భారతదేశ స్వాతంత్ర్య సంగ్రామంలోనూ, సమాజంలో పేరుకుపోయిన అసమానతలను రూపుమాపే సామాజిక విప్లవంలోనూ ఏకకాలంలో క్రియాశీలక పాత్ర పోషించిన అరుదైన ధీశాలి మధురై వైద్యనాథ అయ్యర్.
సమాజంలో అందరూ సమానమే అనే భావనను చాటిచెబుతూ, అణగారిన వర్గాల హక్కుల కోసం ఆయన చేసిన పోరాటం చరిత్రలో సువర్ణాక్షరాలతో లిఖించబడింది. దళిత సమాజానికి దేవాలయాల్లోకి ప్రవేశించే హక్కును కల్పించడం కోసం స్వయంగా గర్భగుడి వరకు వారితో కలిసి నడిచిన ఆయన అడుగులు హిందూ సమాజంలో సమానత్వం, సేవ, సామరస్యాల కలయికకు నిదర్శనంగా నిలుస్తాయి. 1890 మే 16వ తేదీన అప్పటి మద్రాస్ ప్రెసిడెన్సీ పరిధిలోని తంజావూరు ప్రాంతానికి చెందిన విశ్వనంపేటలో ఒక సాంప్రదాయ బ్రాహ్మణ కుటుంబంలో జన్మించిన వైద్యనాథ అయ్యర్.. మధురై సెతుపతి ఉన్నత పాఠశాల, మదురా కళాశాలల్లో విద్యాభ్యాసం పూర్తి చేశారు.
ఆ తర్వాత మద్రాస్ ప్రెసిడెన్సీ కళాశాల నుంచి బీఏ పట్టా పొందారు. గణిత శాస్త్రంలోనూ, విద్యలోనూ ఆయన కనబరిచిన ప్రతిభకు గాను బంగారు పతకాలను కైవసం చేసుకున్నారు. తొలుత ఉపాధ్యాయుడిగా, ఆపై న్యాయవాదిగా తన వృత్తిని ప్రారంభించినప్పటికీ.. దేశంలో ఉవ్వెత్తున ఎగసిపడుతున్న జాతీయవాద ఉద్యమం ఆయనను ఆకర్షించింది.
ముఖ్యంగా బిపిన్ చంద్ర పాల్ వంటి అగ్రనేతల ప్రసంగాల ప్రభావంతో ఆయన స్వాతంత్ర్య సమరంలోకి అడుగుపెట్టారు. మహాత్మా గాంధీ పిలుపునందుకుని సహాయనిరాకరణ ఉద్యమం, వేదారణ్యం ఉప్పు సత్యాగ్రహం, క్విట్ ఇండియా ఉద్యమాల్లో పాల్గొని జైలు శిక్ష అనుభవించారు. ఆయనకు స్వాతంత్ర్య పోరాటం అనేది కేవలం ఒక రాజకీయ ఉద్యమం మాత్రమే కాదు.. సమాజంలో సమానత్వాన్ని తీసుకువచ్చే ఒక నైతిక బాధ్యతగా భావించారు.
తమిళనాడు హరిజన్ సేవక్ సంఘ్ అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత వైద్యనాథ అయ్యర్ తన జీవితాన్ని సామాజిక సంస్కరణలకు పూర్తిగా అంకితం చేశారు. అస్పృశ్యత అనేది హిందూ ధర్మానికే పెద్ద శాపమనీ, కుల వివక్షలు, ద్వేషాలు మతాచారాలకు పూర్తి వ్యతిరేకమని ఆయన బలంగా నమ్మారు. దళితులకు ఆలయ ప్రవేశం కల్పించాలనే డిమాండ్‌ను ఆయన ఒక చట్టపరమైన సమస్యగా మాత్రమే చూడకుండా.. సమాజపు అంతరాత్మను మేల్కొలిపే నైతిక అంశంగా ముందుకు తీసుకెళ్లారు.
ఇందుకోసం ఆయన దళిత బస్తీలలో స్వయంగా పర్యటించి అవగాహన సదస్సులు నిర్వహించారు. అస్పృశ్యతను నిర్మూలించాలి, ఆలయాల తలుపులు అందరి కోసం తెరవాలి అంటూ విస్తృతంగా ప్రచార యాత్రలు చేపట్టారు. హరిజన సేవాశ్రమం ద్వారా వెనుకబడిన వర్గాల పిల్లలకు విద్యనందించడం, సేవా కార్యక్రమాలు చేపట్టడం వంటి పనుల ద్వారా వారి జీవితాల్లో వెలుగులు నింపేందుకు ప్రయత్నించారు. చరిత్ర పుటల్లో మధురై మిరాకిల్ గా పిలవబడే చారిత్రాత్మక ఘట్టం 1939 జూలై 8వ తేదీ ఉదయం చోటుచేసుకుంది.
ఆ రోజు ఉదయం సరిగ్గా 8:45 గంటలకు మధురైలోని ప్రసిద్ధ మీనాక్షి సుందరేశ్వరర్ ఆలయ దక్షిణ గోపురం గుండా దళిత వర్గాలకు చెందిన ప్రజలు తొలిసారిగా అధికారికంగా ఆలయంలోకి ప్రవేశించారు. వైద్యనాథ అయ్యర్ స్వయంగా ముందుండి ఈ బృందాన్ని నడిపించగా.. ప్రముఖ దళిత నాయకుడు పి. కక్కన్ మరియు ఇతర ముఖ్య నేతలు ఆయన వెంట నడిచారు.
అప్పటివరకు అమల్లో ఉన్న కఠినమైన నిషేధాలను, సామాజిక ఆంక్షలను ధిక్కరిస్తూ సంపూర్ణ గాంధేయ పద్ధతిలో శాంతియుతంగా వారు గర్భగుడి వైపు అడుగులు వేశారు. ఈ చారిత్రక విజయానికి 1939 నాటి టెంపుల్ ఎంట్రీ ఆథరైజేషన్ అండ్ ఇండెమ్నిటీ యాక్ట్ చట్టం పునాది వేసినప్పటికీ.. సమాజంలో నెలకొన్న తీవ్ర వ్యతిరేకతను అధిగమించి ఆ చట్టాన్ని ఆచరణలోకి తీసుకురావడానికి వైద్యనాథ అయ్యర్ చూపిన అసాధారణ ధైర్యసాహసాలే కారణం. ఆ రోజు మీనాక్షి అమ్మవారి కోవెలలోకి ప్రవేశించింది కేవలం కొద్దిమంది వ్యక్తులు మాత్రమే కాదు..
శతాబ్దాల అణచివేతకు గురైన ఒక సమూహం ఆత్మగౌరవం ఆ ప్రాంగణంలో నిటారుగా నిలబడింది. మహాత్మా గాంధీ ప్రారంభించిన హరిజనోద్యమం, ఆయన మధురై పర్యటనల సందర్భంలో అస్పృశ్యతకు వ్యతిరేకంగా చేసిన ప్రసంగాలు వైద్యనాథ అయ్యర్ ఆలోచనా విధానాన్ని తీవ్రంగా ప్రభావితం చేశాయి. ఆయన దృష్టిలో సమానత్వం, సేవ, సామరస్యం అనే త్రిసూత్రాలే నిజమైన హిందూ ధర్మానికి మూలస్తంభాలు. కులాల పేరిట మనుషులను వేరు చేయడం, అస్పృశ్యతను పాటించడం వంటివి ధర్మానికి పట్టిన వికృతులుగా ఆయన కొట్టిపారేశారు.
ఆలయ ప్రవేశ ఉద్యమం అనేది కేవలం పూజా విధానాల్లో మార్పు కోసం చేసిన ప్రయత్నం కాదు.. అది సమాజంలో సామాజిక న్యాయాన్ని స్థాపించడానికి జరిగిన ఒక గొప్ప యజ్ఞం. కుల వివక్ష లేని సమాజ స్థాపన కోసమే ఆయన తన జీవితాంతం ఆచరణాత్మక పోరాటం సాగించారు. 955 ఫిబ్రవరి 22న వైద్యనాథ అయ్యర్ భౌతికంగా ఈ లోకాన్ని విడిచివెళ్లినప్పటికీ, సామాజిక సంస్కరణల చరిత్రలో ఆయన పేరు శాశ్వతంగా నిలిచిపోయింది.
తమిళనాడు హరిజన్ సేవక్ సంఘ్ ఆయన అందించిన సేవలను స్మరిస్తూ ఆయనను గౌరవపూర్వకంగా హరిజన తండ్రి గా అభివర్ణించింది. ఆయన చేసిన పోరాటాలు, ఆదర్శాల నేపథ్యంలో నేడు భారత రాజ్యాంగం పౌరులందరికీ సమానత్వ హక్కును, సామాజిక న్యాయాన్ని కల్పించింది. చట్టపరంగా వివక్షలు నిషేధించబడినప్పటికీ, నేటి ఆధునిక సమాజంలో కూడా అక్కడక్కడా అసమానతల నీడలు ఇంకా పూర్తిగా తొలగిపోలేదు. ఇలాంటి పరిస్థితుల్లో మధురై వైద్యనాథ అయ్యర్ వంటి మహనీయుల జీవితం మనకు ఒక దిక్సూచిగా నిలుస్తుంది.
సమాజం లోపల ఉన్న లోపాలను సరిదిద్దుకుంటూనే సంస్కరణలు సాధించవచ్చని ఆయన ఆచరించి చూపారు. నాడు ఆలయాల తలుపులను అందరి కోసం తెరిపించడం ద్వారా ఆయన తన కర్తవ్యాన్ని నెరవేర్చారు, అయితే నేటి తరం చేయవలసిన పని మనుషుల మధ్య ఉన్న కులగోడలను బద్దలు కొట్టి, హృదయాల ద్వారాలను తెరవడమే. ఆ మహనీయుడి ఆశయాలను కొనసాగించడమే మనకు ఆయనకు ఇచ్చే నిజమైన నివాళి. (వైద్యనాథ అయ్యర్ జయంతి సందర్భంగా) -సీతారాం కంఠంనేని ఈ విశ్లేషణ మీకు నచ్చినట్లయితే, దయచేసి https://www.teluguone.com పోర్టల్ ను ఫాలో అవ్వండి. లైక్ చేయండి. షేర్ చేయండి. మీ విలువైన అభిప్రయాలను తెలియజేయండి.

