Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
ఉత్తరాంధ్ర ప్రగతికి పట్టుగొమ్మ భోగాపురం విమానాశ్రయం.!

ఉత్తరాంధ్ర ప్రగతికి పట్టుగొమ్మ భోగాపురం విమానాశ్రయం.!

ప్రధాని నరేంద్ర మోడీ చేతుల మీదుగా శనివారం (ఆగస్టు 1) ప్రారంభం కానున్న భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం ఉత్తరాంధ్ర జిల్లాల అభివృద్ధికి గేమ్ చేంజర్ గా మారబోతోంది.

ఒకప్పుడు హైదరాబాద్‌లోని శంషాబాద్ ఎయిర్‌పోర్ట్ చుట్టుపక్కల ప్రాంతాల ఆర్థిక పరిస్థితిని ఎలా మార్చిందో.. అచ్చం అలాగే.. ఆ మాటకొస్తే అంతకు మించి భోగాపురం ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్టు ఉత్తరాంధ్రలో ఆర్థిక విప్లవాన్ని తీసుకురాబోతోంది. ఇన్నాళ్లూ విశాఖ, విజయనగరం, శ్రీకాకుళం వేర్వేరు జిల్లాలుగా ఉండేవి.

భోగాపురం విమానాశ్రయం రాకతో ఇవన్నీ కలిపి ఒకే ఎకనామిక్ కారిడార్‌గా మారతాయి. విశాఖపట్నం ఐటీ, వాణిజ్య కేంద్రంగా నిలిస్తే, విజయనగరం ఎడ్యుకేషన్, లాజిస్టిక్స్ హబ్‌గా, శ్రీకాకుళం ఆక్వాకల్చర్, అగ్రికల్చర్ ఎగుమతుల కేంద్రంగా రూపాంతరం చెందుతాయి. ఈ విమానాశ్రయంలో ఏర్పాటు చేసిన ప్రత్యేక కార్గో టెర్మినల్ కోస్తాంధ్ర ఎగుమతులకు అపార అవకాశాల తీసుకువస్తుంది. ఆక్వా ఉత్పత్తులు, సీఫుడ్, ఫార్మాస్యూటికల్స్, విజయనగరం మామిడి పళ్ళు భోగాపురం నుంచి నేరుగా విదేశాలకు ఎగుమతి అవుతాయి.

దీనివల్ల మన స్థానిక రైతులకు, వ్యాపారులకు అంతర్జాతీయ మార్కెట్ అందుబాటులోకి వస్తుంది. ఈ విమానాశ్రయం రాకతో ఉత్తరాంధ్ర టూరిజం కు స్వర్ణయుగం ప్రారంభమైనట్లేనని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. అరకు లోయ, బొర్రా గుహలు, సింహాచల క్షేత్రం, రుషికొండ బీచ్, చారిత్రక బౌద్ధారామాలు... ప్రపంచ పర్యాటకులకు మరింత చేరువ అవుతాయి.

పర్యాటకం జోరందుకోవడంతో హోటళ్లు, రిసార్టులు వస్తాయి. రవాణా రంగం కూడా బ్రహ్మాండంగా పుంజుకుంటుంది. విమానాశ్రయం, అందునా అంతర్జాతీయ విమానాశ్రయం రాకతో.. ఉత్తరాంధ్ర భూముల ధరలకు రెక్కలొస్తాయి.

రియల్ ఎస్టేట్ రంగం రాకెట్ వేగంతో అభివృద్ధి చెందుతుంది. భోగాపురం, విశాఖపట్నం కారిడార్ వెంబడి ఐటీ పార్కులు, వాణిజ్య సముదాయాలు, టౌన్‌షిప్‌లు ఏర్పాటౌతాయి. లాస్ట్ బట్ నాట్ లీస్ట్.. ఇక్కడి యువతకు హైదరాబాద్, బెంగళూరు, గల్ఫ్ దేశాలకు వలస వెళ్లే అవసరం ఇక దాదాపుగా ఉండదు.

ఎయిర్‌లైన్స్, సెక్యూరిటీ, గ్రౌండ్ హ్యాండ్లింగ్, మెయింటెనెన్స్ ఇలా వేలాది మందికి ప్రత్యక్షంగా, లాజిస్టిక్స్, వేర్‌హౌసింగ్, హాస్పిటాలిటీ రంగాల ద్వారా పరోక్షంగా లక్షలాది మందికి ఉద్యోగ, ఉపాధి అవకాశాలు లభిస్తాయి. భోగాపురంఅంతర్జాతీయ విమానాశ్రయం అందుబాటులోకి రావడంతో.. ఉత్తరాంధ్రలో పెట్టుబడులు పెట్టేందుకు కంపెనీలు మొగ్గు చూపుతాయి. ముఖ్యంగా విశాఖ పట్నాన్ని గ్లోబల్ ఐటీ హబ్‌గా భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం మార్చేస్తుందనడంలో సందేహం లేదు.

ఈ ఎయిర్‌పోర్ట్ చుట్టూ ఏవియేషన్ అకాడమీలు, ట్రైనింగ్ సెంటర్లు, ఇంజనీరింగ్ విశ్వవిద్యాలయాల భాగస్వామ్యంతో స్కిల్ డెవలప్‌మెంట్ సెంటర్లు రానున్నాయి. ఇంత వరకూ ఉత్తరాంధ్ర అంటే.. వలసల ప్రాంతం అని అంతా అనేవారు. ఇక ముందు ఆ పరిస్థితి ఉండదు. భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయంలో స్థానికంగానే ఉపాధి లభించి వలసలు దాదాపుగా ఆగిపోతాయి. Bhogapuram Airport, Bhogapuram International Airport, Uttarandhra Development, Vizag Real Estate

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Telugu One