ప్రధాని నరేంద్ర మోదీని లక్ష్యంగా చేసుకుని సోషల్ మీడియా వేదికలపై అభ్యంతరకర, మార్ఫింగ్ చేసిన వీడియోలు, చిత్రాల ప్రచారానికి సంబంధించి హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు కేసులు నమోదు చేశారు.
మెటా ఇండియా అధిపతి అరుణ్ శ్రీనివాస్‌తో పాటు పలు ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలపై ఈ కేసులు నమోదయ్యాయి. నీట్ పేపర్ లీకేజీని నిరసిస్తూ కాక్రోచ్ జనతా పార్టీ ధర్నా చేసిన సమయంలో ప్రధాని మోదీని టార్గెట్ చేస్తూ ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌లో మార్ఫింగ్ వీడియోలను పోస్టు చేశారు. ఆ ఎఫ్‌బీ, ఇన్‌స్టా అకౌంట్లపై సైబర్‌క్రైం పోలీసులు కేసు నమోదు చేశారు. జూలై 29వ తేదీన టీ సాయికిరణ్ గౌడ్ అనే వ్యక్తి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఇన్‌స్టాగ్రామ్‌లో బ్రౌజ్ చేస్తుండగా ప్రధాని మోదీ సంబంధిత కొన్ని మార్ఫింగ్ చేసిన, డిజిటల్‌గా మార్పులు చేసిన వీడియోలు, చిత్రాలు కనిపించాయని ఇద్దరు వ్యక్తులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. వీటిలో అసభ్యకరమైన, అవమానకరమైన వ్యాఖ్యలు ఉండటం సహా ప్రజలను తప్పుదోవ పట్టించేలా కంటెంట్‌ను రూపొందించి ప్రచారం చేశారని ఫిర్యాదులో ఆరోపించారు.
ఇంతలో ప్రధాని నరేంద్ర మోదీ, జేపీ నడ్డాకు సంబంధించిన ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతూ ఉంది. ఒకే కారులో వచ్చినప్పటికీ జేపీ నడ్డా మీడియాను చూడగానే కావాలనే పుష్ప గుచ్చాన్ని అందించారంటూ కొన్ని పోస్టులు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
"PR పిచ్చి నెక్స్ట్ లెవెల్ మోడీ గారు, నద్దా గారు ఒకే కారులో వచ్చారు.. కారు దిగే సమయానికి ముందర విలేఖరులు కనబడ్డారు..
ఇక అంతే నగారు & పూల గుత్తి తీసుకుని అటునుంచి ఇటు తిరిగి వచ్చి పూల గుత్తి ఇచ్చి సాధరంగా ఆహ్వానం పలికారు... చూసిన వాళ్ళు ఒకే కారులో వచ్చిన వారు ఒకరికి మరొకరు ఆహ్వానం పాలకడమెంటీ అని నాలా ముక్కున వేలేసుకున్నారు." అంటూ పోస్టులు పెట్టారు.
వైరల్ పోస్టులకు సంబంధించిన ఆర్కైవ్ లింక్ ను ఇక్కడ, ఇక్కడ చూడొచ్చు
వైరల్ పోస్టులకు సంబంధించిన స్క్రీన్ షాట్ ఇక్కడ ఉంది

ఫ్యాక్ట్ చెకింగ్:
వైరల్ అవుతున్న వాదనలో ఎలాంటి నిజం లేదు. జేపీ నడ్డా ప్రధాని నరేంద్ర మోదీ కంటే ముందే వేరే వాహనంలో వచ్చారు.
వైరల్ అవుతున్న వీడియోను జాగ్రత్తగా విశ్లేషించగా, వాహనం విండో లోంచి ప్రధానమంత్రి పక్కన కూర్చున్న వ్యక్తి అస్పష్టంగా కనిపించినప్పటికీ, అతని శరీరాకృతి జేపీ నడ్డాకు భిన్నంగా ఉంది. దీంతో వైరల్ అవుతున్న వాదనపై అనుమానాలు తలెత్తాయి.
వైరల్ అయిన ఆ క్లిప్‌ను రివర్స్ ఇమేజ్ సెర్చ్ చేయగా, జూలై 27, 2024 నాటి ఏఎన్ఐ హిందీ అప్లోడ్ చేసిన వీడియో పోస్ట్ లభించింది. అందులో అవే దృశ్యాలు ఉన్నాయి. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ న్యూఢిల్లీలోని బీజేపీ ప్రధాన కార్యాలయానికి వచ్చారని ఆ క్యాప్షన్‌లో తెలిపారు.
2024 జూలై 27న న్యూఢిల్లీలోని బీజేపీ ప్రధాన కార్యాలయంలో ప్రధాని నరేంద్ర మోదీ అధ్యక్షతన జరిగిన సమావేశానికి బీజేపీ అగ్రనేతలు, ఆ పార్టీకి చెందిన ముఖ్యమంత్రులు, ఉప ముఖ్యమంత్రులు హాజరయ్యారు. అందుకు సంబంధించిన కథనాలు ఇక్కడ, ఇక్కడ చూడొచ్చు.
ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ నేతృత్వంలో బీజేపీ ప్రధాన కార్యాలయంలో ఒక కీలక సమావేశం నిర్వహించారు. ఇందులో పార్టీ అధ్యక్షుడు జేపీ నడ్డా, కేంద్ర హోం మంత్రి అమిత్ షా, అలాగే బీజేపీ పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రులు, ఉప ముఖ్యమంత్రులు పాల్గొన్నారు. నీతి ఆయోగ్ 9వ పాలక మండలి సమావేశం కోసం బీజేపీ పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రులు ఢిల్లీకి వచ్చిన తరుణంలో ఈ సమావేశం జరుగుతోంది. తమ రాష్ట్రాల్లోని ఎన్నికల ఫలితాలపై చర్చించడం, భవిష్యత్తు వ్యూహాలను రూపొందించడం ఈ సమావేశం ప్రధాన అజెండాలో ఉన్నాయి. 2024 లోక్‌సభ ఎన్నికల ఫలితాల విశ్లేషణ ద్వారా మెరుగుపరచాల్సిన అంశాలను గుర్తించడం, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ పథకాలను క్షేత్రస్థాయిలో సమర్థవంతంగా అమలు చేయడం, అలాగే రాబోయే అసెంబ్లీ ఎన్నికలకు వ్యూహరచన చేయడం వంటివి ఈ సమావేశ అజెండాలో భాగంగా ఉన్నాయి.
ఆ తర్వాత మేము అదే కార్యక్రమానికి జేపీ నడ్డా హాజరైన దృశ్యాల కోసం వెతికాము. దీని ఫలితంగా, నడ్డా వేరొక వాహనంలో బీజేపీ ప్రధాన కార్యాలయానికి విడిగా చేరుకోవడం, అక్కడ ఆయనకు పార్టీ సభ్యులు స్వాగతం పలికిన ఒక ఏఎన్ఐ హిందీ పోస్ట్ మాకు లభించింది.
జేపీ నడ్డా రాకను తెలిపే ANI హిందీ పోస్ట్ జూలై 27, 2024న సాయంత్రం 4:43 గంటలకు ప్రచురితమైంది, కాగా ప్రధాని నరేంద్ర మోదీ రాకను తెలిపే పోస్ట్ అదే రోజు సాయంత్రం 6:04 గంటలకు అప్‌లోడ్ చేయబడింది. దీనిని బట్టి, ప్రధానమంత్రి అక్కడికి చేరుకునే ముందే జేపీ నడ్డా అక్కడికి చేరుకున్నారని స్పష్టమవుతోంది. వారు ఇద్దరూ కలిసి ప్రయాణించారన్న వాదన తప్పని తేలుతోంది.

ప్రధాని నరేంద్ర మోదీ బీజేపీ ప్రధాన కార్యాలయం నుండి బయటకు వస్తున్న మరో వీడియో మాకు లభించింది. ఆ దృశ్యాలలో, ప్రధానమంత్రి బయటకు వస్తున్నప్పుడు జేపీ నడ్డా ఆయన పక్కనే నడుస్తూ కనిపించారు.
అదే వీడియోలో, ఇంతకుముందు పొరపాటుగా జేపీ నడ్డా అని భావించిన వ్యక్తి, ప్రధానమంత్రి వాహనంలో ఎక్కి ఆయన పక్కనే ఉన్న సీటులో కూర్చోవడం కూడా కనిపిస్తుంది. అదే సమయంలో, ప్రధానమంత్రి అక్కడి నుండి బయలుదేరి వెళ్తుండగా జేపీ నడ్డా బయటే ఉండిపోయారు.

ప్రధాన మంత్రి మోదీతో ప్రయాణించిన వ్యక్తి జేపీ నడ్డా కాదని, ఆ ఇద్దరు నాయకులు ఒకే వాహనంలో కలిసి రాలేదని ఈ దృశ్యపరమైన పోలికలు స్పష్టంగా రుజువు చేస్తున్నాయి.
కాబట్టి, వైరల్ అవుతున్న వాదనలో ఎలాంటి నిజం లేదు.

