Hyderabad : పసిడి ధరలు పతనమవుతున్నాయి. వెండి ధరలు దిగి వస్తున్నాయి. అయితే ఈ పరిస్థితి ఎంతకాలం ఉంటుందో తెలియదు. ఎందుకంటే అది బంగారం. బంగారం, వెండి ధరలు వచ్చే నెల నుంచి పెరుగుతాయని కొందరు అంచనా వేస్తున్నారు.
లేదు.. లేదు.. పది గ్రాముల బంగారం ధర లక్షకు దిగువకు చేరుతుందని మరికొందరు అభిప్రాయపడుతున్నారు. ఇంతకంటే ధరలు భారీగా పతనమయ్యే అవకాశాలు మాత్రం లేవని మార్కెట్ నిపుణులు ఖచ్చితంగా చెబుతున్నారు. అందుకే కొనుగోలు చేయదలచుకున్న వారు, అవసరమైన వారు, వివాహాలకు సంబంధించి బంగారం, వెండి కొనుగోలు చేయాల్సిన వారు ఇప్పుడే కొనుగోలు చేయడం మంచిదని బిజినెస్ నిపుణులు చెబుతున్నారు. ఆలస్యం అమృతం విషం అన్న సామెతగా గుర్తుంచుకుని, గోల్డ్ ను సొంతం చేసుకునే వారికి ఇదే మంచి సమయమని కూడా చెబుతున్నారు.
తగ్గడానికి కారణాలివే...
బంగారం, వెండి ధరలు తగ్గడానికి అమెరికా ఫెడరల్ రిజర్వ్ వడ్డీ రేట్ల అంచనాలు, బలపడుతున్న డాలర్, పెరుగుతున్న బాండ్ ఈల్డ్స్ వంటివి ప్రధాన కారణాలుగా చెబుతున్నారు. ద్రవ్యోల్బణాన్ని అదుపు చేయడానికి అమెరికా ఫెడరల్ రిజర్వ్ డిసెంబర్‌లో మరోసారి వడ్డీ రేట్లు పెంచవచ్చనే సంకేతాలు బలపడ్డాయి. వడ్డీ రాని బంగారం, వెండిపై దీని ప్రభావం పడుతోంది.అమెరికా ట్రెజరీ బాండ్లపై రాబడులు పెరగడంతో ఇన్వెస్టర్లు బాండ్ల వైపు మొగ్గు చూపుతున్నారు. డాలర్ విలువ పెరగడం వల్ల ఇతర కరెన్సీలలో బంగారం, వెండి కొనుగోలు ఖరీదై డిమాండ్ తగ్గుతోంది. టెక్నాలజీ, ఏఐ సంబంధిత స్టాక్స్‌లో అమ్మకాల ఒత్తిడి కారణంగా ఇతర చోట్ల నష్టాలను భర్తీ చేయడానికి లేదా నగదు సమకూర్చుకోవడానికి కొందరు ఇన్వెస్టర్లు బంగారం, వెండిని అమ్ముతున్నారు. గత ర్యాలీల తర్వాత లాభాల స్వీకరణ జరగడం, అలాగే దేశీయంగా రూపాయి కదలికలు కూడా ధరల తగ్గుదలకు తోడవుతున్నాయి. సోలార్, సెమీకండక్టర్లు వంటి పారిశ్రామిక రంగాలతో సంబంధం ఉన్న వెండి, మార్కెట్ ఒత్తిళ్ల సమయంలో బంగారం కంటే వేగంగా పడిపోతోంది.
పెళ్లిళ్ల సీజన్ ప్రారంభం కానుండటంతో...
శుభకార్యాలు, పెళ్లిళ్ల సీజన్ ప్రారంభం కావడంతో కొనుగోళ్లు చాలా వరకూ పెరిగాయి. 1,15,000 రూపాయలకు పది గ్రాముల బంగారం లభిస్తుండటంతో పాటు అనేక ఆఫర్లు కూడా జ్యుయలరీ దుకాణాల యాజమాన్యం ప్రకటించడం వల్ల కూడా కొనుగోలుకు పసిడి ప్రియులు ఎగబడుతున్నారు. మరొకవైపు మదుపు చేసే వారి సంఖ్య క్రమంగా తగ్గుతుంది. నష్టాల బారిన పడిన వారు బంగారం, వెండిపై పెట్టుబడి పెట్టేందుకు ముందుకు రావడం లేదు. ఈరోజు దేశంలో బంగారం ధరలు తగ్గాయి. వెండి ధరలు తగ్గాయి. ఉదయం ఆరు గంటలకు హైదరాబాద్ బులియన్ మార్కెట్ లో నమోదయిన బంగారం, వెండి ధరలు ఇలా ఉన్నాయి. 22 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర 1,15,680 రూపాయలుగా నమోదయింది. 24 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర 1,24,360 రూపాయలుగా కొనసాగుతుంది. కిలో వెండి ధర 1,75,000 రూపాయల వద్ద ట్రేడ్ అవుతుంది. మధ్యాహ్నానికి ధరల్లో మార్పులుండవచ్చు.

