తెలంగాణ బీజేపీలో నేతల మధ్య సమన్వయం లేదు. ఎవరికి వారే తమ దారిలో వెళుతున్నారు. తెలంగాణలో అధికారంలోకి రావాలని కేంద్ర నాయకత్వం భావిస్తున్నప్పటికీ, రాష్ట్ర బీజేపీ నేతల మధ్య సమన్వయ లేమి ఆ ఆశలకు గండి కొట్టేలా కనిపిస్తుంది.
ఎందుకంటే.. పైకి బాగున్నప్పటికీ... లోలోపల ఒకరంటే ఒకరికి పడని పరిస్థితి. ఏ ఒక్క నేతకు మరొక నేత పడని పరిస్థితి వచ్చింది. అందరు నేతలు తాము తోపులమని భావించే స్థితికి రావడంతోనే తెలంగాణ బీజేపీలో ఈ పరిస్థితి తలెత్తిందన్న అభిప్రాయం వ్యక్తమవుతుంది. అందుకే ఇటీవల జరిగిన స్థానిక సంస్థల ఎన్నికల్లోనూ తక్కువ స్థానాలకే బీజేపీ పరిమితం కావాల్సి వచ్చింది.
హైదరాబాద్ ఎన్నికల్లో...
గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికలతో పాటు జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలకు సమయం దగ్గరపడుతుంది. పంచాయతీ, మున్సిపాలిటీ ఎన్నికల్లో కమలం పార్టీ కుదేలు కావడానికి నేతల మధ్య విభేదాలే కారణమని పార్టీ నాయకులతో పాటు కింది స్థాయి క్యాడర్ కూడా అభిప్రాయపడుతుంది. ఇటీవల ప్రధాని నరేంద్ర మోదీ హైదరాబాద్ లో పర్యటించి ఒకింత పార్టీలో జోష్ తెచ్చినా దానిని నిలబెట్టుకునే పరిస్థితుల్లో రాష్ట్ర నాయకులు లేరు. ఎవరికి వారు క్రెడిట్ తమకు దక్కాలన్న భావనలోనే ఉన్నారు. తమ నియోజకవర్గానికే పరిమితమవుతూ రాష్ట్ర స్థాయి సమస్యలపై కూడా స్పందించకపోవడం ఇందుకు ఉదాహరణగా చెప్పాలి.
బండి సంజయ్ కు అండగా...
కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమారుడు బండి భగీరథ్ అంశం పార్టీని ఒకింత డ్యామేజీ చేసింది. అయితే బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచందర్ రావుతో పాటు ఒకరో ఇద్దరు నేతలు మినహా మరెవరు సంజయ్ కు అండగా నిలబడలేదు. ఇందులో బండి సంజయ్ కి ఏం సంబంధమని ప్రశ్నించే వారు కూడా లేరు. పైగా సంజయ్ ఆ వివాదంలో చిక్కుకోవడంతో కొందరు లోలోపల సంతోషిస్తున్నారని ఆ పార్టీ సోషల్ మీడియాలోనే ట్రోల్ చేస్తుండటం విశేషం. ఇలాగే నేతల వైఖరి కొనసాగితే బీజేపీ తెలంగాణలో జరిగే ఏ ఎన్నికల్లోనూ విజయం సాధించడం, లేదా వచ్చే శాసనసభ ఎన్నికల్లో అధికారంలోకి రావడం అనేది జరగదన్నది రాజకీయ విశ్లేషకుల అంచనా.

