ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి నిర్మాణాన్ని ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. మూడేళ్లలో నిర్మాణాలు పూర్తి కావాలని చంద్రబాబు ఆదేశించారు.
ఇప్పుడిప్పుడే అమరావతికి ఒక రూపు రేఖలు వస్తున్నాయి. ఇప్పటికే ఎమ్మెల్యేల క్వార్టర్స్ నిర్మాణాలు దాదాపుగా పూర్తయ్యాయి. అయితే నిర్మాణాలు అనుకున్నంత వేగంగా పూర్తి కావడం లేదు. దీనిపై చంద్రబాబు కొంత సీరియస్ అయినట్లు సమాచారం. అధికారులు, మంత్రులు ఎప్పటికప్పుడు అమరావతిలో పర్యటించి నిర్మాణాల పురోగతిని పరిశీలించాలని చెప్పినప్పటికీ మంత్రులు ఎవరూ అటు వైపు వెళ్లకపోవడంపై చంద్రబాబు అసంతృప్తి వ్యక్తం చేశారు.
నిర్మాణాలను త్వరితగతిన...నిర్మాణాలను త్వరితగతిన పూర్తి చేయాలని ఆదేశించినప్పటికీ సీఆర్డీఏ అధికారులు తగిన రీతిలో పర్యవేక్షణ చేయకపోవడంతో పనులు నిదానంగా జరగకపోవడంపై చంద్రబాబు అసహనం వ్యక్తం చేశారు. నిధుల కొరత లేకపోయినా, భవనాల నిర్మాణ బాధ్యతలను కంపెనీలకు టెండర్ల ద్వారా అప్పగించినప్పటికీ ఏదో ఒక సాకు చెప్పి రాజధాని అమరావతి నిర్మాణ పనులు నిదానంగా కొనసాగుతున్నాయని చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేసినట్లు తెలిసింది. ఇలాగయితే ఎలా అనుకున్న లక్ష్యాన్ని పూర్తి చేయగలమని చంద్రబాబు ప్రశ్నించినట్లు తెలిసింది. అన్నీ అందుబాటులో ఉన్నప్పటికీ ఎందుకు ఆలస్యమవతుందని అధికారులను నిలదీసినట్లు సమాచారం. నారాయణ వివరణ...అయితే మంత్రి నారాయణ మాత్రం అమరావతి నిర్మాణ పనులు వేగంగానే జరుగుతున్నాయని చంద్రబాబుకు వివరించినట్లు తెలుస్తోంది. అనుకున్న లక్ష్యానికే పనులు పూర్తవుతాయని కూడా చంద్రబాబుకు వివరించినట్లు సమాచారం. కొన్ని భవనాలు మాత్రం మందకొడిగా సాగుతున్నాయని, ప్రతి రోజూ నిరంతరం పర్యవేక్షిస్తున్నానని, ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు అనుకున్న సమయానికే పనులు పూర్తి అయ్యేలా తగిన చర్యలు తీసుకుంటామని, పనులు పూర్తి చేయలేని కంపెనీలకు సంబంధించి త్వరలో నివేదిక సమర్పిస్తామని మంత్రి నారాయణ వివరించినట్లు తెలిసింది. అమరావతి నిర్మాణ పనుల్లో మరింత వేగం పెంచాలని ముఖ్యమంత్రి చంద్రబాబు ఈ మేరకు ఆదేశాలు జారీచేసినట్లు చెబుతున్నారు.

