Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
వైసీపీ హయాంలో అడ్రస్ లేని పురోగతి.. ఇప్పుడు పరుగులు పెడుతున్న అభివృద్ధి!

వైసీపీ హయాంలో అడ్రస్ లేని పురోగతి.. ఇప్పుడు పరుగులు పెడుతున్న అభివృద్ధి!

ఆంధ్రప్రదేశ్ పారిశ్రామిక రంగం అభివృద్ధి బాటలో పరుగులు పెడుతోంది. జగన్ హయాంలో పడకేసిన ఈ రంగం తెలుగుదేశం కూటమి అధికార పగ్గాలు చేపట్టిన తరువాత ప్రగతిలో స్పష్టమైన మార్పు కనిపిస్తోంది.

వైసీపీ ఐదేళ్ల పాలనలో రాష్ట్రంలో అభివృద్ధి అడ్రస్ లేకుండా పోయిందన్న విమర్శలు ఉన్నాయి. పారిశ్రామిక విధానాల్లో అస్థిరత, రివర్స్ టెండరింగ్ వంటి నిర్ణయాల వల్ల నాటి ప్రభుత్వ హయాంలో పలు ప్రతిష్టాత్మక సంస్థలు రాష్ట్రం వైపు కన్నెత్తి కూడా చూడలేదు. అయితే అధికారంలోకి వచ్చిన తర్వాత పారిశ్రామిక రంగానికి పూర్వవైభవం తెచ్చే దిశగా అడుగులు పడుతున్నాయి. గత ప్రభుత్వ హయాంలో కేవలం ప్రకటనలకే పరిమితమైన పలు ప్రాజెక్టులు, ఇప్పుడు వాస్తవరూపం దాలుస్తున్నాయి.

నాటి వైసిపి పాలనలో పరిశ్రమల స్థాపన మందగించింది. అందుకు భిన్నంగా ప్రస్తుత ప్రభుత్వం స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ నినాదంతో ముందుకు సాగుతోంది. శ్రీ సత్యసాయి జిల్లా పుట్టపర్తిలో ప్రతిష్టాత్మకమైన అడ్వాన్స్‌డ్ మీడియం కాంబాట్ ఎయిర్‌క్రాఫ్ట్ (ఏఎంసీఏ ప్రాజెక్టును కేవలం 36 రోజుల్లోనే క్లియర్ చేయడం ప్రస్తుత ప్రభుత్వ వేగానికి, నిర్ణయాత్మక శక్తికి నిదర్శనంగా పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. తెలుగుదేశం కూటమి ప్రభుత్వం రక్షణ, అంతరిక్ష రంగాలను లక్ష్యంగా చేసుకుని రాయలసీమను ఒక పెద్ద పారిశ్రామిక కారిడార్‌గా మారుస్తోంది.

15,803 కోట్ల రూపాయల ఏఎమ్‌సీఏ ప్రాజెక్టుతో పాటు, మడకశిరలో మందుగుండు సామగ్రి ప్లాంట్, కర్నూలులో డ్రోన్ సిటీ వంటి భారీ రక్షణ రంగ ప్రాజెక్టులను తీసుకురావడం ద్వారా పెద్ద ఎత్తున ఉద్యోగ, ఉపాధి కల్పనకు కూడా బాటలు వేసింది. సింగిల్ విండో విధానం ద్వారా అనుమతులను వేగవంతం చేస్తూ పారిశ్రామికవేత్తల్లో నమ్మకాన్ని పునరుద్ధరించడంలో కూటమి ప్రభుత్వం విజయం సాధించింది. వైసీపీ హయాంలో చేజారిన అవకాశాలను భర్తీ చేస్తూ.. రాష్ట్రాన్ని దేశంలోనే అగ్రగామిగా నిలబెట్టేందుకు ప్రభుత్వం తీసుకుంటున్న చొరవ పట్ల పారిశ్రామిక వర్గాల నుంచి సానుకూల స్పందన వస్తోంది. అది పెట్టుబడుల రూపంలో ప్రస్ఫుటంగా కనిపిస్తోందని పరిశీలకులు అంటున్నారు.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Telugu One