Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
సైకిలెక్కిన భూమన..విషయమేంటంటే?

సైకిలెక్కిన భూమన..విషయమేంటంటే?

తిరుమల తిరుపతి దేవస్థానం మాజీ చైర్మన్, వైసీపీ సీనియర్ నాయకుడు భూమన కరుణాకర్ రెడ్డి సైకిలెక్కారు. తిరుపతి నగరంలో ఆయన సైకిల్ పై తిరుగుతూ అందరి దృష్టినీ ఆకర్షించారు.

పశ్చిమాసియా ప్రాంతంలో నెలకొన్న ఉద్రిక్త పరిస్థితులు, యుద్ధ వాతావరణం నేపథ్యంలో దేశంలో ఇంధనాన్ని పొదుపు చేయాలంటూ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పిలుపునకు స్పందించి భూమన తిరుపతి నగర వీధుల్లో దాదాపు 10 కిలోమీటర్ల మేర సైకిల్ తొక్కుతూ ప్రజల్లో ఇంధన పొదుపుపై అవగాహన కల్పించారు. దీనికి సంబంధించిన దృశ్యాలు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అయ్యాయి. వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి అత్యంత విశ్వాసపాత్రుడిగా, తెలుగుదేశం పార్టీ విధానాలను తీవ్రంగా వ్యతిరేకించే నాయకుడిగా భూమన కరుణాకర్ రెడ్డి ప్రత్యేక గుర్తింపు పొందారు. సాధారణంగా అవకాశం ఉన్నా లేకున్నా టీడీపీపై విమర్శలు చేయడమే పనిగా పెట్టుకునే భూమన..

ఆ పార్టీ ఎన్నికల గుర్తు అయిన సైకిల్‌ను ఎక్కి ప్రయాణించడంపై సర్వత్రా చర్చ జరుగుతోంది. ప్రధాని పిలుపునిచ్చిన వెంటనే కాకుండా.. రాష్ట్రంలో అధికార కూటమి నేతలు ఇంధన పొదుపు కార్యక్రమాలను ప్రారంభించిన తర్వాత భూమన సైకిల్ ప్రయాణం చేయడంపై భిన్న అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. ఈ పరిణామంపై రాజకీయ విశ్లేషకులతో పాటు సామాన్య ప్రజలు సైతం స్పందిస్తున్నారు.

ప్రత్యర్థి పార్టీ గుర్తుపై ప్రయాణించినప్పటికీ, ఇంధన పొదుపు అనే మంచి ఆశయం కోసం ఆయన ఈ నిర్ణయం తీసుకున్నారని భూమన అనుచరులు సమర్ధించుకుంటున్నారు. అదలా ఉంటే భూమన సైకిల్ ప్రయాణానికి సంబంధించిన వార్తా కథనాలను వైసీపీ అనుకూల మీడియా సంస్థలు కూడా ప్రముఖంగా ప్రసారం చేయడం విశేషం. పర్యావరణ పరిరక్షణ, దేశ ఆర్థిక భద్రత దృష్ట్యా ప్రతి ఒక్కరూ వారంలో కనీసం ఒకరోజు ఇలాంటి ప్రత్యామ్నాయ మార్గాలను ఎంచుకోవాలని భూమన ఈ సందర్భంగా సూచించారు. ప్రధాని మోదీ పిలుపుతో దేశవ్యాప్తంగా వివిధ రాష్ట్రాల ముఖ్యమంత్రులు, మంత్రులు, ప్రజాప్రతినిధులు రకరకాలుగా తమ మద్దతును ప్రకటిస్తున్నారు. మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఇంధన పొదుపు కోసం బైక్ ఉపయోగించగా, బిహార్ ఉపముఖ్యమంత్రి సామ్రాట్ చౌదరి ప్రతి శుక్రవారం కాలినడకన సచివాలయానికి వెళ్లాలని నిర్ణయించుకున్నారు. ఆంధ్రప్రదేశ్‌లోనూ నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి స్కూటీపై ప్రయాణించారు.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Telugu One