తెలంగాణలో బీఆర్ఎస్ లో కొంత అయోమయం నెలకొంది. నేతలు ఆ పార్టీలో చేరేందుకు కూడా ముందుకు రావడంలేదు. బీఆర్ఎస్ నుంచి కల్వకుంట్ల కవిత బయటకు వచ్చి వేరే పార్టీ పెట్టడంతో కొంత రాజకీయంగా ఇబ్బందులున్నాయని చెప్పాలి.
వచ్చే ఎన్నికల్లోనూ బీఆర్ఎస్ గెలుస్తుందన్న నమ్మకం లేకపోవడం వల్లనే చేరికలు లేవని ప్రత్యర్థి పార్టీలకు చెంసోషల్ మీడియాలో వార్తలు కనిపిస్తున్నాయి. బీఆర్ఎస్ పార్టీలో చేరికలు లేవు. అలాగని వెళ్లిపోయే వారు లేరు. కొనసాగుతున్న వారు కూడా పెద్దగా అందరూ యాక్టివ్ గా లేకపోవడం కూడా చర్చనీయాంశమైంది.
రెండున్నరేళ్లు గడుస్తున్నా...
తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటయి రెండున్నరేళ్లు గడుస్తుంది. సహజంగా అధికార పార్టీపై వ్యతిరేకత ఉంటుంది కనుక బలమైన అపోజిషన్ పార్టీలో చేరే వారు ఎక్కువగా ఉంటారు. ఇంత ముందుగా ఎందుకంటే వచ్చే ఎన్నికల్లో తమకు టిక్కెట్ కన్ఫర్మ్ చేసుకోవడం కోసం ముందుగానే వచ్చి చేరతారు. ఇటీవల జీవన్ రెడ్డి చేరికను కొందరు ఉదహరించవచ్చు. కానీ కాంగ్రెస్ లో తనకు సరైన ప్రాధాన్యత లభించకపోవడం వల్లనే జీవన్ రెడ్డి బీఆర్ఎస్ లో చేరారు కాని, లేకపోతే ఆయన కూడా చేరే వారు కారన్నది అందరూ ఒప్పుకుని తీరాల్సిన నిజం. జీవన్ రెడ్డికి కాంగ్రెస్ లో ఏదో ఒక పదవి దక్కి ఉంటే చేరే వారా? అని కాంగ్రెస్ నేతలు ప్రశ్నిస్తున్నారు.
ఎమ్మెల్యేలు వీడినప్పటికీ...
కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటయిన వెంటనే పది మంది ఎమ్మెల్యేలు బీఆర్ఎస్ ను వదిలి కాంగ్రెస్ లో చేరారు. ఆ తర్వాత ఎవరూ చేరలేదని ఆ పార్టీ నేతలు కొంత సర్ది చెప్పుకుంటున్నా.. కొత్తగా వచ్చి చేరే నేతలేరన్నదే ఇప్పుడు ప్రశ్నిస్తున్నారు. ఉప ఎన్నికలు అన్నింటిలోనూ ఓటమి చవి చూసిన ఆ పార్టీపై నమ్మకం లేకపోవడంతో పాటు పార్టీ అధినేత కేసీఆర్ బయటకు రాకపోవడం కూడా ఒక కారణమని అని అంటున్నారు. కేటీఆర్, హరీశ్ రావులు ఎంతగా ప్రజా సమస్యలపై ఉద్యమిస్తున్నప్పటికీ కేసీఆర్ కు వచ్చిన మైలేజీ రాదన్నది వాస్తవమని పార్టీ సీనియర్ నేతలే అభిప్రాయపడుతున్నారు. ఇప్పటి వరకూ అనేక నియోజకవర్గాల పరిధిలోని నాయకులు కూడా చేరికలను ప్రోత్సహించడం లేదన్న అభిప్రాయమూ ఉంది. మొత్తం మీద బీఆర్ఎస్ లో చేరేవారు లేరు. వెళ్లేవారు లేరు. కొత్త ముఖాలకు కనిపించేందుకు అవకాశమే కనిపించడం లేదు.

