పేగు తెంచుకున్న కుమార్తెను ఒక వివాహిత దారుణంగా హత్య చేసింది. ఈ ఘటన బెంగళూరులో జరిగింది. ప్రియుడు తో కలసి ఉండేందుకు కుమార్తె అడ్డంగా ఉందని భావించి కడుపున పుట్టిన పాపను హత్య చేసిన కిరాతక తల్లిని బెంగళూరు పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
బెంగళూరలోని కాడుగోడి పోలీస్ స్టేషన్ పరిధిలో ఈ ఘటన జరిగింది. ప్రియాంక అనే యువతితో ప్రవీణ్ కు పదిహేనేళ్ల క్రితం వివాహం అయింది. ప్రియాంక అడ్వొకేట్ గా పనిచేస్తుండగా, ప్రవీణ్ ప్రయివేటు కంపెనీలో ఉద్యోగి. ఈ దంపతులకు కుమారుడు, కుమార్తె ఉన్నారు. కొన్ని రోజుల పాటు సాఫీగా సాగిన దాంపత్యంలోకి వివాహేతర సంబంధం చిచ్చు రేపింది.
వివాహేతర సంబంధం...
తన చిన్న నాటి స్నేహితుడు మోహన్ కలవడంతో ప్రియాంక ఆలోచనలు మారాయి. మోహన్ రియల్ ఎస్టేట్ వ్యాపారి కావడంతో పాటు డబ్బులు కూడా పుష్కలంగా ఉండటంతో మోహన్ తో వివాహేతర సంబంధాన్ని ప్రియాంక ఏర్పరచుకుంది. ఈ ఇద్దరి విషయం తెలిసి భర్త ప్రవీణ్ పలుమార్లు హెచ్చరించాడు. అయినా ఫలితం లేదు. మోహన్ తో కలసి ఉండేందుకు నిర్ణయించుకున్న ప్రియాంక భర్త ప్రవీణ్ వద్ద కుమారుడిని వదిలేసి ఐదేళ్ల తన కుమార్తెను తీసుకుని మోహన్ తో సహజీవనం చేస్తుంది. భర్త ప్రవీణ్ కు విడాకుల నోటీసులు కూడా పంపింది.
ప్రియుడితో ఉండేందుకు...
అయితే తన ప్రియుడితో ఉండేందుకు కుమార్తె అడ్డురావడం, కుమార్తె తరచూ తన తండ్రి ప్రవీణ్ కావాలంటూ అల్లరి చేయడంతో తొలగించడానికి ప్లాన్ చేసింది. హత్య చేసింది. అంత్యక్రియలను కూడా నిర్వహించింది. అనారోగ్యంతో తన కుమార్తె వెన్నల మరణించిందని నమ్మబలికింది. అయితే ఈ విషయం తెలిసిన భర్త ప్రవీణ్ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో అసలు విషయం వెలుగు చూసింది. హత్య విషయం బయటపడుతుందని ప్రియాంక పరారయింది. ప్రియాంక తన కుమార్తెను గొంతు నులిమి హత్య చేసినట్లు పోస్టుమార్టం నివేదికలో తేలడంతో పోలీసులు ప్రియాంకను అరెస్ట్ చేశారు. హసన్ లో ప్రియాంకను అరెస్ట్ చేసిన పోలీసులు బెంగళూరుకు తీసుకు వచ్చి విచారిస్తున్నారు.

