Telangana : భారతీయ జనతా పార్టీ తెలంగాణలో 'మిషన్ తెలంగాణ' కార్యకలాపాలను ప్రారంభించింది. పార్టీని సంస్థాగతంగా బలోపేతం చేయడంతో పాటు వచ్చే ఎన్నికల్లో గెలుపే లక్ష్యంతో అడుగులు వేస్తుంది.
ఇప్పటికే కేంద్ర నాయకత్వం తెలంగాణపై కన్ను వేసింది. ఇక్కడి రాష్ట్ర నాయకత్వాన్ని, ద్వితీయ శ్రేణి నేతల మధ్య సమన్వయం సాధించే దిశగా అనేక కార్యక్రమాలను మొదలుపెట్టింది. రాష్ట్ర స్థాయి నాయకుల్లోనూ తొలుత సమన్వయం ఉండాలని ఇప్పటికే కేంద్ర నాయకత్వం రాష్ట్ర నాయకులకు ఆదేశాలు జారీ చేసింది. ప్రధానంగా ఎంపీలు, ఎమ్మెల్యేలు కేవలం తమ నియోజకవర్గాలకు మాత్రమే కాకుండా రాష్ట్ర వ్యాప్తంగా పర్యటిస్తూ పార్టీని క్షేత్రస్థాయిలో బలోపేతం చేయాలని స్పష్టమైన మౌఖిక ఉత్తర్వులను జారీ చేసింది. కేవలం కొన్ని ప్రాంతాలకే పార్టీని పరిమితం చేయకుండా రాష్ట్ర వ్యాప్తంగా కమలం జెండా ఎగరగలిగేందుకు అవసరమైన కార్యాచరణ సిద్ధం చేయాలని ఆదేశించింది.
కేంద్ర నాయకులు తరచూ...
దీంతోపాటు పార్టీ కేంద్ర నాయకులు కూడా తరచూ తెలంగాణలో పర్యటిస్తూ పార్టీ క్యాడర్ లో ఉత్తేజాన్ని నింపాలని కూడా కేంద్ర మంత్రులతో పాటు కేంద్ర నాయకులను కూడా ఆదేశించింది. వచ్చే ఎన్నికల్లో శాసనసభతో పాటు అత్యధిక సంఖ్యలో పార్లమెంటు స్థానాలను దక్కించుకునేందుకు అవసరమైన రోడ్ మ్యాప్ ను సిద్ధం చేయాలని కూడా రాష్ట్ర నాయకులను ఆదేశించింది. ఇతర పార్టీల నుంచి చేరికలను కూడా ప్రోత్సహించా లని కూడా చెప్పింది. దీంతో పాటు పార్టీ జాతీయ అధ్యక్షుడు నితిన్ నబిన్ కూడా తన పర్యటన సందర్భంగా తెలంగాణను ప్రత్యేక మిషన్‌గా తీసుకున్నట్లు ప్రకటించారు. బూత్ స్థాయి నుంచి పార్టీని బలోపేతం చేయడం, సంస్థాగత మార్పులు, కేంద్ర ప్రభుత్వ పథకాల ప్రచారం, అలాగే రాబోయే ఎన్నికలను లక్ష్యంగా చేసుకుని ప్రణాళికలు అమలు చేస్తున్నట్లు తెలిపారు.
అగ్రనేతల పర్యటనలతో...
అమిత్ షా, నరేంద్ర మోదీ వంటి అగ్రనేతల పర్యటనలతో పాటు క్షేత్రస్థాయి కార్యక్రమాలు ఈ వ్యూహంలో భాగంగా ఉన్నాయని రాజకీయ విశ్లేషణలు చెబుతున్నాయి. ఇటు బీఆర్ఎస్, అటు కాంగ్రెస్ పాలనను ప్రజలు చూశారని, డబుల్ ఇంజిన్ సర్కార్ నినాదంతో పల్లెలకు వెళ్లాలని కూడా పార్టీ నాయకత్వాన్ని ఆదేశించింది. అవసరమైతే అన్ని నియోజకవర్గాల్లో సభలను నిర్వహించడం, అక్కడకు కేంద్ర మంత్రులు హాజరు కావడంతో పాటు అభివృద్ధి పనులను ప్రారంభించడంతో పాటు, కేంద్ర ప్రభుత్వం తెలంగాణకు మంజూరు చేసిన నిధులు, ప్రాజెక్టుల విషయంలోనూ ప్రజలకు పూర్తి స్థాయిలో వివరించాలని కోరింది. ఎప్పటికప్పుడు డెయిలీ రిపోర్ట్ లాగా నాయకులు పంపాలని, ఈరోజు ఏం చేశారు? ఎక్కడ పర్యటించారు? అన్న దానిపై జాతీయ పార్టీకి ఇవ్వాలని కూడా కోరినట్లు తెలిసింది. దీంతో రాష్ట్ర నాయకులను ఎప్పటికప్పడు గాడిలో పెట్టే బాధ్యతను కూడా పార్టీ రాష్ట్ర పరిశీలకులకు అప్పగించినట్లు సమాచారం. మొత్తం మీద మిషన్ తెలంగాణను కమలం పార్టీ కేంద్ర నాయకత్వం ప్రారంభించినట్లే కనపడుతుంది.

