Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
సంచలన `జయం`కి 19 ఏళ్ళు!

సంచలన `జయం`కి 19 ఏళ్ళు!

తెలుగునాట ఎన్నో ప్రేమకథా చిత్రాలు సందడి చేశాయి. అయితే, చరిత్ర సృష్టించిన సినిమాలు మాత్రం కొన్నే. అందులో `జయం` ఒకటి. నితిన్, సదాని హీరోహీరోయిన్లుగా పరిచయం చేస్తూ సెన్సేషనల్ డైరెక్టర్ తేజ రూపొందించిన ఈ చిత్రంలో గోపీచంద్ ప్రతినాయకుడిగా నటించారు. రఘు (గోపీచంద్), సుజాత (సదా)కి చిన్నప్పుడే వాళ్ళ పెద్దలు పెళ్ళి నిర్ణయిస్తారు. అయితే రఘు - సుజాతకి ఒకరంటే ఒకరికి పడదు. కొన్ని కారణాల వల్ల రఘు కుటుంబం వేరే ఊరికి వెళుతుంది. కట్ చేస్తే.. యుక్త వయసుకి వచ్చిన సుజాతని వెంకట్ (నితిన్) ప్రేమిస్తాడు. సుజాత కూడా క్రమంగా అతణ్ణి ఇష్టపడుతుంది. ఇదే సమయంలో.. రఘు, సుజాతకి పెళ్ళి నిశ్చయవుతుంది. దుర్మార్గుడైన రఘు బారి నుండి ప్రేమజంట వెంకట్, సదా ఎలా తప్పించుకుంది?

వారి ప్రేమకథ ఎలా `జయం` సాధించింది? అనే కథాంశంతో `జయం` తెరకెక్కింది. ఆర్పీ పట్నాయక్ స్వరకల్పనలో రూపొందిన పాటలన్నీ అప్పట్లో యువతరాన్ని ఉర్రూతలూగించాయి. ``రాను రానంటూనే``, ``అందమైన మనసులో``, ``ఎవ్వరు ఏమన్నా``, ``ప్రియతమా``, `` బండి బండి``, ``వీరి వీరి గుమ్మడిపండు``..

ఇలా ఇందులోని గీతాలన్ని వీనులవిందుగానూ, కనువిందుగానూ సాగాయి. అలాగే బిట్ సాంగ్స్ కూడా అలరించేలా ఉంటాయి. ఇక సదా నోటివెంట వచ్చే ``వెళ్ళవయ్యా వెళ్ళు`` అనే డైలాగ్ కూడా అప్పట్లో బాగా ప్రాచుర్యం పొందింది. `ఉత్తమ హాస్యనటుడు` (సుమన్ శెట్టి), `ఉత్తమ బాల నటి` (శ్వేత), `ఉత్తమ ప్రతినాయకుడు` (గోపీచంద్), `ఉత్తమ అనువాద కళాకారిణి` (సునీత) విభాగాల్లో `నంది` పురస్కారాలను..

`ఉత్తమ నూతన నటుడు`, `ఉత్తమ నటి` విభాగాల్లో `ఫిల్మ్ ఫేర్` అవార్డులను `జయం` సొంతం చేసుకుంది. అలాగే తమిళంలో `జయం` (`జయం` రవి, సదా, గోపీచంద్) పేరుతోనే రీమేక్ అయి.. అక్కడా ఘనవిజయం సాధించింది. `చిత్రం మూవీస్` పతాకంపై తేజనే స్వయంగా నిర్మించిన `జయం`.. 2002 జూన్ 14న విడుదలై బాక్సాఫీస్ వద్ద వసూళ్ళ వర్షం కురిపించింది. నేటితో ఈ సంచలన చిత్రం 19 వసంతాలు పూర్తిచేసుకుంది.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Telugu One