Andhra Pradesh : జమ్మలమడుగు బీజేపీ ఎమ్మెల్యే ఆదినారాయణరెడ్డి సంచలన నిర్ణయం తీసుకోనున్నారా? ఇదే రాష్ట్ర రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారింది. పార్టీ నాయకత్వాన్ని హెచ్చరిస్తున్నారా?
లేక నిజంగానే ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తారా? అన్నది స్పష్టత లేకపోయినా ఆది మాత్రం చాలా అసంతృప్తితో ఉన్నట్లు కనపడుతుంది. టీడీపీకి, బీజేపీకి మధ్య సమన్వయం లేదని ఆయన వ్యాఖ్యానించడంతో పాటు తన రాజీనామాపై త్వరలోనే ప్రకటన ఉంటుందని తెలిపారు. తనకు మంత్రి పదవి ఇవ్వాల్సిన అవసరం లేదని, కనీసం తన మాటకు జిల్లాలో ప్రాధాన్యత లేకపోతే ఎలా అని ఆదినారాయణరెడ్డి ప్రశ్నిస్తుననారు. కడప జిల్లా పరిషత్ చైర్మన్ పదవి వివాదం నేపథ్యంలో జమ్మలమడుగు బీజేపీ ఎమ్మెల్యే ఆదినారాయణరెడ్డి తన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసే అంశంపై తీవ్రంగా చర్చ జరుగుతోంది.
రాజీనామాపై స్పందన ఇదే...
జడ్పీ చైర్మన్ పదవి విషయంలో తనకు అన్యాయం జరిగిందని అసంతృప్తి వ్యక్తం చేసిన ఆదినారాయణరెడ్డి, తన నిర్ణయంపై రేపు ప్రకటన చేస్తానని తెలిపారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు మాధవ్‌తో చర్చల అనంతరం కూడా ఆయన తన నిర్ణయం మార్చుకునేది లేదని స్పష్టం చేసినట్లు తెలిసింది. కడప జడ్పీ చైర్మన్ పదవిని తన తమ్ముడి కుమారుడు డాక్టర్ రాజేష్‌రెడ్డికి కేటాయించకపోవడం, అభ్యర్థి ఎంపికలో చివరి నిమిషంలో మార్పులు జరగడంపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది. కడప జడ్పీ ఛైర్మన్ అభ్యర్థి పదవిని టీడీపీకి కేటాయించడం, కృష్ణా జిల్లా జడ్పీ ఛైర్మన్ పదవిని బీజేపీ తీసుకోవడం పట్ల ఆదినారాయణ రెడ్డి అసహనంతో ఉన్నారు.
అసంతృప్తి అందుకే...
తనకు ప్రాధాన్యత లేని చోట ఉండటం అనవరమనుకున్నారో? ఏమో తెలియదు కానీ గట్టి వార్నింగ్ అయితే ఇచ్చారు. ఆదినారాయణరెడ్డి కుటుంబ సభ్యులు జడ్పీటీసీ పదవులకు రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించగా, ఆయనతో పాటు మరికొందరు స్థానిక ప్రజాప్రతినిధు లు కూడా రాజీనామా చేసే యోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. బీజేపీ చీఫ్ మాధవ్ తో పాటు బీజేపీ విశాఖ ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు విజయవాడలో హోటల్ కు వెళ్లి ఆదినారాయణరెడ్డిని బుజ్జగించినట్లు సమాచారం. అయితే ఆదినారాయణరెడ్డి వ్యవహారం తొలినుంచి టీడీపీ కడప జిల్లా నేతలకు మింగుడుపడటం లేదు. అనేక విషయాల్లో, పలు నియోజకవర్గాల్లో ఆది తలదూర్చడాన్ని వారు ఇన్నాళ్లూ మౌనంగా భరించారు. చివరకు సమయం వచ్చినప్పుడు టీడీపీ హైకమాండ్ పై వత్తిడి తెచ్చి జడ్పీ ఛైర్మన్ పదవి తాము తెచ్చుకున్నారు. దీంతో ఆది హర్ట్ అయ్యారు. దీనిని భరించలేకనే ఆదినారాయణరెడ్డి రాజీనామా అస్త్రాన్ని ప్రయోగించినట్లు తెలిసింది. మొత్తం మీద కమలం పార్టీలో ఆది వ్యవహారం తలనొప్పిగా మారింది.

