తెలుగు సినీ పరిశ్రమలో గత కొన్ని రోజులుగా థియేటర్స్ పర్సంటేజ్ (Percentage) విధానంపై జరుగుతున్న పోరు ఇప్పుడు ఫిల్మ్ ఛాంబర్ గడప తొక్కింది. ఇవాళ (మే 15) హైదరాబాద్‌లోని తెలుగు ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్‌లో జరిగిన కీలక సమావేశం తీవ్ర ఉత్కంఠకు దారితీసింది.
పరిశ్రమలోని అగ్ర నిర్మాతలు, ఎగ్జిబిటర్లు, డిస్ట్రిబ్యూటర్లు హాజరైన ఈ భేటీలో ఒక్కసారిగా వాతావరణం వేడెక్కింది. బయటకు వస్తున్న సమాచారం ప్రకారం.. సింగిల్ స్క్రీన్ థియేటర్లలో అద్దె విధానం తీసేసి, కలెక్షన్లలో వాటా ఇవ్వాలన్న ఎగ్జిబిటర్ల డిమాండ్‌పై చర్చ జరుగుతుండగా.. ఇద్దరి మధ్య తీవ్ర వాగ్వాదం చోటుచేసుకుంది.
ఒక ఫైర్ బ్రాండ్ నిర్మాత, ఒక ప్రముఖ ఎగ్జిబిటర్ మధ్య మాట మాట పెరిగి అది దాదాపు భౌతిక దాడికి దారితీసినంత పని అయ్యిందని తెలుస్తోంది. అయితే, మరో వెర్షన్ ప్రకారం.. అక్కడ ఎలాంటి గొడవ జరగలేదని, కేవలం ఇరు వర్గాలు తమ వాదనలను బలంగా వినిపించాయని, ఆ క్రమంలోనే కాస్త గట్టిగా మాట్లాడుకున్నారని ఇండస్ట్రీ వర్గాలు చెబుతున్నాయి. కీలక నిర్ణయం..
15 మందితో కమిటీ! ఈ వివాదాన్ని పరిష్కరించేందుకు ఛాంబర్ అధ్యక్షుడు డి. సురేష్ బాబు రంగంలోకి దిగారు. ఇరు వర్గాలను శాంతింపజేసి ఒక కీలక నిర్ణయం తీసుకున్నారు.
పర్సంటేజ్ విధానంపై అధ్యయనం చేయడానికి 15 మంది సభ్యులతో కూడిన ఒక ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేశారు. ఈ కమిటీలో ఐదుగురు నిర్మాతలు, ఐదుగురు ఎగ్జిబిటర్లు, ఐదుగురు డిస్ట్రిబ్యూటర్లు సభ్యులుగా ఉంటారు. ఈ కమిటీ రెండు నెలల్లో తన నివేదికను సమర్పించాల్సి ఉంటుంది. 'పెద్ది' విడుదలకు లైన్ క్లియర్ ఈ వివాదం వల్ల త్వరలో విడుదల కానున్న భారీ చిత్రాలకు ఇబ్బంది కలుగుతుందేమో అని భయపడ్డ అభిమానులకు దిల్ రాజు ఊరటనిచ్చారు.
జూన్ 4న విడుదల కానున్న రామ్ చరణ్ సినిమా 'పెద్ది' (Peddi) విడుదలకు ఎలాంటి ఆటంకాలు ఉండవని, అంతా సవ్యంగానే జరుగుతుందని ఆయన స్పష్టం చేశారు. మొత్తానికి టాలీవుడ్ ఇండస్ట్రీలో నెలకొన్న ఈ సంక్షోభం కమిటీ ఏర్పాటుతో తాత్కాలికంగా సద్దుమణిగినట్లే కనిపిస్తోంది. అయితే, కమిటీ ఇచ్చే నివేదికపైనే సింగిల్ స్క్రీన్ థియేటర్ల భవిష్యత్తు, నిర్మాతల లాభనష్టాలు ఆధారపడి ఉన్నాయి. మరి ఈ పర్సంటేజ్ పంచాయితీకి పూర్తిస్థాయిలో ఎప్పుడు ఎండ్ కార్డ్ పడుతుందో వేచి చూడాలి.

