Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
రూ.450 కోట్ల ఆరోపణలు నిరాధారం.. బహిరంగ చర్చకు సిద్ధం :  ప్రేమ్ సాగర్ రావు

రూ.450 కోట్ల ఆరోపణలు నిరాధారం.. బహిరంగ చర్చకు సిద్ధం : ప్రేమ్ సాగర్ రావు

మంచిర్యాల ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావు తనపై వస్తున్న ఆరోపణలను తీవ్రంగా ఖండించారు. తాను ఎలాంటి అక్రమాలకు పాల్పడలేదని స్పష్టం చేసిన ఆయన... ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాకు చెందిన కొందరు ప్రజాప్రతినిధులు తనపై కావాలనే తప్పుడు ప్రచారం చేస్తున్నారని ఆరోపించారు.

సొంత పత్రికలతో పాటు ఇతర పత్రికల్లోనూ అసత్య కథనాలు ప్రచురింపజేస్తున్నారని విమర్శించారు. తనపై తప్పుడు ప్రచారం చేస్తున్న వారిని వదిలిపెట్టబోనని హెచ్చరించిన ఎమ్మెల్యే... సంబంధిత వ్యక్తులు, పత్రికలపై చట్టపరమైన చర్యలు తీసుకుంటానని తెలిపారు. తనపై జరుగుతున్న కుట్రలన్నీ త్వరలో బయటపడతాయని, ఆరోపణలు చేస్తున్న వారు బహిరంగ చర్చకు రావాలని సవాల్ విసిరారు.

తాను రూ.450 కోట్లను దుర్వినియోగం చేశానన్న ఆరోపణలు పూర్తిగా అవాస్తవమని ప్రేమ్ సాగర్ రావు స్పష్టం చేశారు. 2009-10లో బ్యాంకు రూ.450 కోట్ల రుణాన్ని మంజూరు చేసిందని, సాయినాథ్ ప్రైవేట్ లిమిటెడ్, భాగ్యనగర్ హోటల్స్ పేర్లపై ఆ రుణాలు తీసుకున్నామని వివరించారు. రుణ మంజూరు ఉత్తర్వులు తాను సృష్టించినవి కాదని చెప్పారు. 2014 నుంచి 2025 వరకు కంపెనీ వినియోగించిన నిధులు రూ.109 కోట్ల 11 లక్షలేనని, అన్ని బ్యాంకులు కూడా అంతే మొత్తాన్ని ఎన్‌పీఏగా గుర్తించాయని తెలిపారు.

అదే కాలంలో రూ.44 కోట్ల 81 లక్షలు చెల్లించామని, ఆంధ్ర బ్యాంక్ ఎన్‌పీఏ అయిన తర్వాత కూడా రూ.18 కోట్ల 72 లక్షలు చెల్లించామని చెప్పారు. 2024 అక్టోబర్ 31 నుంచి చెల్లింపులు కొనసాగుతున్నాయని వెల్లడించారు. రాష్ట్రవ్యాప్తంగా తాను 15 పాఠశాలలు నిర్మించానని పేర్కొన్న ఎమ్మెల్యే... కాంగ్రెస్ అధికారంలో ఉన్నప్పటికీ అధికార దుర్వినియోగానికి పాల్పడలేదని అన్నారు.

ఇసుక, భూముల వ్యవహారాల్లోనూ ఎలాంటి అక్రమాలకు పాల్పడలేదని స్పష్టం చేశారు. అమెరికా ట్రేడింగ్ మార్కెట్ పతనం తర్వాత రూ.160 కోట్ల నష్టం వాటిల్లిందని వెల్లడించారు. నిజానిర్ధారణ కమిటీ ఏర్పాటు చేస్తే పూర్తి ఆధారాలు సమర్పించేందుకు సిద్ధమని ప్రేమ్ సాగర్ రావు తెలిపారు. మంత్రి పదవి చర్చకు వచ్చిన ప్రతిసారి తనపై ఇలాంటి ప్రచారం జరుగుతోందని ఆరోపించిన ఆయన... తమ జిల్లా నాయకులే తనపై కుట్ర చేశారని అన్నారు. తనపై వచ్చిన ప్రతి ఆరోపణపై ఎక్కడైనా బహిరంగ చర్చకు సిద్ధమని ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావు స్పష్టం చేశారు. MLA Prem Sagar Rao, CM Revanth reddy, Congress party, Allegations False,Legal Action Warning, Political Conspiracy Claim

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Telugu One