Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
సైబర్ నేరాలు, డ్రగ్స్‌పై తెలంగాణ పోలీసుల ఉక్కుపాదం : డీజీపీ

సైబర్ నేరాలు, డ్రగ్స్‌పై తెలంగాణ పోలీసుల ఉక్కుపాదం : డీజీపీ

తెలంగాణలో క్రైమ్ రేట్‌పై డీజీపీ సీవీ ఆనంద్ కీలక సమీక్ష..! రాష్ట్రంలో నేరాల కట్టడి, ఫ్రెండ్లీ పోలీసింగ్ విధానంపై తెలంగాణ రాష్ట్ర పోలీసు డైరెక్టర్ జనరల్ (డీజీపీ) సీవీ ఆనంద్ ఉన్నతాధికారులతో సమగ్ర సమీక్షా సమావేశం నిర్వహించారు.

పోలీస్ కమిషనర్లు, ఎస్పీలు మరియు ఉన్నతాధికారులతో జరిగిన ఈ సమావేశంలో శాంతిభద్రతల పరిరక్షణ, నేర పరిశోధనలో పాటించాల్సిన నైపుణ్యాలపై ఆయన స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. కేవలం గణాంకాలకే పరిమితం కాకుండా నేరాల ధోరణిని లోతుగా విశ్లేషించి ముందస్తు చర్యలు తీసుకోవాలని స్పష్టం చేశారు. సమీక్షా సమావేశంలో ప్రధానంగా విజిబుల్ పోలీసింగ్, క్షేత్రస్థాయి తనిఖీలపై డీజీపీ ప్రత్యేక దృష్టి సారించారు. స్టేషన్ అధికారులు ప్రజలకు నిరంతరం అందుబాటులో ఉండాలని, బాధితుల ఫిర్యాదులపై తక్షణమే స్పందించాలని ఆదేశించారు.

పోలీస్ స్టేషన్లలో విజిటింగ్ అవర్స్ కచ్చితంగా అమలు చేయాలని, అధికారులు క్యాంప్ ఆఫీసుల కంటే సొంత కార్యాలయాల నుంచే ఎక్కువగా విధులు నిర్వహించాలని పేర్కొన్నారు. నగరాలు మరియు గ్రామీణ ప్రాంతాల్లో పెరుగుతున్న సైబర్ నేరాలు, మాదకద్రవ్యాల (నార్కోటిక్స్) రవాణాను తీవ్రంగా పరిగణించాలని సీవీ ఆనంద్ హెచ్చరించారు. ముఖ్యంగా యువతను పట్టిపీడిస్తున్న గంజాయి, డ్రగ్స్ విక్రయాలపై ఉక్కుపాదం మోపాలన్నారు. విద్యాసంస్థల్లో యాంటీ డ్రగ్ కమిటీలను క్రియాశీలకం చేసి, నిరంతర నిఘా ఉంచాలని అధికారులకు దిశానిర్దేశం చేశారు.

సివిల్ తగాదాలు, ముఖ్యంగా భూవివాదాల విషయంలో పోలీసులు జోక్యం చేసుకోకూడదని డీజీపీ మరోసారి తేల్చిచెప్పారు. సోషల్ మీడియాలో వచ్చే తప్పుడు ప్రచారాలు, శాంతిభద్రతలకు విఘాతం కలిగించే పుకార్లపై అప్రమత్తంగా ఉండాలని సూచించారు. సీసీటీఎన్‌ఎస్, ఇ-సాక్ష్య వంటి డిజిటల్ ప్లాట్‌ఫారమ్‌లను సమర్థవంతంగా వినియోగించుకుని కేసుల పరిశోధనను వేగవంతం చేయాలని స్పష్టం చేశారు. ఈ సందర్భంగా క్షేత్రస్థాయిలో విశేష సేవలు అందించిన పలువురు పోలీసు అధికారులను డీజీపీ అభినందించి పురస్కారాలు ప్రకటించారు.

అత్యవసర సమయాల్లో డయల్ 100 ఫిర్యాదులపై త్వరితగతిన స్పందించి ప్రాణాలు కాపాడిన అధికారులు, సంక్లిష్టమైన కేసులను ఛేదించి నిందితులకు శిక్ష పడేలా చేసిన ఇన్వెస్టిగేషన్ అధికారులను ప్రత్యేకంగా మెచ్చుకున్నారు. సాంకేతిక పరిజ్ఞానాన్ని గరిష్ఠంగా వాడుకుంటూ, ఫ్రెండ్లీ పోలీసింగ్ స్ఫూర్తితో బాధితులకు వేగవంతమైన న్యాయం అందించడమే తెలంగాణ పోలీసుల ప్రధాన లక్ష్యమని సీవీ ఆనంద్ తెలిపారు. రాబోయే రోజుల్లో లివర్ డ్రోన్ టెక్నాలజీతో డయల్ 112 ను అనుసంధానించడం వంటి ఆధునిక సంస్కరణలతో పోలీసింగ్ వ్యవస్థను మరింత బలోపేతం చేస్తామని వివరించారు. Telangana DGP CV Anand, Crime Review Meeting Telangana, Telangana Police Modernization, Narcotics Cyber Crimes Telangana, Law and Order Telangana News

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Telugu One