అనేక రాష్ట్రాల్లో ఉచిత పథకాలపై నేడు చర్చ జరుగుతుంది. మోదీ పొదుపు చర్యల్లో భాగంగా కాన్వాయ్ లో వాహనాల సంఖ్యను తగ్గించుకోవడం, భద్రత సిబ్బందిని కుదించడం, విదేశీ ప్రయాణలు మానుకోవడం, బంగారం కొనుగోలు పై ఆంక్షలు విధించడం పరిష్కారం కాదని ఆర్థిక నిపుణులు అంటున్నారు.
ప్రస్తుతమున్న పరిస్థితుల్లో ఉచిత పథకాలను ఎత్తివేయాలని అనేక మంది సూచిస్తున్నారు. నిరుపేదలకు అవసరమైన పథకాలను ఉంచి ఎన్నికల్లో గెలవడం కోసం ఇచ్చిన ఫ్రీ లను మాత్రం కొంత కాలం పక్కన పెడితే చాలా వరకూ అనేక రాష్ట్రాలు ఆర్థిక ఇబ్బందుల నుంచి బయటపడతాయన్న సూచనలు చేస్తున్నారు.
ఉచిత బస్సు పథకం...మహిళలకు ఉచిత బస్సు పథకం... కర్ణాటక, ఢిల్లీ, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ లో అమలవుతుంది. తాజాగా తమిళనాడు, కేరళలోనూ అక్కడ ఎన్నికైన ప్రభుత్వాలు అమలు చేయడానికి సిద్ధమయ్యాయి. అయితే దీనివల్ల ఆర్థిక భారం పడుతుందని చెబుతున్నారు. అలాగే సంక్షేమ పథకాలు ఇవ్వడంలో తప్పు లేదని, శృతి మించి ఇచ్చితేనే ఆర్థిక భారం పడి రాష్ట్రాలు అప్పుల ఊబిలో కూరుకుపోతాయన్న విశ్లేషణలు వెలువడుతున్నాయి. ఎన్ని పొదుపు చర్యలు పాటిస్తే మాత్రం ఈ రకమైన ఆర్థిక వెసులు బాటు లభిస్తుందంటున్నారు. తెలుపు రంగు రేషన్ కార్డుదారులకే సంక్షేమ పథకాలను ఇస్తామని చెబుతున్నప్పటికీ రెండు తెలుగు రాష్ట్రాల్లో మాత్రం అనర్హులకు కూడా అందుతుండటంతో కోట్లాది రూపాయల భారం ఖజానాపై పడుతుందని అంటున్నారు. ఉచిత పథకాల అమలుపై...కుటుంబానికి గ్యాస్ సిలిండర్ ఉచిత పథకం కూడా మంచిది కాదని కొందరు సూచిస్తున్నారు. రానున్న కాలంలో ఈ పథకాలను ఎత్తివేయక తప్పదని, పరిస్థితి చేయి దాటక ముందే చర్యలు తీసుకుంటే ఆర్థిక ఉపశమనం కలుగుతుందని కొందరు సూచిస్తున్నారు. అలాగే రెండు వందల యూనిట్ల వరకూ ఉచిత విద్యుత్తు వంటిది కూడా సరికాదన్న అభిప్రాయం వ్యక్తమవుతుంది. విద్య, వైద్యం వరకూ సంక్షేమ పథకాలను అమలు చేయవచ్చని, కానీ ఇతర ఓటు బ్యాంకు కోసం పెట్టిన పథకాలను తొలగించడమే మంచిదన్న సూచనలు ఆర్థిక నిపుణులు చేస్తున్నారు. ప్రజలపై పెట్రోలు, గ్యాస్ ధరల భారం మోపితే అది మరింత ఆర్థిక ఇబ్బందులకు దారి తీస్తాయని, నిత్యావసర వస్తువులు, కూరగాయల ధరలు పెరిగి ప్రజల ఆర్థిక స్థితి మరింత దిగజారిపోవడమే కాకుండా కొనుగోలు శక్తి తగ్గి ఆర్థిక భారం మరింత పెరుగుతుందని అంచనాలు వినపడు తున్నాయి. అయితే రాజకీయ పార్టీలు ఉచిత పథకాల విషయంలో ఆలోచించవని, దేశ శ్రేయస్సు కోసం నిర్ణయాలు తీసుకోవాలని సూచిస్తున్నారు.

