తూర్పు కాంగోలో అరుదైన రకం ఈబోలా వైరస్ వేగంగా వ్యాపిస్తుండడంతో అక్కడి వైద్య సిబ్బంది తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. తమకు సరైన రక్షణ సామగ్రి లేదని, అనుమానిత రోగులను చూసే శిక్షణ కూడా తక్కువగా ఉందని ఆరోగ్య కార్యకర్తలు చెబుతున్నారు.
ఇప్పటికే సాయుధ మిలిటెంట్ గుంపుల దాడులతో ఉద్రిక్తంగా ఉన్న ఈ ప్రాంతంలో ఈబోలా వ్యాప్తి పరిస్థితిని మరింత క్లిష్టంగా మార్చింది. ఇటురి ప్రావిన్స్‌లోని అలిమా గ్రామంపై ఇస్లామిక్ స్టేట్‌కు అనుబంధంగా ఉన్న మిలిటెంట్లు మంగళవారం రాత్రి దాడి చేసి కనీసం 17 మందిని చంపినట్లు స్థానిక నాయకులు తెలిపారు.
వ్యాప్తికి కేంద్రంగా...ఇదే ప్రాంతం ప్రస్తుతం ఈబోలా వ్యాప్తికి కేంద్రంగా మారింది. ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రకారం ఈ వ్యాధి ప్రపంచవ్యాప్తంగా పెద్ద ప్రమాదం కాదని భావిస్తున్నప్పటికీ, "మొదటి రోగి" ఎవరన్నది ఇంకా గుర్తించలేకపోయారు. "ముందే భద్రతా సమస్యలతో ఇబ్బందులు పడుతున్నాం. ఇప్పుడు ఈబోలా కూడా రావడం బాధాకరం" అని బునియా ప్రాంతానికి చెందిన జస్టిన్ న్డాసి చెప్పారు. బునియాకు భారీగా వైద్య సామగ్రిని తరలించినా, మాస్కులు అందుబాటులో లేకపోవడం ప్రజల్లో ఆందోళన పెంచుతోంది. గతంలో 2,500 కాంగోలీస్ ఫ్రాంకులు ఉన్న శానిటైజర్ల ధర ఇప్పుడు నాలుగు రెట్లు పెరిగిందని స్థానికులు చెబుతున్నారు."రక్తస్రావం.. వాంతులతో...ర్వాంపారా చికిత్స కేంద్రంలో ఈబోలా అనుమానిత మృతదేహాలను రక్షణ దుస్తులు ధరించిన సిబ్బంది శుభ్రపరచి ప్రత్యేక సమాధి ప్రాంతాలకు తరలిస్తున్నారు. కుటుంబ సభ్యులు కన్నీటి పర్యంతమవుతున్నారు. వ్యాధి మొదట మలేరియా లాంటి లక్షణాలతో కనిపించిందని, తర్వాత ఒక్కసారిగా పరిస్థితి విషమించిందని బాధిత కుటుంబాలు తెలిపాయి. "గుండె నొప్పిగా ఉందని చెప్పాడు. తర్వాత నొప్పితో ఏడవడం మొదలుపెట్టాడు. ఆ తర్వాత తీవ్ర రక్తస్రావం, వాంతులు వచ్చాయి" అని తన కుమారుడిని కోల్పోయిన బోట్విన్ స్వాంజే తెలిపారు. ఈబోలా వైరస్ అత్యంత అంటువ్యాధి. వాంతులు, రక్తం, వీర్యం వంటి శరీర ద్రవాల ద్వారా ఇది వ్యాపిస్తుంది. జ్వరం, వాంతులు, విరేచనాలు, కండరాల నొప్పులు, అంతర్గత-బాహ్య రక్తస్రావం ప్రధాన లక్షణాలు. ఊహించిన దానికంటే ఎక్కువ...ఈ వ్యాప్తిని అంతర్జాతీయ ప్రజారోగ్య అత్యవసర పరిస్థితిగా ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రకటించింది. వైరస్ వ్యాప్తి వేగం, స్థాయి ఆందోళన కలిగిస్తున్నాయని తెలిపింది. కాంగోలోని ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రతినిధులు ఈ పరిస్థితి కనీసం రెండు నెలలు కొనసాగవచ్చని అంచనా వేస్తున్నారు. 'బుండిబుగ్యో వైరస్'గా పిలిచే ఈ అరుదైన ఈబోలా రకం మొదటి మరణం తర్వాత కూడా కొన్ని వారాలు గుర్తించకుండా వ్యాపించిందని అధికారులు తెలిపారు. మొదట సాధారణ ఈబోలా రకంగా పరీక్షలు చేయగా ఫలితాలు నెగెటివ్‌గా వచ్చాయి. "ప్రస్తుత పరిస్థితిని చూస్తే వైరస్ రెండు నెలల కిందటే వ్యాపించడం ప్రారంభమై ఉండొచ్చు" అని WHO అత్యవసర విభాగానికి చెందిన అనైస్ లెగాండ్ చెప్పారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ డైరెక్టర్ జనరల్ టెడ్రోస్ అధానోమ్ ఘెబ్రేయేసస్ తెలిపిన వివరాల ప్రకారం ఇప్పటివరకు ఇటురి, నార్త్ కివు ప్రావిన్స్‌లలో 51 కేసులు నిర్ధారణ అయ్యాయి. ఉగాండాలో మరో రెండు కేసులు బయటపడ్డాయి. 139 అనుమానిత మరణాలు, దాదాపు 600 అనుమానిత కేసులు నమోదయ్యాయి.అయితే వాస్తవ సంఖ్య ఇంకా ఎక్కువగా ఉండొచ్చని లండన్‌కు చెందిన ఎంఆర్‌సీ సెంటర్ ఫర్ గ్లోబల్ ఇన్‌ఫెక్షియస్ డిసీజ్ అనాలిసిస్ అంచనా వేసింది. కేసుల సంఖ్య ఇప్పటికే వెయ్యి దాటివుండొచ్చని తెలిపింది. ఇది కాంగోలో నమోదైన 17వ ఈబోలా వ్యాప్తి. గత అనుభవం ఉన్నప్పటికీ, ఈసారి వైరస్ రకం భిన్నంగా ఉండటం అధికారులకు సవాల్‌గా మారింది.టీకా రావడానికి ఇంకా నెలలు...బుండిబుగ్యో వైరస్‌కు సరిపోయే టీకా అందుబాటులోకి రావడానికి కనీసం ఆరు నుంచి తొమ్మిది నెలలు పడుతుందని WHO ప్రత్యేక సలహాదారు డాక్టర్ వసీ మూర్తి చెప్పారు. తూర్పు కాంగో ఇప్పటికే యుద్ధ పరిస్థితులు, నిరాశ్రయ సమస్యలు, కుప్పకూలుతున్న ఆరోగ్య వ్యవస్థతో తీవ్ర ఒత్తిడిలో ఉందని ఇంటర్నేషనల్ రెస్క్యూ కమిటీ ఆరోగ్య సమన్వయకర్త డాక్టర్ లీవిన్ బంగాలి తెలిపారు. నిధుల కొరత కూడా పరిస్థితిని మరింత దెబ్బతీసిందన్నారు. అమెరికా విదేశాంగ మంత్రి మార్కో రూబియో మాట్లాడుతూ ప్రభావిత ప్రాంతాల్లో 50 అత్యవసర వైద్య కేంద్రాలకు నిధులు కేటాయిస్తున్నామని చెప్పారు. అమెరికా 23 మిలియన్ డాలర్ల సహాయం ప్రకటించింది.ఆస్పత్రుల్లో స్థలం లేక ఇబ్బందులు...బునియాలో పాఠశాలలు, ప్రార్థనా మందిరాలు సాధారణంగానే కొనసాగుతున్నా కొందరు మాత్రమే మాస్కులు ధరిస్తున్నారు. ఇటురిలోని బాంబు జనరల్ ఆస్పత్రిలో ఈబోలా అనుమానితులను ఇతర రోగులతో కలిపి ఉంచుతున్నట్లు సమాచారం. డాక్టర్స్ వితౌట్ బోర్డర్స్ బృందం బునియాలో అనుమానిత కేసులను గుర్తించినప్పటికీ, ఐసోలేషన్ వార్డులు అందుబాటులో లేవని అత్యవసర కార్యక్రమాల మేనేజర్ ట్రిష్ న్యూపోర్ట్ చెప్పారు. "మేము సంప్రదించిన ప్రతి ఆస్పత్రి 'మా దగ్గర ఇప్పటికే అనుమానిత కేసులు ఉన్నాయి. స్థలం లేదు' అని చెప్పింది. పరిస్థితి ఎంత తీవ్రంగా ఉందో ఇదే చెబుతోంది" అని ఆమె సోషల్ మీడియాలో పేర్కొన్నారు. మొదటి మరణం నమోదైన మోంగ్‌బ్వాలూ ప్రాంతంలో ఉగాండా సరిహద్దు ఇంకా తెరిచే ఉంది. బంగారు గనుల పనులు కూడా కొనసాగుతున్నాయి. ప్రజలు సాధారణ జీవితమే గడుపుతున్నప్పటికీ వ్యాధి గురించి పరస్పరం హెచ్చరించుకుంటున్నారని స్థానిక నాయకుడు చెరుబిన్ కుకు న్డిలావా తెలిపారు. చేతులు కడుక్కునే కేంద్రాలు కూడా తక్కువగా ఉన్నాయని చెప్పారు. మోంగ్‌బ్వాలూ జనరల్ ఆస్పత్రిలో దాదాపు 30 మంది ఈబోలా రోగులు ఉన్నట్లు వైద్యులు తెలిపారు. స్థానిక మెడికల్ టెక్నాలజీ విద్యార్థి ఒకరు బుధవారం మరణించారు."రోగులను ఎక్కడికక్కడ ఉంచుతున్నారు. వెంటనే ప్రత్యేక ఐసోలేషన్ కేంద్రాలు ఏర్పాటు చేయకపోతే పరిస్థితి అదుపు తప్పుతుంది" అని ఆస్పత్రి వైద్య డైరెక్టర్ డాక్టర్ రిచర్డ్ లోకుడు హెచ్చరించారు. వైద్య సిబ్బంది తక్కువగా ఉన్నారని, సరైన శిక్షణ కూడా లేదని ఆయన తెలిపారు. "కేసులు పెరిగితే మాకు రక్షణే లేదు" అని ఆందోళన వ్యక్తం చేశారు.జర్మనీలో ఐసోలేషన్‌లో అమెరికన్...కాంగోలో ఈబోలా పాజిటివ్‌గా తేలిన అమెరికా పౌరుడిని బుధవారం జర్మనీలోని బెర్లిన్‌కు తరలించారు. ప్రత్యేక ఐసోలేషన్ వార్డులో చికిత్స అందిస్తున్నట్లు జర్మనీ ఆరోగ్య శాఖ ప్రతినిధి మార్టిన్ ఎల్సాసర్ తెలిపారు.రోగి పరిస్థితిపై అధికారులు వివరాలు వెల్లడించలేదు. అమెరికా అధికారుల అభ్యర్థన మేరకు అతని భార్య, ముగ్గురు పిల్లలను కూడా జర్మనీకి తరలించనున్నట్లు సమాచారం.ఉగాండాలో ఈబోలా రోగులకు చికిత్స అందించిన మరో అమెరికన్ వైద్యుడిని చెక్ రిపబ్లిక్‌కు తరలిస్తున్నట్లు అక్కడి ఆరోగ్య అధికారులు తెలిపారు. ఆయనకు ప్రస్తుతం ఎలాంటి లక్షణాలు లేవని చెప్పారు.అమెరికా సీడీసీ ఈబోలా స్పందన విభాగం అధికారి డాక్టర్ సతీష్ పిళ్లై మాట్లాడుతూ, బాధితులను అమెరికా విదేశాంగ శాఖ సమన్వయంతో యూరప్‌కు తరలిస్తున్నట్లు వెల్లడించారు.

