తెలంగాణలో బీజేపీ వచ్చే ఎన్నికల్లో ఒంటరిగా పోటీ చేస్తుంది. ఇప్పటి వరకూ ఉన్న సందేహాలకు కేంద్ర హోం మంత్రి అమిత్ షా స్పష్టత నిచ్చారు. బీజేపీ, బీఆర్ఎస్ కలసి పోటీ చేస్తుందని కొందరు, టీడీపీ, జనసేనతో బీజేపీతో పొత్తు పెట్టుకుంటుందని మరికొందరు ఇలా ప్రచారం చేస్తున్న నేపథ్యంలో అమిత్ షా ఇచ్చిన క్లారిటీతో బీజేపీ నేతలకు కూడా రిలీఫ్ దక్కింది.
ఎందుకంటే ఇటీవల పవన్ కల్యాణ్ వచ్చి జనసేన పోటీ చేస్తుందని చెప్పడం, మహానాడులో లోకేశ్ తెలంగాణలో టీడీపీని బలోపేతం చేస్తామని చెప్పడంతో ఆంధ్రప్రదేశ్ లో మాదిరిగానే ఇక్కడ కూడా మూడు పార్టీలు కూటమిగా పోటీ చేస్తాయని సోషల్ మీడియాలో ప్రచారం ఊపందుకుంది.
అమిత్ షా చెప్పారంటే...
కానీ కేంద్ర హోం మంత్రి అమిత్ షా దీనిపై స్పష్టత ఇచ్చారు. మీడియాతో చిట్ చాట్ లో అమిత్ షాతో మాట్లాడుతూ తెలంగాణలో బీజేపీ ఒంటరిగానే పోటీ చేస్తుందని చెప్పారు. ఇందులో ఎవరికి అనుమానం అక్కరలేదని తెలిపారు. బీజేపీ అన్ని రాష్ట్రాల్లోనూ ఒంటరిగా పోటీ చేసి అధికారంలోకి రావడానికే ప్రయత్నిస్తుందని చెప్పడం కూడా ఆయన రానున్న ఎన్నికల్లో ఎలాంటి వ్యూహం అనుసరిస్తారన్నది రాజకీయంగా చర్చనీయాంశమైంది. అయితే ఆంధ్రప్రదేశ్ లో పొత్తుపై ఎటువంటి వ్యాఖ్యలు చేయనప్పటికీ తెలంగాణలో మాత్రం ఒంటరిగానే పోటీ చేస్తామని చెప్పడంతో ఒకింత తెలంగాణ నేతలకు క్లారిటీ వచ్చినట్లయింది.
తెలంగాణలో బలంగా....
తెలంగాణలో ప్రస్తుతం బీజేపీ బలంగా ఉందని భావిస్తున్నారు. కొద్దిగా కష్టపడితే ఒంటరిగా అధికారంలోకి రావడం పెద్ద కష్టమేమీ కాదని కూడా కేంద్ర నాయకత్వం గట్టిగా విశ్వసిస్తుంది. గత ఎన్నికల్లోనే ఎనిమిది పార్లమెంటు స్థానాలను సాధించడంతో ఇక ఒకరితో ఆధారపడి తెలంగాణ రాజకీయాలు చేయడం తెలివి తక్కువ పని అన్న అంచనాకు ఎప్పుడో ఢిల్లీ పెద్దలు వచ్చారు. తమ తదుపరి లక్ష్యం తెలంగాణ మాత్రమేనని అమిత్ షా స్పష్టం చేసినట్లయింది. రానున్న రోజుల్లో ఇక్కడి నేతల మధ్య సమన్వయం సాధించడమే కాకుండా పార్టీ ఓటు బ్యాంకును మరింత విస్తృత పర్చుకోవడం కోసం తగిన కార్యాచరణను కూడా ఢిల్లీ నుంచి రూపొందించే అవకాశాలున్నాయి. ఇక్కడి నేతలు వాటిని అమలు పర్చడమే పని. మిగిలిన పని కేంద్ర నాయకత్వం చూసుకుంటుందన్నది ఇప్పటికే తెలంగాణ బీజేపీ నేతలకు స్పష్టం చేసినట్లు తెలిసింది.

