ఆత్మకథ మార్పులపై స్పందించిన పెంగ్విన్..! కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ రాయనున్న జ్ఞాపకాల పుస్తకం 'బిలాంగింగ్: ఏ జర్నీ ఆఫ్ లవ్' ప్రచురణకు సంబంధించి వెలువడుతున్న వివాదాలపై ప్రముఖ ప్రచురణ సంస్థ పెంగ్విన్ ర్యాండమ్ హౌస్ ఇండియా కీలక స్పష్టత ఇచ్చింది.
భారత్‌లో ఈ పుస్తకానికి తాము ప్రచురణకర్తలం కాదని సదరు సంస్థ అధికారికంగా వెల్లడించింది. సోనియా గాంధీ రాస్తున్న ఈ ఆత్మకథలో కొన్ని ఎడిటోరియల్ మార్పులు చేయాల్సిందిగా ప్రచురణ సంస్థ కోరిందని, దానికి ఆమె నిరాకరించడంతోనే పెంగ్విన్ వెనక్కి తగ్గిందంటూ గత కొన్ని రోజులుగా మీడియాలో కథనాలు ప్రచారమయ్యాయి. ఈ నేపథ్యంలో పెంగ్విన్ సంస్థ రంగంలోకి దిగి ఆ వార్తలను తీవ్రంగా ఖండించింది. పుస్తకంలో రాసే విషయాల్లో మార్పుల ప్రతిపాదనల కారణంగానే తాము ఈ ప్రాజెక్ట్ నుంచి తప్పుకున్నామనే ప్రచారంలో ఎలాంటి వాస్తవం లేదని సంస్థ వివరించింది.
తమకు సోనియా గాంధీ పుస్తకాన్ని ప్రచురించడంపై ఇప్పటికీ ఎంతో ఆసక్తి ఉందని, అయితే మార్కెటింగ్ ప్రచురణ హక్కులకు సంబంధించి వేర్వేరు అంశాలు ఉంటాయని పేర్కొంది. సాధారణంగా ఏదైనా పుస్తక ప్రచురణ ప్రక్రియలో భాగంగా రచయితలు ఇచ్చే సమాచారాన్ని క్షుణ్ణంగా పరిశీలించడం, వాస్తవాలను నిర్ధారించుకోవడం అవసరమైన సూచనలు ఇవ్వడం పబ్లిషింగ్ సంస్థల ప్రాథమిక బాధ్యత అని పెంగ్విన్ తెలిపింది. ఈ క్రమంలోనే చర్చలు జరుగుతాయని స్పష్టం చేసింది. అయితే, ఈ పుస్తకం విషయంలో సోనియా గాంధీతో జరిపిన సంప్రదింపులకు సంబంధించిన వివరాలను బయటకు వెల్లడించేందుకు ప్రచురణ సంస్థ నిరాకరించింది.
రచయితలతో జరిగే చర్చలు అంతర్గతమైనవని, వాటి గోప్యతను కాపాడటం తమ విధి అని వ్యాఖ్యానించింది. మరోవైపు, అమెరికాకు చెందిన ప్రముఖ అంతర్జాతీయ ప్రచురణ సంస్థ 'ఆల్‌ఫ్రెడ్ ఏ. నాఫ్' (Alfred A. Knopf) సోనియా గాంధీ ఆత్మకథను ప్రచురించే బాధ్యతలను తీసుకుంది.
ఈ ఏడాది నవంబర్ 10న ఈ పుస్తకాన్ని ప్రపంచవ్యాప్తంగా విడుదల చేయనున్నట్లు సదరు సంస్థ ఇప్పటికే అధికారికంగా ప్రకటించింది. గాంధీ కుటుంబం, భారత రాజకీయాల్లో సోనియా గాంధీ పాత్ర, అలాగే ఆమె వ్యక్తిగత జీవిత విశేషాలతో రానున్న ఈ పుస్తకంపై రాజకీయ వర్గాల్లో తీవ్ర ఆసక్తి నెలకొంది. అంతర్జాతీయంగా విడుదలవుతున్న ఈ పుస్తకం భారత రాజకీయాల్లో ఎలాంటి చర్చలకు దారితీస్తుందో వేచి చూడాలి. Sonia Gandhi Book, Belonging A Journey of Love, Penguin Random House India, Sonia Gandhi Memoir, National Telugu News, Telugu One

