Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
విమానాలు ఒకే..బట్ రైల్వే అంటే మోజు..!

విమానాలు ఒకే..బట్ రైల్వే అంటే మోజు..!

తెలుగువన్ ఎక్స్ క్లూజివ్ ఆంధ్రప్రదేశ్ ప్రజల దశాబ్దాల కల, 12 ఏళ్ల సుదీర్ఘ నిర్విరామ పోరాటం ఫలించింది. దేశంలో 18వ రైల్వే జోన్‌గా అవతరించిన సౌత్ కోస్ట్ రైల్వే జోన్ ఏర్పాటుతో ఉత్తరాంధ్రతో పాటు యావత్ ఆంధ్రుల ఆత్మగౌరవం నిలబడింది.

గతంలో ఒక చిన్న రైల్వే సమస్య వస్తే ఒడిశాలోని భువనేశ్వర్ చుట్టూ తిరగాల్సిన దుస్థితి ఉండేది. ఇప్పుడు విశాఖపట్నం వేదికగా ఈ నూతన రైల్వే జోన్ ప్రధాన కార్యాలయం ఏర్పాటు కావడం, జనరల్ మేనేజర్ , డివిజనల్ రైల్వే మేనేజర్ వంటి కీలక అధికారులు మనకు ఇక్కడే అందుబాటులోకి రావడం ఒక చారిత్రాత్మక మార్పు. స్థానిక ప్రజలకు రైల్వేలపై నమ్మకాన్ని, సొంత ప్రాంతంలోనే ఉద్యోగాలు చేసుకునే సరికొత్త ఆత్మవిశ్వాసాన్ని ఈ నిర్ణయం అందిస్తోంది. ఈ అద్భుత విజయానికి సారథిగా నిలిచిన కేంద్ర మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు తన అనుభవాలను తెలుగువన్ న్యూస్ తో ప్రత్యేకంగా పంచుకున్నారు.

ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తనకు పౌర విమానయాన శాఖ బాధ్యతలు అప్పగించి ప్రపంచంలోనే టాప్ 3 స్థానంలో నిలబెట్టేలా ప్రోత్సహించినప్పటికీ, తనకు రైల్వే శాఖపై ఉన్న మక్కువ విడదీయరానిదని రామ్మోహన్ నాయుడు అన్నారు. ఇది కేవలం ఒక శాఖపై ఉన్న ఆసక్తి మాత్రమే కాదు.. తన తండ్రి దివంగత ఎర్రన్నాయుడు గారి అద్భుత వారసత్వం. నౌపాడ - గుణుపూర్ నారోగేజ్ లైన్‌ను బ్రాడ్‌గేజ్‌గా మార్చడం, విశాఖపట్నం నుంచి పలాస, భువనేశ్వర్ వరకు కొత్త మెమో రైళ్లను ప్రవేశపెట్టి ప్రయాణికులకు అనుసంధానతను పెంచడంలో ఎర్రన్నాయుడు గారు చేసిన కృషిని రామ్మోహన్ నాయుడు ఈ సందర్భంగా గుర్తుచేసుకున్నారు.

ఆ స్పూర్తితోనే తాను ఎంపీ అయినప్పటి నుంచి ఒక్క డిఆర్ఎం, జిఎమ్ సమావేశాన్ని కూడా వదలకుండా ఢిల్లీ, భువనేశ్వర్ వేదికలపై మన సమస్యలను బలంగా వినిపించానని చెప్పారు. ఈ రైల్వే జోన్ సాధన అంత సులువుగా సాగలేదు. 2014 నుంచే పట్టు వదలకుండా పోరాటం చేస్తూ, రైల్వే సమస్య తీవ్రతను కేంద్రానికి తెలియజేయడానికి ఇచ్చాపురం, శ్రీకాకుళం రైల్వే స్టేషన్లలో రాత్రిపూట పడుకుని దీక్షలు చేసిన రోజులను ఆయన గుర్తుచేసుకున్నారు. ఫలితంగా 2018 లోనే కేంద్ర ప్రభుత్వం ఈ జోన్‌ను ప్రకటించింది.

అయితే ఆ తర్వాత వచ్చిన వైసీపీ ప్రభుత్వం ఐదేళ్ల పాటు రైల్వే జోన్ కార్యాలయ నిర్మాణానికి అవసరమైన 50 ఎకరాల భూమిని కేటాయించకుండా నిర్లక్ష్యం చేయడం వల్లే ఈ ప్రాజెక్ట్ తీవ్రంగా ఆలస్యమైంది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే దీన్ని అత్యంత ప్రాధాన్యత అంశంగా తీసుకుని, కేవలం 100 రోజుల్లోనే ల్యాండ్ క్లియరెన్స్ ప్రక్రియను పూర్తి చేసి పనులను ఫాస్ట్ ట్రాక్‌పైకి తీసుకు వచ్చింది. వచ్చే రెండేళ్లలో ఈ ప్రాజెక్ట్ పూర్తి స్థాయిలో అందుబాటులోకి రానుంది. ఈ జోన్ ఏర్పాటుతో ఉత్తరాంధ్ర కనెక్టివిటీ సమస్యలకు శాశ్వత పరిష్కారం లభించనుంది.

ఇప్పటికే ప్రయోగాత్మకంగా ప్రారంభించిన శ్రీకాకుళం - తిరుపతి రైలు ఏకంగా 70 శాతం ఆక్యుపెన్సీతో నడుస్తూ రికార్డు సక్సెస్ సాధించింది. ఇదే ఉత్సాహంతో రాబోయే రోజుల్లో శ్రీకాకుళం, విశాఖపట్నం కేంద్రాలుగా హైదరాబాద్, అమరావతి, ఢిల్లీ, గుజరాత్ వంటి ప్రధాన నగరాలకు నేరుగా రైళ్లను నడపడానికి ప్రణాళికలు సిద్ధమవుతున్నాయి. పండుగలు, సెలవులకు సొంత ఊళ్లకు వచ్చే ప్రయాణికులు ఇకపై రెండు, మూడు రైళ్లు మారే అవస్థలు తప్పుతాయి. ఏపీలో జాయిన్ అయి దేశంలో ఎక్కడెక్కడో సేవలు అందిస్తున్న తెలుగు రైల్వే ఉద్యోగులు, అధికారులు ఇప్పుడు సొంత రాష్ట్రంలోనే పనిచేసుకునే సువర్ణావకాశం లభించింది. ఈ చారిత్రక ఘట్టాన్ని సాకారం చేసిన ప్రధాని మోదీ, రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్, సీఎం చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ లకు ఉత్తరాంధ్ర ప్రజల తరపున కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు కృతజ్ఞతలు తెలిపారు.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Telugu One