Delhi : పురుగులు పరుగులు పెట్టించాయ్. బొద్దింకలే భయపెట్టాయ్. "హిట్" తో తరిమికొట్టొచ్చని పాలక వర్గాలు భ్రమించాయి. కానీ చిన్న పురుగులే రాజకీయ వృద్ధ జంబూకాలను తలంచేలా చేశాయి.
అదీ యువతరం శక్తి. నవతరం శిరమెత్తితే ఎలా ఉంటుందో కాక్రోచ్ జనతా పార్టీ చాటి చెప్పింది. ఇది రాజకీయ పార్టీ కాదు. అత్యున్నత స్థాయిలో ఉన్న ఒక వ్యక్తి చేసిన హేళన వ్యాఖ్యల నుంచి పుట్టుకొచ్చిన ఉద్యమం. ఒక రకంగా యువత జంతర్ మంతర్ లో జనతా గ్యారేజీ ని ఏర్పాటు చేశారు. రాజకీయాల్లో ఉన్న కుళ్లు, అవినీతిని బట్టబయలు చేసేందుకు నడుం కట్టారు. వారికి మతంతో సంబంధం లేదు. కులంతో పనిలేదు. ఒకే ఒక పిలుపు వారిని కదిలించింది. నిజంగా ఇది జెన్ జీ ఉద్యమం. దీనికి ఢిల్లీ పాదుషాలు తలవంచక తప్పలేదు. వారి డిమాండ్లను అంగీకరించక తప్పలేదు. కాక్రోచ్ జనతా పార్టీ డిమాండ్ కు తలవంచి కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రదాన్ రాజీనామా చేశారు.
నాలుగు రోజులనుకుంటే...బొద్దింకలే కదా.. నాలుగు రోజులుండి నీరసించి వెళ్లి పోతారనుకున్నారు. నీరుగారి పోతారని అంచనా వేశారు. కానీ నెలనుంచి ఉద్యమం సాగుతుంది. ఢిల్లీలో మొదలయిన బొద్దింకల ఉద్యమం దేశమంతా విస్తరించింది. పిల్లలు పిడుగుల్లా మారారు. వారు పడుతున్న వేదన చూసి యావత్ భారత్ దేశం చలించిపోయింది. అన్ని జనరేషన్ లు వారికి మద్దతు నిచ్చాయి. ఆ ఉద్యమంలో విదేశీ ద్రోహులున్నారు.. బంగ్లాదేశీయులు చొరబడ్డారన్నారు. కానీ ఉన్న చోట నుంచి చలించలేదు. కదలలేదు. రాను రాను ఉద్యమ హోరును చూసి రాజకీయ పార్టీలు కూడా చేతులు కలపాల్సి వచ్చింది. రాజకీయ పార్టీల మద్దతు పెరుగుతూ,ఉద్యమం ప్రపంచం మొత్తం చూస్తోందని అర్థమయ్యాక...అయ్యయ్యో పిల్లల ఉద్యమాన్ని రాజకీయ పార్టీలు హైజాక్ చేస్తున్నాయి,ఇక ఉద్యమం నాశనమే అని దొంగ ఏడుపులు ఏడ్చారు.పిల్ల గాలి,పెద్ద తుఫాను గా మారి అధికార పీఠం బద్దలయ్యే స్థాయికి చేరుకుంటోంది అని తెలిశాక .. అందులో నీట్ విద్యార్థులే వున్నారా? లీకేజి లు అవ్వడం ఇదే మొదటి సారి కాదు కదా అని స్వరం తగ్గించారు..మంత్రితో రాజీనామా చేయించి ఉంటే బావుండేది ఏమో అని స్వరం మార్చుకుంటున్నారు. ఇది ఒక నెలలో వచ్చిన మార్పు. దేశంలోనే కాదు. అన్ని దేశాల్లో ఉన్న భారతీయ యువత కదిలింది. ప్రపంచంలోనే పాలకుల పరువు పోయింది. కేవలం ఒకే ఇక పోస్టుతో...అభిజిత్ దీప్కే అబ్బాయి అమెరికాలో తన జీవితాన్ని సంతోషంగా గడుపుతున్నాడు. అతను తన చదువును కొనసాగిస్తున్నాడు. తన కెరీర్‌ను నిర్మించుకోవడానికి సిద్ధమవుతున్నాడు. మహారాష్ట్రకు చెందిన ఈ యువకుడు అత్యున్నత న్యాయస్థానంలో ఉన్న వ్యక్తి వ్యాఖ్యలతో తన ఇన్‌స్టాగ్రామ్‌లో కాక్రోచ్ జనతా పార్టీ పేరుతో ఒక ప్రొఫైల్‌ను సృష్టించాడు.ఆగ్రహించిన యువకుల బృందం ఒకటి ఈ ప్రొఫైల్‌కు గట్టి మద్దతు తెలిపింది. అతి తక్కువ సమయంలో 22 బిలియన్ల మంది అందులో సభ్యులుగా చేరారు. సోషల్ మీడియా కేంద్రంగా నడిచిన వార్ చివరకు కేంద్ర ప్రభుత్వాన్ని కదిలించేలా చేసింది. నీట్ ప్రశ్నాపత్రం లీకేజీకి బాధ్యత వహిస్తూ రాజీనామా చేయాల్సిన మంత్రి దిగేంత వరకూ ఊరుకోలేదు. దటీజ్ యంగర్ జనరేషన్. మీరు జెన్ జీ ఉద్యమానికే తలలు పట్టుకుంటున్నారు. రానున్న కాలంలో జెన్ ఆల్ఫా వచ్చినా అందులో ఆశ్చర్యం లేదు. పాలకులు ఇప్పటికైనా తెలుసుకోవాలి. అది ఎవరైనా.. కాంగ్రెస్ అయినా.. బీజేపీ అయినా.. మరొక ప్రాంతీయ పార్టీ అయినా.. మాటలతో ఎల్ల కాలం మభ్య పెట్టలేరు. గుర్తుంచుకుని పాలన చేస్తే ఎవరికైనా మంచిదన్న సంకేతాలను ఇచ్చారు.

