Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
Europe wildfire : దక్షిణ ఐరోపాను చుట్టుముట్టిన కార్చిచ్చు

Europe wildfire : దక్షిణ ఐరోపాను చుట్టుముట్టిన కార్చిచ్చు

TeluguPost.com 3 months ago

Europe wildfire : దక్షిణ ఐరోపాలో కార్చిచ్చు తీవ్రరూపం దాల్చింది. పోర్చుగల్, గ్రీస్, స్పెయిన్‌లో వందలాది మంది అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపు చేసేందుకు శ్రమిస్తున్నారు.

పోర్చుగల్‌లో మూడు రోజులకుపైగా కొనసాగుతున్న భారీ కార్చిచ్చును అదుపు చేయడానికి స్పెయిన్, ఇటలీ అదనపు బలగాలు, విమానాలను పంపాయి.గ్రీస్‌లోని రెండో అతిపెద్ద నగరం థెస్సలోనికి పరిసరాల్లో కార్చిచ్చుతో రీసైక్లింగ్ ప్లాంట్ మంటల్లో చిక్కుకుంది. అక్కడి నుంచి వెలువడుతున్న విషపూరిత పొగ వల్ల ప్రజలు ఇళ్లలోనే ఉండాలని, కిటికీలు, తలుపులు మూసివేయాలని అధికారులు సూచించారు.ఆదివారం మధ్యాహ్నం గ్రీస్ రాజధాని ఏథెన్స్‌కు పశ్చిమాన మరో భారీ కార్చిచ్చు చెలరేగింది. మంద్రా ప్రాంతంలోని పైన్ అడవుల్లో మంటలు వ్యాపించడంతో 210 మంది అగ్నిమాపక సిబ్బంది, ప్రత్యేక బృందాలు, వాలంటీర్లు, 29 విమానాలు, హెలికాప్టర్లను రంగంలోకి దించారు. రాత్రి పడకముందే మంటలను అదుపులోకి తేవాలని అధికారులు ప్రయత్నిస్తున్నారు. చీకటి పడిన తర్వాత విమానాలతో అగ్నిమాపక చర్యలు కొనసాగించడం సాధ్యం కాదు.

పోర్చుగల్‌లో 12 వేల హెక్టార్లు దగ్ధం...

పోర్చుగల్‌లోని వౌజెలా ప్రాంతంలో గురువారం మొదలైన కార్చిచ్చును అదుపు చేసేందుకు 1,200 మందికిపైగా అగ్నిమాపక సిబ్బంది, దాదాపు 400 వాహనాలు, 15 విమానాలు పనిచేస్తున్నాయని పౌర రక్షణ సంస్థ తెలిపింది. ఆదివారం నాటికి సుమారు 12 వేల హెక్టార్ల విస్తీర్ణం అగ్నికి ఆహుతైనట్లు యూరోపియన్ యూనియన్‌కు చెందిన కోపెర్నికస్ ఉపగ్రహ మ్యాపింగ్ సంస్థ వెల్లడించింది. పోర్చుగల్‌కు సహాయంగా స్పెయిన్ శుక్రవారం 120 మంది అగ్నిమాపక సిబ్బందిని, 45 వాహనాలను పంపింది. ఇటలీ, స్పెయిన్ నుంచి మూడు అగ్నిమాపక విమానాలను కూడా పంపినట్లు యూరోపియన్ యూనియన్ పౌర రక్షణ, మానవతా సహాయ విభాగం తెలిపింది. ఆదివారం మధ్యాహ్నానికి మంటల తీవ్రత కొంత తగ్గిందని, పెద్ద ఎత్తున వ్యాపిస్తున్న ప్రాంతాలు అదుపులోకి వచ్చినప్పటికీ కొన్ని చోట్ల ఇంకా మంటలు కొనసాగుతున్నాయని పోర్చుగల్ అధికారులు వెల్లడించినట్లు స్థానిక మీడియా తెలిపింది. స్పెయిన్ ఈశాన్యంలోని గిరోనా ప్రాంతంలో శుక్రవారం మొదలైన కార్చిచ్చు ఇప్పటికే దాదాపు 2,200 హెక్టార్లకు విస్తరించినట్లు ఈఎఫ్‌ఈ వార్తా సంస్థ తెలిపింది. మంటల పరిధి 40 కిలోమీటర్ల మేర ఉందని, ఆదివారం పూర్తిగా అదుపులోకి తేవడం కష్టమవుతుందని కాటలోనియా అగ్నిమాపక విభాగం ఆపరేషన్ల అధిపతి ఎడ్వర్డ్ మార్టినెజ్ చెప్పారు.

థెస్సలోనికిలో విషపూరిత పొగ...

థెస్సలోనికి సమీపంలోని ఒరైయోకాస్ట్రో శివారులో రీసైక్లింగ్ ప్లాంట్‌లో శనివారం సాయంత్రం వేగంగా మంటలు చెలరేగాయి. దీంతో మూడు శివారు ప్రాంతాలతో పాటు 157 మంది దివ్యాంగులు ఉన్న కేంద్రాన్ని ఖాళీ చేయాలని హెచ్చరికలు జారీ చేశారు. బలమైన గాలులతో మంటలు మరింత వ్యాపించాయి. తెల్లవారుజామున విమానాలు రంగంలోకి దిగే వరకు రాత్రంతా సుమారు 160 మంది అగ్నిమాపక సిబ్బంది మంటలతో పోరాడినట్లు అగ్నిమాపక శాఖ తెలిపింది. కొన్ని వ్యాపార సంస్థలు, ఇళ్లు దెబ్బతిన్నాయని, పూర్తి స్థాయి అంచనా తర్వాత నష్టం వివరాలు తెలుస్తాయని ఒరైయోకాస్ట్రో మేయర్ పాండెలిస్ త్సాకిరిస్ ప్రభుత్వ ప్రసార సంస్థ ఈఆర్‌టికి తెలిపారు. రోడ్డుపై వెళ్తున్న సమయంలో తన వాహనం నుంచి వచ్చిన చిమ్మురవ్వలతో సమీపంలోని పొదలకు మంటలు అంటుకున్నాయని, నిర్లక్ష్యంగా వ్యవహరించినట్లు ఆరోపణలపై 76 ఏళ్ల వ్యక్తిని పోలీసులు అరెస్టు చేశారు. ఆయనను ఆదివారం ప్రాసిక్యూటర్ ఎదుట హాజరుపరచనున్నారు. కొద్ది రోజుల క్రితమే ఇదే ప్రాంతానికి సమీపంలో జరిగిన మరో కార్చిచ్చులో 12 ఏళ్ల బాలుడు, అతని తండ్రి ప్రాణాలు కోల్పోయారు.

నిర్లక్ష్యమే ప్రధాన కారణం...

గ్రీస్‌లో దాదాపు 85 శాతం కార్చిచ్చులు నిర్లక్ష్యం వల్లే సంభవిస్తున్నాయని అగ్నిమాపక శాఖ ప్రతినిధి బ్రిగేడియర్ ఐయోన్నిస్ ఆర్టోపోయోస్ తెలిపారు. వ్యవసాయ యంత్రాల నుంచి వచ్చే చిమ్మురవ్వలు, ఎక్కడపడితే అక్కడ పడేసే సిగరెట్ ముక్కలు, బహిరంగ ప్రదేశాల్లో బార్బెక్యూ నిర్వహించడం వంటి కారణాలతో మంటలు చెలరేగుతున్నాయని చెప్పారు. వీటిలో చాలా వరకు నివారించవచ్చని ఆయన పేర్కొన్నారు. వేసవిలో అధిక ఉష్ణోగ్రతలు, పొడి వాతావరణం కారణంగా గ్రీస్‌లో తరచూ భారీ కార్చిచ్చులు సంభవిస్తుంటాయి. 2018లో ఏథెన్స్ తూర్పు ప్రాంతంలో సంభవించిన కార్చిచ్చులో వంద మందికిపైగా మరణించారు. 2023లో ఈశాన్య గ్రీస్‌లోని ప్రకృతి సంరక్షణ ప్రాంతంలో సంభవించిన కార్చిచ్చు యూరోపియన్ యూనియన్ చరిత్రలోనే అతిపెద్దదిగా నమోదైంది. వాతావరణ మార్పుల ప్రభావంతో పెరుగుతున్న కార్చిచ్చులను ఎదుర్కొనేందుకు గ్రీస్ సాంకేతికతను వినియోగిస్తోంది. మే నెలలో భూమికి సమీప కక్ష్యలో ప్రవేశపెట్టిన నాలుగు ఉపగ్రహాలను అగ్నిప్రమాదాల పర్యవేక్షణకు అనుసంధానిస్తోంది. ఈ వేసవిలో పశ్చిమ ఐరోపాను వణికించిన తీవ్ర ఉష్ణగాలుల నుంచి గ్రీస్ కొంతవరకు బయటపడినా, దేశవ్యాప్తంగా ప్రధాన భూభాగంతో పాటు దీవుల్లోనూ ఇప్పటికే డజన్ల కొద్దీ కార్చిచ్చులు నమోదయ్యాయి.


Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Telugu Post Telugu