ప్రస్తుతం ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో యూరప్ దేశాల రుణ భారం చర్చనీయాంశంగా మారింది. ముఖ్యంగా బ్రిటన్, ఫ్రాన్స్ మరియు జర్మనీ వంటి అగ్ర దేశాలు దివాలా దిశగా తిరోగమిస్తున్నాయి.
ఈ దేశాలు తక్షణమే దివాలా తీసే పరిస్థితి లేకపోయినప్పటికీ, ఆయా దేశాల ఆర్థిక పునాదులు కదిలిపోతున్నాయని ఆర్థిక నిపుణులు విశ్లేషిస్తున్నారు. ఇదే పరిస్థితి ఇలాగే కొనసాగితే.. ఆ దేశాలు దివాళా తీయడమే కాదు.. ప్రపంచం మరోసారి తీవ్ర ఆర్థిక మాంద్యాన్ని ఎదుర్కొనక తప్పదని అంటున్నారు.
అప్పులు పెరిగిపోవడం, అభివృద్ధి రేటు మందగించ, రాజకీయ అస్థిరత వెరసి యూరప్ దేశాలను ఆర్థిక బాంబుపై కూర్చోబెట్టాయి. ఇది పేలితే 2008 నాటి ప్రపంచ ఆర్థిక మాంద్యం పరిస్థితులు మళ్లీ పునరావృతమయ్యే ప్రమాదం ఉందని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. ఒక దేశం అంతర్జాతీయ లేదా దేశీయ పెట్టుబడిదారుల నుండి బాండ్ల రూపంలో తీసుకున్న అప్పును నిర్ణీత సమయంలో తిరిగి చెల్లించలేకపోవడాన్ని సావర్జిల్ డిఫాల్ట్ అంటారు. అంటారు.
ఒకవేళ యూరప్ దేశాలు ఈ స్థితికి చేరుకుంటే.. ఆయా దేశాల బాండ్లు ఉన్న గ్లోబల్ బ్యాంకులు, పెన్షన్ ఫండ్‌లు, ఇన్సూరెన్స్ కంపెనీలు భారీగా నష్టపోతాయి. దీని ప్రభావం కేవలం ఆ దేశాలకే పరిమితం కాకుండా ప్రపంచవ్యాప్త ఆర్థిక వ్యవస్థపై తీవ్రాతి తీవ్రమైన ప్రతికూల ప్రభావం చూపుతుంది. ప్రస్తుతం బ్రిటన్, ఫ్రాన్స్ వంటి దేశాల్లో రుణ భారం జీడీపీలో 100 శాతానికి పైగా ఉండటం అత్యంత ఆందోళన కలిగిస్తోంది.
ముందుగా యూకే విషయానికి వస్తే.. గత రెండు దశాబ్దాలుగా ఆ దేశం వరుస సంక్షోభాలను ఎదుర్కొంటోంది. 2008 ఆర్థిక సంక్షోభం నుండి మొదలై, కోవిడ్- మహమ్మారి, ఉక్రెయిన్ యుద్ధం వల్ల ఇంధన ధరల పెరుగుదల వరకు బ్రిటన్ ఖజానాపై తీవ్ర భారం పడింది. ఫలితంగా అక్కడి ప్రభుత్వ రుణం జీడీపీలో దాదాపు 100 శాతానికి చేరింది.
ద్రవ్యోల్బణాన్ని కట్టడి చేసే క్రమంలో బ్యాంక్ ఆఫ్ ఇంగ్లాండ్ వడ్డీ రేట్లను పెంచడంతో, ప్రభుత్వం తీసుకున్న అప్పులపై వడ్డీ చెల్లింపులు భారంగా మారాయి. తక్కువ ఉత్పాదకత, సామాజిక సంక్షేమ పథకాలపై పెరుగుతున్న ఖర్చుల వల్ల బ్రిటన్ ఆర్థికంగా సతమతమవుతోంది. మరోవైపు ఫ్రాన్స్ పరిస్థితి మరింత క్లిష్టంగా ఉంది. ఆ దేశ రుణ, జీడీపీ నిష్పత్తి 110 శాతాన్ని దాటిపోయింది.
యూరోపియన్ యూనియన్ నిర్దేశించిన ఆర్థిక నిబంధనలను ఫ్రాన్స్ వరుసగా ఉల్లంఘిస్తుండటంతో క్రెడిట్ రేటింగ్ ఏజెన్సీలు ఆ దేశ రేటింగ్‌ను తగ్గించాయి. దీనికి తోడు ఫ్రాన్స్‌లో నెలకొన్న రాజకీయ అస్థిరత కూడా ఆర్థిక సంస్కరణలకు అడ్డుగా నిలుస్తోంది. పార్లమెంటులో స్పష్టమైన మెజారిటీ లేకపోవడం, ప్రభుత్వం ప్రవేశపెట్టే కఠిన నిర్ణయాలపై ప్రజల నుండి వస్తున్న నిరసనల వల్ల ఖర్చులను తగ్గించడం పాలకులకు సవాలుగా మారింది. ఇక పోతే..
ఐరోపా ఆర్థిక ఇంజన్‌గా పిలవబడే జర్మనీ సైతం ఇప్పుడు తీవ్ర ఒత్తిడికి లోనవుతోంది. సంప్రదాయబద్ధంగా హెవీ ఇంజినీరింగ్ మరియు ఆటోమొబైల్ ఎగుమతులపై ఆధారపడే జర్మనీ మోడల్‌కు చైనా వంటి దేశాల నుండి గట్టి పోటీ ఎదురవుతోంది. తయారీ రంగం ఇతర దేశాలకు తరలిపోతుండటంతో డీ ఇండస్ట్రియలైజేషన్ భయం జర్మనీని వెంటాడుతోంది. జనాభాలో వృద్ధుల శాతం పెరుగుతుండటం, పెన్షన్, ఆరోగ్య రంగాలపై ఖర్చులు పెరుగుతున్నాయి.
మరోవైపు.. జర్మనీ రాజ్యాంగంలోని డెబ్ట్ బ్రేక్ నిబంధనలు ప్రభుత్వం భారీగా పెట్టుబడులు పెట్టకుండా అడ్డుకుంటున్నాయి, ఇది మౌలిక సదుపాయాల అభివృద్ధికి పెద్ద అవరోధంగా మారుతోంది. ఒకవేళ జీ7 దేశాలైన బ్రిటన్, ఫ్రాన్స్, జర్మనీలలో ఏ దేశమైనా డిఫాల్ట్ అయితే.. అది ప్రపంచ బ్యాంకింగ్ వ్యవస్థకు పెద్ద షాక్ అవుతుంది.
ఈ దేశాల బాండ్లలో ప్రపంచవ్యాప్తంగా ట్రిలియన్ల డాలర్ల పెట్టుబడులు ఉన్నాయి. కరెన్సీ విలువల పతనం వల్ల దిగుమతుల ధరలు పెరిగి తీవ్ర ద్రవ్యోల్బణం ఏర్పడుతుంది. యూరో మరియు పౌండ్ విలువలు పడిపోతే గ్లోబల్ ట్రేడ్‌లో అస్థిరత చోటు చేసుకుంటుంది. ఇది కేవలం ఆయా దేశాల సమస్య మాత్రమే కాదు, మొత్తం గ్లోబల్ ఫైనాన్షియల్ ఆర్కిటెక్చర్‌కే ముప్పుగా పరిణమిస్తుంది.
ఈ రుణ సంక్షోభం నుండి బయటపడటానికి కొన్ని వర్గాల్లో 'వార్ ఎగ్జిట్' సిద్ధాంతం కూడా చర్చకు వస్తోంది. అత్యధిక అప్పుల నుండి ప్రజల దృష్టిని మళ్లించడానికీ, లేదా ఆర్థిక వ్యవస్థను యుద్ధ ఉత్పత్తి వైపు మళ్లించడానికి పాలకులు యుద్ధ వాతావరణాన్ని ఉపయోగించుకోవచ్చనేది ఈ వివాదాస్పద వాదన సారాంశం. అయితే, నేటి ప్రజాస్వామ్య వ్యవస్థల్లో, పరస్పర ఆధారిత గ్లోబల్ మార్కెట్లలో ఇలాంటి చర్యలు ఆత్మహత్యాసదృశ్యమని నిపుణులు అంటున్నారు. యుద్ధం పరిష్కారం కాదనీ..
అది మరింత వినాశనానికి దారితీస్తుందని హెచ్చరిస్తున్నారు. చివరగా, యూరప్ దేశాలకు ఈ సంక్షోభం నుండి గట్టెక్కడానికి ఇంకా సమయం ఉంది. బ్రిటన్, ఫ్రాన్స్ మరియు జర్మనీల బలమైన ఆర్థిక పునాదులు, సెంట్రల్ బ్యాంకుల మద్దతు ఉన్న దేశాలు. అయితే..
పరిస్థితిని చక్కదిద్దుకోవడానికి తక్షణమే కఠినమైన ఆర్థిక నిర్ణయాలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. పన్నుల పెంపు, ప్రభుత్వ వ్యయాల తగ్గింపు, పెన్షన్ సంస్కరణలు, ఉత్పాదకతను పెంచడం వంటి చర్యలు చేపడితేనే దీర్ఘకాలికంగా మనుగడ సాధ్యమవుతుంది లేకుంటే యూరప్ ఈ ఆర్థిక టైంబ్ బాంబు పేలుడు నుంచి తప్పించుకోవడం క్షం అవుతుందనడంలో ఇసుమంతైనా సందేహం లేదు. -సీతారాం కంఠంనేని ఈ విశ్లేషణ మీకు నచ్చినట్లయితే, దయచేసి https://www.teluguone.com పోర్టల్ ను ఫాలో అవ్వండి. లైక్ చేయండి. షేర్ చేయండి. మీ విలువైన అభిప్రయాలను తెలియజేయండి.

