Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
తిరుమలలో పెరిగిన భక్తుల రద్దీ....భక్తుల సౌకర్యార్థం టీటీడీ విస్తృత ఏర్పాట్లు

తిరుమలలో పెరిగిన భక్తుల రద్దీ....భక్తుల సౌకర్యార్థం టీటీడీ విస్తృత ఏర్పాట్లు

తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలో తిరుమలలో వేసవి రద్దీ రోజురోజుకు పెరుగుతున్న నేపథ్యంలో అధికారులు ఓ కీలక నిర్ణయం తీసుకున్నారు.. ఈ నేపథ్యంలోనే శ్రీవారి దర్శనం కోసం భారీ సంఖ్యలో భక్తులు తిరుమ లకు తరలివస్తుండటంతో టీటీడీ విస్తృత ఏర్పాట్లు చేపట్టింది.

భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా తాగునీరు, అన్నప్రసాదాలు, వైద్య సేవలు, నీడ సదుపాయా లను కల్పిస్తూ యంత్రాంగం అప్రమత్తంగా పనిచేస్తోంది. వేసవి ఎండ తీవ్రత నుంచి భక్తులకు ఉపశమనం కలిగించేందుకు బాట గంగమ్మ సర్కిల్ నుంచి గోగర్భం డ్యామ్ సర్కిల్ మీదుగా ఔటర్ రింగ్ రోడ్ వరకు చలువ పందిళ్లు ఏర్పాటు చేశారు. వైకుంఠం క్యూ కాంప్లెక్స్-2, మ్యూజియం ప్రాంగణం, నారాయణగిరి ఉద్యానవనాల్లో అదనపు షెల్టర్లు నిర్మించారు. క్యూలైన్లలో వేచి ఉండే భక్తుల కోసం కూల్ పెయింటింగ్ పనులు చేపట్టడంతో పాటు తాత్కాలిక మరుగుదొడ్లు కూడా ఏర్పాటు చేశారు.భక్తుల రద్దీ ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లో శ్రీవారి సేవకుల ద్వారా నిరంతరాయంగా తాగునీరు, అన్నప్రసాదాలు పంపిణీ చేస్తున్నారు.

ఉదయం పాలు ఉప్మా, పొంగల్‌, మధ్యాహ్నం సాంబారన్నం, పులిహోర, టమోటా రైస్‌, రాత్రి సాంబారన్నం వంటి ఆహార పదార్థాలను అందిస్తున్నారు. అలాగే మొబైల్ వాటర్ డ్రమ్ముల ద్వారా కూడా తాగునీటి సరఫరా కొనసాగుతోంది. రద్దీకి అనుగుణంగా ఔటర్ రింగ్ రోడ్డులో మొబైల్ ఫస్ట్ ఎయిడ్ కేంద్రాన్ని ఏర్పాటు చేశారు. మరోవైపు తలనీలాల సమర్పణ కోసం ప్రధాన కళ్యాణకట్టతో పాటు 11 మినీ కళ్యాణకట్టలను అందుబాటులో ఉంచి భక్తులకు నిరంతరాయ సేవలు అందిస్తున్నారు.

టీటీడీ వివరాల ప్రకారం గత ఐదు రోజుల్లోనే 4 లక్షల 32 వేల మందికిపైగా భక్తులు శ్రీవారిని దర్శించుకున్నారు. మే 16, 17 తేదీల్లో రోజుకు 90 వేల మందికిపైగా దర్శనం చేసుకోగా, మే 18 నుంచి 20 వరకు రోజుకు 43 వేలకుపైగా భక్తులు తలనీలాలు సమర్పించారు. ఇదే కాలంలో దాదాపు 19 లక్షల మందికి అన్నప్రసాదాలు, టీ, కాఫీ, పాలు, మజ్జిగ పంపిణీ చేసినట్లు అధికారులు తెలిపారు. తిరుమలలో ప్రస్తుతం సుమారు 7500 గదులు, ఐదు యాత్రికుల వసతి సముదాయాలు మాత్రమే అందుబాటులో ఉండటంతో గదుల కొరత తీవ్రంగా కనిపిస్తోంది. పీఏసీ కేంద్రాల్లో ఏర్పాటు చేసిన లాకర్లు కూడా పూర్తిగా నిండిపోయాయి. అయినప్పటికీ భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా వివిధ విభాగాల అధికారులు, సిబ్బంది క్యూలైన్లు, షెడ్లు, కంపార్టుమెంట్లను నిరంతరం పర్యవేక్షిస్తూ సేవలందిస్తున్నారు.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Telugu One