Telangana : తెలంగాణాలో బీజేపీ రాజకీయ వ్యూహాన్ని మార్చింది. కేంద్ర నాయకత్వం తలంటడంతో ఇప్పుడు తెలంగాణ కమలం పార్టీ నేతలు యాక్టివ్ అయ్యారు. సోషల్ మీడియాలో తెలంగాణ నాయకులు వెనకబడి ఉండటాన్ని కేంద్ర నాయకత్వంతో పాటు రాష్ట్ర పార్టీ ఇన్ ఛార్జులు కూడా తప్పుపట్టారు.
డిజిటల్ యుగం నడుస్తున్న సమయంలో ఇలా వెనకబడి ఉంటే పార్టీ ఎలా ఎదుగుతుందని ప్రశ్నించారు. ఇకపై రీల్స్ చేయడం, మీమ్స్ వంటి వాటితో ప్రజలను ఆకట్టుకునేందుకు ప్రయత్నించాలని, తెలంగాణలోని ప్రతి ఒక్క బీజేపీ నేతల సోషల్ మీడియాలో యాక్టివ్ కావాలని, వారి ఫాలోయిర్స్ సంఖ్య పెరగాలని ఆదేశాలు జారీచేసింది.
వ్యూహాత్మక పోస్టులతో...
ఇటీవల సోషల్ మీడియా వేదికగా కాక్రోచ్ జనతా పార్టీ ఆవిర్భవించి ఎన్ని మిలియన్ల మందికి దగ్గరయిందో గుర్తుకు తెచ్చుకోవాలని రాష్ట్ర నేతలకు బీజేపీ కేంద్ర నాయకత్వం క్లాస్ పీకింది. తెలంగాణలో అధికార, ప్రతిపక్ష పార్టీల విధానాలపై సోషల్ మీడియా వేదికగా బీజేపీ దూకుడు పెంచింది. ప్రభుత్వ వైఫల్యాలను ఎత్తిచూపడం, వ్యూహాత్మక పోస్ట్‌లతో ట్రెండింగ్ సృష్టించడం మరియు డిజిటల్ క్యాంపెయిన్ల ద్వారా కేడర్‌లో జోష్ నింపడం వంటి అంశాలపై ఆ పార్టీ ప్రధానంగా దృష్టి సారించింది. ఇందుకోసం ప్రతి నేత సోషల్ మీడియాను హ్యాండిల్ చేసేందుకు సిబ్బందిని కూడా నియమించుకున్నారని తెలిసింది. తమ పర్యటనలతో పాటు ప్రభుత్వంపై విమర్శలు కూడా ఇందులో చోటు చేసుకుంటున్నాయి.
సోషల్ మీడియా వ్యూహాలతోనే...
సోషల్ మీడియా వ్యూహాలతోనే అధికారంలోకి రాగలమని బీజేపీ కేంద్ర నాయకత్వం నమ్ముతుంది. దేశంలో, రాష్ట్రంలోసోషల్ మీడియా వినియోగం పెరిగిపోవడంతో దానిని అందిపుచ్చుకుని వెళితే తప్ప అధికారానికి దగ్గరకు కాలేమని పదే పదే చెప్పిన మాటలు కమలనాధులకు ఇప్పటికి చెవికి ఎక్కినట్లున్నాయి. ప్రభుత్వంపై విమర్శలతో పాటు కాంగ్రెస్ మరియు బీఆర్ఎస్ పాలనా విధానాలను, నిర్ణయాలను నిరసిస్తూ నిరంతరం డిజిటల్ అస్త్రాలు సంధిస్తున్నారురాష్ట్ర ప్రభుత్వ హామీలు, ప్రజా సమస్యలపై ప్రత్యేక హ్యాష్‌ట్యాగ్‌లతో సోషల్ మీడియాలో పోస్టులు హోరెత్తిస్తున్నారు.రాష్ట్ర నాయకులు సైతం ఆన్‌లైన్ చర్చల్లో పాల్గొంటూ కార్యకర్తలను సమాయత్తం చేస్తున్నారు. మొత్తం మీద తెలంగాణ బీజేపీలో పెద్ద మార్పు వచ్చినట్లుందన్న వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి.

