తెలంగాణ రాష్ట్రాన్ని భానుడి ప్రచండ ప్రతాపం ఉక్కిరిబిక్కిరి చేస్తున్నది. ఎండ తీవ్రత జనాన్ని హడలెత్తిస్తోంది. రాష్ట్రవ్యాప్తంగా ఎండల తీవ్రత అనూహ్యంగా పెరిగిపోయింది.
అధికారిక గణాంకాల ప్రకారం తెలంగాణలోని 19 జిల్లాల్లో గరిష్ట ఉష్ణోగ్రతలు 46 డిగ్రీల సెల్సియస్ మార్కును దాటి పోయాయి. సాధారణం కంటే ఎండ తీవ్రత విపరీతంగా పెరగడంతో ప్రజలు ఇళ్ల నుంచి బయటకు రావాలంటేనే ప్రజలు భయపడుతున్నారు. రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 82 ప్రాంతాల్లో తీవ్రమైన వడగాల్పుల పరిస్థితులు నెలకొన్నాయి. రాష్ట్రంలోనే అత్యధికంగా నిర్మల్ జిల్లాలోని దిలావర్‌పూర్ లో ఏకంగా 46.5 డిగ్రీల సెల్సియస్ గరిష్ట ఉష్ణోగ్రత నమోదైంది. ఇక హన్మకొండ జిల్లా ధర్మసాగర్, కరీంనగర్ జిల్లా చొప్పదండి, పెద్దపల్లి జిల్లా ఓదెల ప్రాంతాల్లో 46.4 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత రికార్డైంది. అలాగే జగిత్యాల జిల్లా రాయకల్, జనగామ టౌన్, ఖమ్మం జిల్లా పెనుబల్లి, కుమరం భీమ్ ఆసిఫాబాద్, మంచిర్యాల జిల్లా కోటపల్లి, నిజామాబాద్ జిల్లా బాల్కొండ ప్రాంతాల్లో ఉష్ణోగ్రతలు 46.3 డిగ్రీల సెల్సియస గా నమోదయ్యాయి. మరోవైపు ఉత్తర తెలంగాణలోని పలు ప్రాంతాల్లో గరిష్ట ఉష్ణోగ్రతలు 45.8 డిగ్రీల నుండి 46 డిగ్రీల సెల్సియస్ మధ్య నమోదు కాగా, రాష్ట్రంలోని మిగిలిన ప్రాంతాల్లో ఉష్ణోగ్రతలు కూడా 42 నుంచి 45 డిగ్రీల సెల్సియస్ మధ్య నమోదయ్యాయి. హైదరాబాద్ లోని వివిధ ప్రాంతాల్లో గరిష్ట ఉష్ణోగ్రతలు 42.4 డిగ్రీల సెల్సియస్ వరకు నమోయ్యాయి. రాష్ట్రంలో నెలకొన్న ఈ తీవ్రమైన వడగాల్పులు మరియు అత్యధిక ఉష్ణోగ్రతల పరిస్థితులపై తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఉన్నతాధికారులతో అత్యవసర సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు. ఎండల తీవ్రత దృష్ట్యా ప్రజల రక్షణ కోసం అన్ని అవసరమైన ముందస్తు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.

