Telangana : తెలంగాణ రాజకీయాల్లో మాజీ ముఖ్యమంత్రి, బీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్‌ను టార్గెట్ చేయడం వల్ల కాంగ్రెస్‌కు లాభమా లేదా నష్టమా అనేది చర్చనీయాంశమైంది.
నేటికీ కేసీఆర్ పట్ల తెలంగాణను తెచ్చారన్న అభిప్రాయం ఉంది. ఆయన పాలన శైలి నచ్చకపోవచ్చు కానీ, ఆయనంటే తెలంగాణ ప్రజలకు గౌరవం అనేది తరగనిది. కానీ కాంగ్రెస్ ఇటీవల కాలంలో కేసీఆర్ ను లక్ష్యంగా చేసుకుని వ్యవహరించడం రాజకీయం గానష్టమేనన్న అంచనాలు వినపడుతున్నాయి . కాంగ్రెస్ ఎమ్మెల్యే శంకర్ తాము కేసీఆర్ చావును కోరుకుంటున్నామని చెప్పడం, ఎర్రవెల్లి ఫామ్ హౌస్ ముట్టడికి ప్రయత్నించడం వంటివి బీఆర్ఎస్ కు కలసి వచ్చే అంశమని భావిస్తున్నారు.
కాంగ్రెస్‌కు నష్టం జరిగే అవకాశం పై...కేసీఆర్ తెలంగాణ ఉద్యమ నేతగా, రెండు సార్లు ముఖ్యమంత్రిగా పనిచేసిన వ్యక్తి. ఆయనపై వ్యక్తిగత విమర్శలు లేదా తీవ్రమైన దాడులు ప్రజల్లో ఆయన పట్ల సానుభూతి నిపెంచే అవకాశం ఉంది.అధికారంలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం తమ ఆరు గ్యారంటీలు, ప్రజల సమస్యలపై దృష్టి పెట్టకుండా, కేవలం ప్రతిపక్ష నేతను వేధించడానికే ప్రాధాన్యత ఇస్తోందనే అభిప్రాయం సాధారణ ప్రజల్లో బలపడితే అది కాంగ్రెస్‌కు రాజకీయంగా నష్టం కలిగిస్తుంది. కేసీఆర్ శాసనసభకు రాకుంటే, ప్రజాసమస్యలను ప్రస్తావించకుంటే ఆయనకే నష్టం. ఎన్నికల సమయంలో జనం తగిన రీతిలో తీర్పు చెబుతారు. కేసీఆర్ కేవలం అసెంబ్లీ సమావేశాలకు మాత్రేమే కాదు...ప్రజా సమస్యలపై రాష్ట్రంలో పర్యటించలేదు. కానీ కేసీఆర్ సభకు రాలేదంటూ నిరసనలు తెలియజేయడం, ఎమ్మెల్సీ స్పీకర్ ను తిడితే ఫామ్ హౌస్ ముట్టడికి ప్రయత్నించడం కొంత కాంగ్రెస్ కు రాజకీయంగా ఇబ్బందికరంగా మారుతుందన్న విశ్లేషణలు వెలువడుతున్నాయి. బీఆర్‌ఎస్ శ్రేణులు యాక్టివ్ అయ్యేందుకు...కేసీఆర్‌ను టార్గెట్ చేయడం వల్ల నిస్తేజంగా ఉన్న బీఆర్‌ఎస్ కేడర్ ఒక్కసారిగా అప్రమత్తమై, కాంగ్రెస్ సర్కార్‌పై ఎదురుదాడికి దిగే అవకాశం ఉంది.అయితే కాంగ్రెస్‌కు లాభం జరిగే అవకాశాలు కూడా ఉన్నాయంటున్నారు. కాంగ్రెస్ ఎజెండా ప్రకారం బీఆర్‌ఎస్, కేసీఆర్‌లను నిరంతరం టార్గెట్ చేయడం ద్వారా రాష్ట్రంలో ప్రధాన ప్రతిపక్షం బీఆర్‌ఎస్సేనని, బీజేపీకి అక్కడ చోటు లేదనే సంకేతాన్ని ప్రజల్లోకి పంపవచ్చు. దీనివల్ల ప్రతిపక్ష ఓట్లు చీలిపోకుండా చూసుకోవచ్చు కేసీఆర్ హయాంలో జరిగిన లోపాలను (ఉదాహరణకు కాళేశ్వరం ప్రాజెక్టు సమస్యలు, ధరణి లోపాలు) నిరంతరం ప్రస్తావించడం ద్వారా, తాము ఎందుకు అధికారంలోకి రావాల్సి వచ్చిందో ప్రజలకు కాంగ్రెస్ సమర్థించుకోగలుగుతుంది. తమ నాయకత్వం బలంగా ఉందని, కేసీఆర్ వంటి సీనియర్ నేతను సైతం ఢీకొట్టగలదని చూపించడం ద్వారా కాంగ్రెస్ కార్యకర్తలలో ధైర్యాన్ని నింపవచ్చు. ముక్తాయింపు ఇలా...రాజకీయంగా విమర్శలు చేయడం సహజమే అయినప్పటికీ, అది వ్యక్తిగత దూషణలు, శృతిమించిన దాడుల స్థాయికి వెళ్తే మాత్రం కాంగ్రెస్‌కు నష్టం జరిగే అవకాశాలే ఎక్కువగా ఉంటాయని విశ్లేషకులు భావిస్తున్నారు. ప్రజలు ఎప్పుడూ ప్రస్తుత ప్రభుత్వ పనితీరు, ఇచ్చిన హామీల అమలును బట్టే తీర్పు ఇస్తారు కానీ, కేవలం ప్రతిపక్షాన్ని టార్గెట్ చేయడం వల్ల మాత్రమే ఓట్లు పడవు.

