Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
Suriya సూర్య క్రేజ్ మామూలుగా లేదుగా తెలుగులో వీరభద్రుడు హౌస్‌ఫుల్ కలెక్షన్స్!

Suriya సూర్య క్రేజ్ మామూలుగా లేదుగా తెలుగులో వీరభద్రుడు హౌస్‌ఫుల్ కలెక్షన్స్!

కోలీవుడ్ స్టార్ సూర్య (Suriya)కు తెలుగులో ఉన్న మార్కెట్, అభిమానుల ఆదరణ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. దశాబ్దాలుగా స్ట్రెయిట్ తెలుగు హీరోలతో సమానంగా ఇక్కడి ప్రేక్షకులు ఆయన్ని గుండెల్లో పెట్టుకున్నారు.

తాజాగా ఆయన నటించిన ఫాంటసీ కోర్ట్ రూమ్ యాక్షన్ డ్రామా 'కరుప్పు' (Karuppu) చిత్రం తెలుగులో 'వీరభద్రుడు' (Veerabhadrudu) పేరుతో థియేటర్లలోకి వచ్చింది. అయితే ఈ సినిమా విడుదలకు ముందు అనేక నాటకీయ పరిణామాలు చోటుచేసుకున్నాయి. కొన్ని తీవ్రమైన ఆర్థిక ఇబ్బందులు కారణంగా మే 14న విడుదల కావాల్సిన ఈ చిత్రం వాయిదా పడి, చివరకు అనేక అడ్డంకులను దాటుకుని మే 15న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. అసలు ప్రమోషన్స్ సరిగ్గా లేకపోవడం, ఆఖరి నిమిషంలో షోలు రద్దు కావడంతో ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద ఎలాంటి ప్రదర్శన ఇస్తుందోనని ట్రేడ్ వర్గాలు కాస్త ఆందోళన చెందాయి.

కానీ టాలీవుడ్ ఆడియన్స్‌కు సూర్యపై ఉన్న ప్రేమ మరోసారి అన్ని అంచనాలను తలకిందులు చేసింది. సాధారణంగా పెద్దగా ప్రమోషన్స్ లేని డబ్బింగ్ సినిమాలను, అందునా మిక్స్డ్ రివ్యూస్ తెచ్చుకున్న చిత్రాలను థియేటర్లలో చూడటానికి ప్రేక్షకులు అంతగా ఆసక్తి చూపించరు. ప్రస్తుతం నేరుగా వస్తున్న తెలుగు సినిమాలకు కూడా ఓపెనింగ్స్ రావడం గగనమైపోతున్న తరుణంలో, 'వీరభద్రుడు' చిత్రానికి తెలుగు రాష్ట్రాల్లో అద్భుతమైన ఆక్యుపెన్సీలు నమోదు కావడం అందరినీ ఆశ్చర్యపరుస్తోంది. ముఖ్యంగా నైట్ షోలకు భారీ ఎత్తున ప్రేక్షకులు తరలిరావడంతో రెండు తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నగరాల్లో థియేటర్లు హౌస్‌ఫుల్ బోర్డులతో దర్శనమిచ్చాయి.

సినిమా కథనం కాస్త పాతకాలపు ధోరణిలో సాగిందనే విమర్శలు ఉన్నప్పటికీ, సూర్య వన్ మ్యాన్ షో థియేటర్లలో పూనకాలు తెప్పిస్తోంది. ఈ చిత్రంలో సూర్య క్షేత్రపాలకుడైన వీరభద్రుడిగా దైవత్వంతో కూడిన పాత్రలో, అలాగే లాయర్ అవతారంలో తన నటనతో విశ్వరూపం చూపించారు. కోర్టు రూమ్ డ్రామా, ఫాంటసీ ఎలిమెంట్స్ మిక్స్ చేసి దర్శకుడు ఆర్జే బాలాజీ ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. క్లైమాక్స్, ఇంటర్వెల్ సీన్లలో సూర్య పలికించిన హావభావాలు, రుద్రతాండవం చేసే సన్నివేశాలు మాస్ ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంటున్నాయి.

సాయి అభ్యంకర్ అందించిన బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ థియేటర్లలో గూస్‌బంప్స్ తెప్పిస్తుండటంతో టాక్‌తో సంబంధం లేకుండా కలెక్షన్ల వర్షం కురుస్తోంది. కోలీవుడ్ లో ఎంతమంది హీరోలు ఉన్నా.. సూర్య బ్రాండ్ ఇమేజ్, ఆయన స్క్రీన్ ప్రెజెన్స్ తెలుగు వారిని ఎప్పుడూ ఆకర్షిస్తూనే ఉంటాయని ఈ చిత్ర వసూళ్లు నిరూపిస్తున్నాయి. ఎలాంటి ప్రచార ఆర్భాటాలు లేకపోయినా కేవలం సూర్య అనే ఒకే ఒక్క పేరుతో థియేటర్లకు జనాలు రావడం ఆయన స్టార్ ఇమేజ్‌కు నిదర్శనం.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Telugu One