పశ్చిమాఫ్రికా దేశమైన నైజీరియాలో ఇస్లామిక్ స్టేట్ ( ఉగ్రవాద సంస్థకు భారీ నష్టం వాటిల్లింది. ఆ దేశ ఈశాన్య సరిహద్దు ప్రాంతాల్లో అమెరికా సైనిక విభాగం, నైజీరియా రక్షణ దళాలు సంయుక్తంగా నిర్వహించిన వైమానిక దాడుల్లో 175 మందికి పైగా ఐసిస్ ఉగ్రవాదులు హతమయ్యారు.
ఈ విషయాన్ని నైజీరియా సైనిక ప్రతినిధి అధికారిక ప్రకటన ద్వారా ధృవీకరించారు. నిర్దేశిత ఉగ్రవాద స్థావరాలే లక్ష్యంగా సాగిన ఈ ఆపరేషన్‌లో వందలాది మంది ఐసీస్ ఉగ్రవాదులు హతమవ్వడమే కాకుండా.. వారి రక్షణ నిలిచే అనేక రహస్య చెక్‌పోస్టులు కూడా నేలమట్టమయ్యాయని ఆ ప్రకటన పేర్కొంది. అలాగే..
ఉగ్రవాదులకు చెందిన భారీ ఆయుధ డిపోలు, కీలకమైన లాజిస్టిక్స్ కేంద్రాలను వైమానిక దళాలు పూర్తిగా ధ్వంసం చేశాయి. ఉగ్రవాద కార్యకలాపాలకు గట్టి ఊతాన్నిచ్చే ఆర్థిక వనరుల వ్యవస్థను, నిధుల సరఫరా నెట్‌వర్క్ ప్రధాన కార్యాలయాలను సైతం ఈ దాడులలో ముక్కలు ముక్కలు చేసినట్లు నైజీరియా ప్రకటించింది. నైజీరియా, అమెరికా దేశాల మధ్య ఇటీవలి కాలంలో రక్షణ పరమైన సంబంధాలు, సైనిక సహకారం బలపడ్డాయి. ఈ వ్యూహాత్మక బంధం కారణంగానే ఐసిస్ గ్లోబల్ సెకండ్-ఇన్-కమాండ్‌గా వ్యవహరిస్తున్న అబు-బిలాల్ అల్-మినుకిని ఇటీవల హతం చేయడం సాధ్యమైంది.
ఉగ్రవాద నిర్మూలనలో ఇరు దేశాల భాగస్వామ్యం అత్యంత కీలకమైనదని నైజీరియా దేశాధినేత బోలా టినుబు పేర్కొన్నారు. కాగా నైజీరియాలో ఆపరేషన్ విజయవంతం కావడంపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ హర్షం వ్యక్తం చేశారు. తన మార్గదర్శకత్వంలోనే అమెరికా, నైజీరియా బలగాలు అత్యంత సంక్లిష్టమైన ఈ ఆపరేషన్‌ను సమర్థవంతంగా పూర్తి చేయగలిగాయని ఆయన పేర్కొన్నారు. ఐక్యరాజ్యసమితి గణాంకాల ప్రకారం..
2009 నుండి నైజీరియాలో బోకో హరామ్, ఇస్లామిక్ స్టేట్ వంటి ఉగ్రవాద సంస్థల హింసాత్మక చర్యల వల్ల దాదాపు 40 వేల మందికి పైగా పౌరులు ప్రాణాలు కోల్పోయారు. సుమారు 20 లక్షల మంది ప్రజలు తమ సొంత నివాసాలను కోల్పోయి శరణార్థులుగా మారారు. రాబోయే రోజుల్లో ఈ ప్రాంతంలో శాంతి భద్రతలను పునరుద్ధరించడానికి, మిగిలిన ఉగ్రవాద నెట్‌వర్క్‌లను పూర్తిగా నిర్మూలించడానికి సంయుక్త బలగాలు మరిన్ని వ్యూహాత్మక దాడులను కొనసాగించే అవకాశాలు కనిపిస్తున్నాయి.

