి లొకేషన్‌ను గుర్తించి హైదరాబాద్‌లో ఆపరేషన్ నిర్వహించి... వ్యాపారి సత్యనారాయణ మూర్తిని అదుపులోకి తీసుకు న్నారు.తరువాత అతడిని కొచ్చి కి తరలించి ఇంటెన్సివ్ విచారణ చేస్తున్నారు.

