Telangana : తెలంగాణ కాంగ్రెస్ లో విభేదాలు తీవ్ర స్థాయికి చేరుకుంటున్నాయి. ఆధిపత్య పోరు నడుస్తుంది. ఒక సామాజికవర్గం నేతల పెత్తనం నియోజకవర్గంపై చేస్తుండటాన్ని కొందరు షెడ్యూల్ కులాల నేతలు సహించలేకపోతున్నారు.
రెండు రాష్ట్రాల్లో ఇదే పరిస్థితి ఉంది. రిజర్వ్ డ్ నియోజకవర్గాల్లో ఒక సామాజికవర్గం ఆధిపత్యం చేయడానికి ప్రయత్నిస్తుంటుంది. కొన్ని చోట్ల కమ్మ, మరికొన్ని చోట్ల రెడ్లు ఆధిపత్యంలో నియోజకవర్గాలు నడుస్తుంటాయి. తాజాగా తుంతుర్తి నియోజకవర్గం కాంగ్రెస్ కూడా అదే కోవలో చూడాలి. తుంగతుర్తి ఎమ్మెల్యే మందుల సామేల్ కు, కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డికి మధ్య ఆధిపత్య పోరు కూడా ఇదే తరహా అనుకోవాలి. తాను ప్రాతినిధ్యం వహిస్తున్న నియోజకవర్గంపై మీ పెత్తనమేంటని మందుల సామేల్ ప్రశ్నిస్తున్నారు. కోమటిరెడ్డి తానే టిక్కెట్ మందుల సామ్యేల్ కు ఇప్పించానంటున్నారు.
మండల అధ్యక్షుల నియామకంతో...తుంగతుర్తి కాంగ్రెస్‌లో మండల అధ్యక్షుల నియామకం, స్థానిక ఆధిపత్య పోరు కారణంగా ఎమ్మెల్యే మందుల సామేల్ వర్గం వర్సెస్ ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి, కోమటరెడ్డి బ్రదర్స్ మధ్య తీవ్ర అంతర్గత విభేదాలు తారాస్థాయికి చేరాయి. పార్టీ ప్రకారంగా నియమించిన మండల అధ్యక్షుల ఎంపికపై స్థానిక కేడర్‌కు, ఎమ్మెల్యేకు మధ్య అభిప్రాయభేదాలు తలెత్తాయి.ఎమ్మెల్యే మందుల సామేల్ ఏకపక్షంగా నిర్ణయాలు తీసుకుంటున్నారని ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి వర్గీయులు, కోమటిరెడ్డి బ్రదర్స్ ఆరోపిస్తున్నారు.తిరుమలగిరి వంటి ప్రాంతాల్లో ఇరువర్గాల మధ్య ఘర్షణలు రాళ్లు, కర్రలతో కొట్టుకునే వరకు వెళ్లాయి. దీంతో తుంగతుర్తి వివాదాలపై విచారణ జరిపేందుకు పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డిని పార్టీ పరిశీలకుడిగా నియమించింది. ఇరువర్గాలతో మాట్లాడిన జగ్గారెడ్డి సమగ్ర నివేదికను తయారు చేసి రాష్ట్ర నాయకత్వానికి అందజేయనున్నారు. ఇద్దరి మధ్య మాటల యుద్ధం...తుంగతుర్తి ఎమ్మెల్యే మందుల సామేలు మరోసారి హాట్ కామెంట్స్ చేశారు. కోమట్టిరెడ్డి రాజగోపాల్ పార్టీ మారి కాంగ్రెస్‌లోకి వచ్చారంటూ ఫైర్ అయ్యారు. రాజగోపాల్ కంటే తానే కాంగ్రెస్‌లోకి ముందు వచ్చానని మందుల సామేలు చెప్పుకొచ్చారు. మునుగోడులో తన క్యాడర్ కూడా ఉందని, మునుగోడులో రాజగోపాల్‌ను గెలిపించినందుకు తన క్యాడర్ బాధపడుతోందని మందుల సామేలు వ్యాఖ్యానించారు. కాంగ్రెస్ పార్టీలో టికెట్ ఇచ్చేది అధిష్ఠానమని, తనకు రెడ్లు ఓటేసారని, రాజగోపాల్ రెడ్డికి మాదిగలు ఓటేసారన్నారు. రెడ్లు, దళితులతోనే రాజ్యం నడవదని మందుల సామేలు చెప్పారు.కోమటిరెడ్డి రాజ్ గోపాల్ రెడ్డి కూడా మందుల సామేలుపై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. తాను టిక్కెట్ ఇప్పిస్తేనే ఆయన ఎమ్మెల్యే అయ్యాడన్నారు. ఇప్పుడు తుంగతుర్తిలో కాంగ్రెస్ కార్యకర్తలు బాధపడుతున్నారని, వారికి తాను క్షమాపణలు చెబుతున్నారని అన్నారు. అయితే అధిష్టానం మాత్రం తుంగతుర్తి కాంగ్రెస్ వ్యవహారం టీ కప్పులో తుపాను అని చెబుతున్నా ఈ పెత్తనం ఏంటి? అంటూ సోషల్ మీడియాలో ప్రశ్నిస్తున్నారు.

