Hyderabad : సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న '1980ల నాటి AI ఫోటో ట్రెండ్' పై సైబర్ నేరగాళ్లు కన్నేశారు. తమ ఆధునిక సెల్ఫీలను 1980ల కాలం నాటి వింటేజ్ లుక్‌లోకి మార్చుకునేందుకు యూజర్లు ఉత్సాహం చూపిస్తుండటాన్ని ఆసరాగా చేసుకుని, హ్యాకర్లు బయోమెట్రిక్ డేటా దొంగతనం, గుర్తింపు చోరీ కి పాల్పడుతున్నారని నిపుణులు హెచ్చరిస్తున్నారు.
ఈ థర్డ్ పార్టీ AI యాప్‌లు లేదా చాట్‌బాట్‌లలో మీ హై-క్వాలిటీ సెల్ఫీలను అప్‌లోడ్ చేసినప్పుడు, అవి మీ ముఖ కవళికలను స్కాన్ చేస్తాయి. హ్యాకర్లు ఈ డేటాను సేకరించి డీప్‌ఫేక్స్ సృష్టించడానికి లేదా మీ బయోమెట్రిక్ ఐడెంటిటీని దొంగిలించడానికి వాడవచ్చు.
నకిలీ గుర్తింపు కార్డుల సృష్టించి...
దొంగిలించిన మీ ఫేషియల్ డేటా మరియు రెటీనా స్కాన్ల సాయంతో సైబర్ నేరగాళ్లు నకిలీ ఆధార్ కార్డ్, పాన్ కార్డ్, లేదా ఫేక్ పాస్‌పోర్టులను సృష్టించే ప్రమాదం ఉంది. ఈ డేటాను ఉపయోగించి హ్యాకర్లు మీకు తెలియకుండానే బ్యాంకులు లేదా ఇతర ఆర్థిక సంస్థల్లో డిజిటల్ కేవైసీ ప్రక్రియలను పూర్తి చేసి మోసాలకు పాల్పడే అవకాశం ఉంది. అందుకే ఈ సైబర్ నేరగాళ్ల బారిన పడకుండా తగిన జాగ్రత్తలు వహించాలని పోలీసులు హెచ్చరికలు జారీ చేస్తున్నారు. 1980s ట్రెండ్ ఇప్పుడు వైరల్ గా మారడంతో ఎక్కువ మంది తమ ఫొటోలను ఉపయోగించుకుని చేస్తుండటాన్ని సైబర్ నేరగాళ్లు తమకు అనుకూలంగా మార్చుకుని డేటా చౌర్యానికి పాల్పడుతున్నారని హెచ్చరించింది.

