Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
Belfast violence : బెల్‌ఫాస్ట్‌లో కొనసాగుతున్న హింస... వలసదారులపై ఆగ్రహం

Belfast violence : బెల్‌ఫాస్ట్‌లో కొనసాగుతున్న హింస... వలసదారులపై ఆగ్రహం

TeluguPost.com 1 day ago

త్తర ఐర్లాండ్‌లోని బెల్‌ఫాస్ట్‌లో కత్తిపోటు ఘటన తర్వాత చెలరేగిన ఉద్రిక్తతలు రెండో రాత్రికీ కొనసాగాయి. బుధవారం నిరసనకారులు చిన్నచిన్న మంటలు పెట్టడం, ఇటుకలు, రాళ్లు, సీసాలు విసరడంతో పోలీసులు వాటర్‌ క్యానన్లతో చెదరగొట్టే ప్రయత్నం చేశారు.

ముఖాలకు ముసుగులు ధరించిన కొందరు నిరసనకారులు ఇళ్ల బయట గోడల నుంచి ఇటుకలు పీకి పోలీసులపై విసిరారు. ఫుట్‌పాత్‌లను సుత్తులతో ధ్వంసం చేసి రాళ్లను ఆయుధాలుగా ఉపయోగించారు. మరోచోట కంచెను కూల్చి దాని ముక్కలను రోడ్డుపై అడ్డంగా పెట్టుకుని పోలీసుల నుంచి రక్షణ పొందేందుకు ప్రయత్నించారు. ఈ ఘర్షణలకు కొన్ని గంటల ముందే సూడాన్‌కు చెందిన హాది అలోదిద్‌ని బెల్‌ఫాస్ట్‌ కోర్టులో హాజరయ్యాడు. కత్తిపోటు ఘటనలో ఒక వ్యక్తిని తీవ్రంగా గాయపరిచినందుకు అతనిపై హత్యాయత్నం కేసు నమోదు చేశారు. ఈ ఘటన అనంతరం వలసదారుల వ్యతిరేక ఆందోళనలు మొదలయ్యాయి.

హత్యాయత్నం కేసులో నిందితుడు...

బెల్‌ఫాస్ట్‌ మేజిస్ట్రేట్‌ కోర్టులో వీడియో ద్వారా హాజరైన అలోదిద్‌ను జైలుకు తరలించాలని కోర్టు ఆదేశించింది. కత్తిదాడిలో స్టీఫెన్‌ ఒగిల్వీ ఎడమ కన్ను చూపు కోల్పోయినట్లు దర్యాప్తు అధికారి కోర్టుకు తెలిపారు. అతనిపై కత్తి కలిగి ఉండడం, దాడి తర్వాత చేతి గాయానికి చికిత్స పొందుతున్న సమయంలో రేడియోగ్రాఫర్‌ను చంపేస్తానని బెదిరించడం వంటి ఆరోపణలు కూడా ఉన్నాయి. ఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు అలోదిద్‌ బాధితుడిపై కూర్చుని ఉండగా, అతని చేతిలో వంటగది కత్తి ఉన్నట్లు గుర్తించారని అధికారి చెప్పారు. తర్వాత ఆసుపత్రి సిబ్బందితో మాట్లాడుతూ "నేను ఒకరిని చంపేశాను. అతను చనిపోయాడో లేదో తెలియదు" అని చెప్పాడని, అలాగే "నిన్నూ చంపేస్తాను" అని బెదిరించినట్లు తెలిపారు. అరబిక్‌ అనువాదకుడి సహాయంతో విచారణ జరిగినా, అలోదిద్‌ న్యాయవాది సేవలు తీసుకోవడానికి నిరాకరించాడు. ఆరోపణలపై ఎలాంటి సమాధానం ఇవ్వలేదు.

ఇళ్లకు నిప్పు.. పలువురి రక్షణ...

మంగళవారం రాత్రి వలసదారులు ఉంటున్నారని భావించిన పలు ఇళ్లకు కొందరు నిప్పంటించారు. చెత్త బుట్టలు, బస్సును తగులబెట్టారు. పోలీసులపై వస్తువులు విసిరారు. దీంతో మరింత హింస జరిగే అవకాశం ఉందని భావించిన పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. అగ్నిమాపక సిబ్బంది మంటల్లో చిక్కుకున్న పలువురిని రక్షించారు. రెండు డజన్లకుపైగా మంది నిరాశ్రయులయ్యారు. కాంగోకు చెందిన, ప్రస్తుతం బెల్‌ఫాస్ట్‌లో నివసిస్తున్న అన్సెల్మే షిమా మాట్లాడుతూ, "దాదాపు పదేళ్లుగా ఇక్కడే ఉంటున్నాను. పొరుగువారితో మంచి సంబంధాలు ఉన్నాయి. కానీ గత రాత్రి భయంకరంగా గడిచింది. ఇప్పుడు ఏం చేయాలో అర్థం కావడం లేదు. నేను భయపడుతున్నాను. తర్వాతి లక్ష్యం నేనేనా అన్న అనుమానం కలుగుతోంది" అని చెప్పారు. ఒక శిశువు ఉన్న కుటుంబంతో పాటు మరికొన్ని కుటుంబాలను భద్రత కోసం పోలీస్‌ స్టేషన్లకు తరలించినట్లు ఉత్తర ఐర్లాండ్‌ పోలీస్‌ సర్వీస్‌ చీఫ్‌ కానిస్టేబుల్‌ జాన్‌ బౌచర్‌ తెలిపారు."ఇది కేవలం జాతి మైనారిటీ కుటుంబాలపై జరిగిన దాడి కాదు. వివిధ వర్గాలకు చెందిన కుటుంబాలు ఈ దారుణానికి బలయ్యాయి. దీనికి ఎలాంటి సమర్థన లేదు" అని ఆయన బీబీసీకి చెప్పారు. బుధవారం అదనంగా 200 మంది పోలీసులను మోహరించినట్లు బౌచర్‌ వెల్లడించారు. ఇతర పోలీసు బలగాల సహాయాన్ని కూడా కోరుతున్నట్లు తెలిపారు. నిరసనలు జరిగే అవకాశం ఉండటంతో బెల్‌ఫాస్ట్‌లో బస్సు, రైలు సర్వీసులను ముందుగానే నిలిపివేస్తున్నట్లు రవాణా సంస్థలు ప్రకటించాయి.

హింస ఆపాలంటూ...

స్టీఫెన్‌ ఒగిల్వీ కుటుంబ సభ్యులు హింసను ఆపాలని కోరారు. "వలసదారులు మా దేశానికి ఎంతో విలువైన సేవలు అందిస్తున్నారు. ఈ విషాదాన్ని ప్రజలను విడదీయడానికి లేదా ద్వేషాన్ని రెచ్చగొట్టడానికి ఉపయోగించకండి" అని వారు ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఉత్తర ఐర్లాండ్‌ అధికార భాగస్వామ్య ప్రభుత్వంలోని రాజకీయ నేతలు కూడా హింసను ఖండించారు. ఫస్ట్‌ మినిస్టర్‌ మిషెల్‌ ఓ'నీల్‌ దీనిని "గూండాగిరి"గా అభివర్ణించారు. "ముసుగులు ధరించిన వ్యక్తులు కుటుంబాలను ఇళ్ల నుంచి తరిమేయడం పిరికితనానికి నిదర్శనం" అని ఆమె అన్నారు. డిప్యూటీ ఫస్ట్‌ మినిస్టర్‌ ఎమ్మా లిటిల్‌-పెంగెల్లీ మాట్లాడుతూ, "ఒక వ్యక్తి చేసిన దారుణానికి సంబంధం లేని వారిపై ఆగ్రహం చూపడం పూర్తిగా తప్పు" అని వ్యాఖ్యానించారు.

వైరల్‌ వీడియోతో ఉద్రిక్తత...

సోమవారం జరిగిన కత్తిదాడి వీడియో సామాజిక మాధ్యమాల్లో వేగంగా వ్యాపించింది. వలస వ్యతిరేక కార్యకర్తలు ఈ ఘటనను ప్రస్తావిస్తూ ప్రచారం చేపట్టారు. 40 ఏళ్ల వయసులో ఉన్న ఒగిల్వీ తలకు, ముఖానికి, వీపుకు తీవ్ర గాయాలతో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. అలోదిద్‌ 2023లో ఐర్లాండ్‌ గణతంత్రం నుంచి ఉత్తర ఐర్లాండ్‌కు వచ్చాడని పోలీసులు తెలిపారు. అతడు ఆశ్రయం కోరగా ఐదేళ్లపాటు ఉండేందుకు అనుమతి ఇచ్చినట్లు వెల్లడించారు.ఈ దాడికి ఉగ్రవాద సంబంధం ఉన్నట్లు ఎలాంటి సమాచారం లేదని ఉత్తర ఐర్లాండ్‌ పోలీస్‌ సర్వీస్‌ స్పష్టం చేసింది. అయినా, తీవ్ర మితవాద కార్యకర్తలు సామాజిక మాధ్యమాల ద్వారా నిరసనలకు పిలుపునివ్వడంతో రాజకీయ నాయకులు శాంతి కోరినప్పటికీ హింస చెలరేగింది. బ్రిటన్‌ ప్రధాని కీర్ స్టార్మర్ కత్తిదాడిని "అసహ్యకరమైన ఘటన"గా ఖండించారు. అయితే వ్యక్తుల నేపథ్యం ఆధారంగా వారిపై హింసకు దిగడం సహించబోమన్నారు. "బెల్‌ఫాస్ట్‌లో కనిపించిన దృశ్యాలు దిగ్భ్రాంతికరంగా ఉన్నాయి. హింసకు, అల్లర్లకు ఎలాంటి సమర్థన లేదు. వాటిని ప్రోత్సహించిన వారినీ అంగీకరించలేం" అని ఆయన పేర్కొన్నారు.ఉత్తర ఐర్లాండ్‌ న్యాయశాఖ మంత్రి నవోమి లాంగ్ మాట్లాడుతూ, స్థానిక ప్రజల భయాలను కొందరు సామాజిక మాధ్యమాల్లో రాజకీయ ప్రయోజనాల కోసం ఉపయోగించుకుంటున్నారని ఆరోపించారు."చర్మరంగు తప్ప మరే కారణం లేకుండా ప్రజలను ఇళ్ల నుంచి వెళ్లగొడితే దాన్ని వర్ణవివక్షగానే పరిగణించాలి" అని ఆమె బీబీసీకి చెప్పారు.

ఐర్లాండ్‌ సరిహద్దుపై మళ్లీ చర్చ...

ఈ ఘటన నేపథ్యంలో ఉత్తర ఐర్లాండ్‌-ఐర్లాండ్‌ గణతంత్రం మధ్య ఉన్న తెరిచిన సరిహద్దు వ్యవస్థను పునఃసమీక్షించాల్సిన అవసరం ఉందని కొందరు రాజకీయ నాయకులు అభిప్రాయపడ్డారు. ఈ సరిహద్దు అంశం అత్యంత సున్నితమైనది. ప్రజల స్వేచ్ఛాయుత రాకపోకలు దశాబ్దాల హింసకు ముగింపు పలికిన శాంతి ప్రక్రియలో కీలక భాగం. 1998 శాంతి ఒప్పందానికి ముందు జరిగిన ఘర్షణల్లో దాదాపు 3,600 మంది ప్రాణాలు కోల్పోయారు. మంగళవారం జరిగిన హింసలో ఎక్కువ భాగం కార్మిక వర్గాలు నివసించే ప్రాంతాల్లోనే చోటుచేసుకుంది. అక్కడ పూర్వ పారామిలిటరీ గుంపుల ప్రభావం ఇప్పటికీ ఉన్నట్లు భావిస్తారు. ఇటీవల ఇంగ్లాండ్‌లోని సౌతాంప్టన్‌లో విద్యార్థి హెన్రీ నోవాక్‌ హత్య కేసును కూడా కొందరు వలస వ్యతిరేక కార్యకర్తలు ప్రస్తావించారు. అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ కూడా వలసలే హింసకు కారణమని వ్యాఖ్యానించగా, స్టార్‌మర్‌తో పాటు పలువురు బ్రిటిష్‌ నేతలు ఆ అభిప్రాయాన్ని తిరస్కరించారు. నోవాక్‌ను హత్య చేసిన విక్రుమ్‌ దిగ్వాకు గత వారం జీవిత ఖైదు విధించారు. ఆ కేసుకు సంబంధించిన నిరసన కూడా హింసాత్మకంగా మారగా, పలువురిపై అల్లర్ల కేసులు నమోదు అయ్యాయి.


Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Telugu Post Telugu