Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
తను చదువుకున్న స్కూల్‌కి స్పెషల్ గిఫ్ట్ ఇచ్చిన ధనుష్‌ ఫిదా అవుతున్న నెటిజన్లు

తను చదువుకున్న స్కూల్‌కి స్పెషల్ గిఫ్ట్ ఇచ్చిన ధనుష్‌ ఫిదా అవుతున్న నెటిజన్లు

కోలీవుడ్ వర్సటైల్ యాక్టర్, నేషనల్ అవార్డు గ్రహీత ధనుష్ రీల్ హీరోగానే కాకుండా రియల్ హీరో అని మళ్ళీ నిరూపించుకున్నారు. తాను విద్యాబుద్ధులు నేర్చుకున్న పాఠశాలకు ఓ అద్భుతమైన కానుకను అందించి తన ఉదారతను చాటుకున్నారు.

చెన్నైలోని సాలిగ్రామంలో ఉన్న తాయ్ సత్య మెట్రిక్యులేషన్ స్కూల్‌కు మూడు అంతస్తులతో కూడిన నూతన భవనాన్ని స్వయంగా నిర్మించి విరాళంగా ఇచ్చారు. ఈ నూతన భవనానికి పాఠశాల యాజమాన్యం గౌరవసూచకంగా 'ధనుష్ బ్లాక్' అని నామకరణం చేసింది. ధనుష్ పదో తరగతి వరకు ఇదే విద్యాలయంలో చదువుకోవడం విశేషం. ఇటీవల ఘనంగా జరిగిన ప్రారంభోత్సవ వేడుకలో ధనుష్ పాల్గొని, ఆ భవనాన్ని విద్యార్థులకు అంకితం చేశారు.

ఈ కార్యక్రమానికి ధనుష్ తన క్లాస్‌మేట్, సినీ ఛాయాగ్రాహకుడు కుమరన్‌తో కలిసి విచ్చేశారు. పాఠశాల ప్రాంగణంలోకి అడుగుపెట్టిన ధనుష్.. తనకు విద్యను అందించిన గురువుల పాదాలకు నమస్కరించి ఆశీస్సులు తీసుకున్నారు. పాత జ్ఞాపకాలను నెమరువేసుకుంటూ టీచర్లతో కలిసి గ్రూప్ ఫోటోలు దిగడంతో అక్కడి వాతావరణం ఎంతో భావోద్వేగంగా మారింది.

ఈ సందర్భంగా మాట్లాడిన సినిమాటోగ్రాఫర్ కుమరన్.. తమ స్కూల్ భవనాల పునర్నిర్మాణం గురించి తెలుసుకున్న ధనుష్ ఏమాత్రం ఆలోచించకుండా ముందుకు వచ్చారని తెలిపారు. కేవలం ఈ మూడు అంతస్తుల భవనమే కాకుండా, మిగిలిన పాత భవనాల పునరుద్ధరణకు, పాఠశాలలోని ఖాళీ స్థలాల్లో మరిన్ని క్లాస్‌రూమ్‌ల నిర్మాణానికి కూడా పూర్తి ఆర్థిక సాయం అందిస్తానని ధనుష్ హామీ ఇచ్చినట్లు వెల్లడించారు. ఇక కెరీర్ పరంగా చూస్తే ధనుష్ ప్రస్తుతం గోల్డెన్ ఫేజ్‌ను ఆస్వాదిస్తున్నారు.

ఇటీవల ప్రకటించిన నేషనల్ ఫిల్మ్ అవార్డ్స్‌లో నటుడిగా, దర్శకుడిగా రెండు పురస్కారాలు దక్కించుకుని సరికొత్త రికార్డు సృష్టించారు. ప్రస్తుతం ఆయన రాజ్‌కుమార్ పెరియసామి దర్శకత్వంలో 'ఓం' అనే పవర్ ఫుల్ యాక్షన్ డ్రామాలో నటిస్తున్నారు. ఈ చిత్రంలో మలయాళ మెగాస్టార్ మమ్ముట్టి కీలక పాత్ర పోషిస్తుండటంతో అంచనాలు ఆకాశాన్ని తాకుతున్నాయి. ధనుష్ చేసిన ఈ గొప్ప సాయం గురించిన వార్తలు, ఫోటోలు సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతున్నాయి. ఎంత ఎదిగినా ఒదిగి ఉండాలనే నైజం, చదువుకున్న బడిని మర్చిపోకుండా రీ-పే చేసే మనస్తత్వం ధనుష్ సొంతమని అభిమానులు, నెటిజన్లు ప్రశంసలతో ముంచెత్తుతున్నారు. పాఠశాలకు అందించిన ఈ అపురూప కానుకతో అందరి హృదయాలను గెలుచుకున్న ధనుష్, త్వరలోనే తన రాబోయే ప్రాజెక్టులతో బాక్సాఫీస్ వద్ద కూడా మరిన్ని భారీ విజయాభినందనలు అందుకోవాలని ఫ్యాన్స్ ఆకాంక్షిస్తున్నారు.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Telugu One