కేంద్ర ప్రభుత్వం పెంచిన పెట్రోలు, డీజిల్ ధరల పెంపుదల తెలంగాణ బీజేపీకి ఇబ్బందికరంగా మారనుంది. త్వరలోనే గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికలు జరగనున్నాయి.
గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ లో ఈసారి 300 వార్డులకు ఎన్నికలు జరగనున్నాయి. గత ఎన్నికల్లో నలభైకి పైగా స్థానాలను గెలుచుకుంది. కానీ ఈసారి ఆ పరిస్థితి ఉండే అవకాశం లేదు. అయితే ఈ సమయంలో పెట్రోలు, డీజిల్ ధరలు పెరగడంతో ఈ ప్రభావం ఎన్నికలపై పడుతుందన్న ఆందోళన బీజేపీ నేతల్లో వ్యక్తమవుతుంది. లీటర్ పెట్రోలు, డీజిల్ పై 3.04 రూపాయలు పెరిగింది. హైదరాబాద్ లో పెట్రోలు లీటర్ పెట్రోలు ధర 110.88, లీటరు డీజిల్ ధర 98.96 రూపాయలకు చేరుకుంది. హైదరాబాద్ వంటి నగరాల్లో ఇది భారమనే చెప్పాలి.
పేద, మధ్యతరగతి ప్రజలపై...
ముఖ్యంగా పేద, మధ్యతరగతి ప్రజలపై ఈ పెట్రోలు, డీజిల్ ధరల భారం పెనుమార్పులు తేనుంది. నిత్యావసరాల ధరలు పెరగడమే కాకుండా కూరగాయల ధరలు కూడా పెరిగే అవకాశముంది. దాదాపు అన్ని ధరలు పెరగనున్నాయి. బియ్యం నుంచి ఉప్ప వరకూ అన్ని ధరలు పెరిగితే అది సామాన్యుడి అసహనానికి కారణమవుతుంది. ఎన్నికలు ముగిసిన వెంటనే ధరలు పెంచారన్న అభిప్రాయం ప్రజల్లో నెలకొంది. ఎన్ని పొదుపు సూత్రాలు, మంత్రాలు చెప్పినా ప్రజలకు తమ జేబుల్లో నుంచి డబ్బులు పోతే మాత్రం ఊరికే ఉండరు. తమ అసంతృప్తిని ఓటు రూపంలో ఖచ్చితంగా వెళ్లగక్కుతారన్న ఆందోళన కమలం పార్టీ నేతల్లో కనిపిస్తుంది.
ఈ ధరలు పెరుగుదలతో...
ఈ ధరలు పెరుగుదలతో బీజేపీ విజయానికి అడ్డుకట్ట వేయడానికి కాంగ్రెస్ ప్రభుత్వం వెంటనే గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ ఎన్నికలకు వెళ్లే అవకాశాలున్నాయి. అర్ధరాత్రి ..నెల మధ్యలో పెట్రోలు, డీజిల్ ధరలు పెంచడంతో పాటు గ్యాస్ సిలిండర్ ధర కూడా ఇటీవల అరవై రూపాయలు పెరగడంతో ఆ ప్రభావం తమ పార్టీపై పడుతుందేమోనన్న భయం బీజేపీ నేతలకు పట్టుకుంది. మెట్రో నగరం కావడంతో ఎక్కువ మంది పెరిగిన పెట్రోలు, డీజిల్, గ్యాస్ ధరలకు వ్యతిరేకంగా ఓటెత్తే అవకాశముందన్న అంచనాలు వినిపిస్తున్నాయి. మొత్తం మీద కేంద్ర ప్రభుత్వం పెట్రోలు, డీజిల్ ధరలు పెంచడం బీజేపీ ఆశలకు గండి కొట్టినట్లయిందన్న విశ్లేషణలు వెలువడుతున్నాయి.

