Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
Congress : ఏం చేయరనే ధైర్యమా? వదిలి వెళ్లాలనుకుంటున్నారా?

Congress : ఏం చేయరనే ధైర్యమా? వదిలి వెళ్లాలనుకుంటున్నారా?

TeluguPost.com 2 days ago

Telangana : కాంగ్రెస్ ఎమ్మెల్యేలు గాడి తప్పుతున్నారు. క్రమశిక్షణ అనేది కాంగ్రెస్ లో కనిపించడం లేదు. నేరుగా ప్రభుత్వంపైనా, ముఖ్యమంత్రిపైనా ఎమ్మెల్యేలు విమర్శలు చేస్తున్నారు.

విపక్షాల సంగతి ఎలా ఉన్నప్పటికీ స్వపక్షం నుంచి ఇలా కాంగ్రెస్ ప్రభుత్వానికి విమర్శలు రావడంతో హస్తం పార్టీ గుక్కతిప్పుకోలేక పోతుంది. ఒకరకంగా చూడాలంటే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి పార్టీ నుంచి బయటకు వెళ్లేందుకు నిర్ణయించుకున్నారా? అన్న అనుమానం కలుగుతుంది. అందుకే ఆయన ముఖ్యమంత్రి పై తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా తన పార్టీలో కొందరికి పిచ్చి కుక్క కరిచిందని, వారు మంచిని మైకులో, చెడును చెవిలో చెప్పాలని, లేకుంటే పార్టీ కార్యకర్తలే వారిని ఎర్రగడ్డ ప్రభుత్వాసుపత్రికి తరలిస్తారని పరోక్షంగా విమర్శలు చేశారు. ఎన్నికలు దగ్గర పడుతున్న సమయంలో పార్టీకి ఇటువంటి పరిణామాలు ఇబ్బందికరమైనవేనన్నది వాస్తవం.

ప్రభుత్వానికి వ్యతిరేకంగా...మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, జడ్చర్ల ఎమ్మెల్యే జె. అనిరుధ్ రెడ్డిలు ప్రభుత్వానికి వ్యతిరేకంగా విమర్శలు చేస్తున్నారు. దీనిపై పీసీసీ చీఫ్ అఖిల భారత కాంగ్రెస్ కమిటీకి వీడియోలతో సహా ఫిర్యాదు చేశారు. వారిద్దరి వ్యాఖ్యలను పార్టీ అధిష్ఠానం తీవ్రంగా పరిగణిస్తూ, క్రమశిక్షణా కమిటీ ద్వారా పరిశీలిస్తోందని టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ వెల్లడించారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మరియు కాంగ్రెస్ ప్రభుత్వంపై రాజగోపాల్ రెడ్డి చేసిన విమర్శలకు సంబంధించిన వీడియో క్లిప్పింగ్‌లు, ఆడియోలు మరియు పూర్తి నివేదికను టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ ఇప్పటికే ఢిల్లీలోని ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్‌కు పంపారు. వాటిని పరిశీలించి పార్టీ హైకమాండ్ తగిన నిర్ణయం తీసుకుంటుందని చెబుతున్నప్పటికీ ప్రస్తుతమున్న పరిస్థితుల్లో ఎటువంటి చర్యలు తీసుకోకపోవచ్చన్న అభిప్రాయం కూడా కలుగుతుంది. అనిరుధ్ రెడ్డి తన జడ్చర్ల నియోజకవర్గంలో అభివృద్ధి పనుల బిల్లులు మంజూరు చేయడానికి అధికారులు 10 నుండి 20 శాతం కమిషన్లు అడుగుతున్నారని అనిరుధ్ రెడ్డి ఆరోపించారు. బిల్లులు క్లియర్ చేయకపోతే ఆమరణ నిరాహార దీక్ష చేస్తానని హెచ్చరించడం చర్చనీయాంశమైందిమంత్రి పదవి ఇస్తామని...కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డికి మంత్రి పదవి ఇస్తామని ఎన్నికలకు ముందు హామీ ఇచ్చింది. ఇంత వరకూ మంత్రి పదవి ఇవ్వకపోవడంతో ఆయన అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. తనకు మంత్రి పదవి రాకపోవడానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అడ్డు పడుతున్నారని ఆయన గట్టిగా నమ్ముతున్నారు. అనిరుధ్ రెడ్డి కూడా ప్రభుత్వంపై విమర్శలు చేయడాన్ని పార్టీ సీరియస్ గా తీసుకుంది. ఇద్దరు ఎమ్మెల్యేల వ్యాఖ్యలను ఏఐసీసీ క్రమశిక్షణా కమిటీ పరిశీలిస్తోంది. పార్టీలో క్రమశిక్షణ విషయంలో అందరూ సమానమేనని, సరైన సమయంలో అధిష్ఠానం తగిన నిర్ణయం తీసుకుంటుందని చెబుతున్నప్పటికీ ఇద్దరు ఎమ్మెల్యేలపై చర్యలు తీసుకునే నిర్ణయాన్ని ప్రస్తుతానికి కాంగ్రెస్ హైకమాండ్ తీసుకునే అవకాశం లేకపోయినా ఢిల్లీకి పిలిచి మందలించడమో, బుజ్జగించడమో చేసే అవకాశాలున్నాయి. తెలంగాణ కాంగ్రెస్ కొత్త ఇన్‌ఛార్జిగా నియమితులైన బి.ఎం. సందీప్ ఈ అంతర్గత వ్యవహారాలు మరియు క్రమశిక్షణా అంశాలను పరిశీలించిన తర్వాతే ఏఐసీసీ తదుపరి నిర్ణయాలు ఉండే అవకాశం ఉందని తెలుస్తోంది.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Telugu Post Telugu