ఐపీఎల్ క్వాలిఫయర్-2లో గుజరాత్ టైటాన్స్ అద్భుత ప్రదర్శనతో ఫైనల్‌కు చేరింది. శుక్రవారం జరిగిన మ్యాచ్‌లో రాజస్థాన్ రాయల్స్‌పై ఏడు వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది.
శుభ్‌మన్ గిల్ 53 బంతుల్లో 104 పరుగలు చేశాడు. ఇందులో 15 ఫోర్లు, 3 సిక్సర్లున్నాయి. కెప్టెన్ ఇన్నింగ్స్‌తో జట్టును లక్ష్యానికి చేర్చాడు. ముందుగా బ్యాటింగ్ చేసిన రాజస్థాన్ రాయల్స్ నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్లకు 214 పరుగులు చేసింది. 15 ఏళ్ల వైభవ్ సూర్యవంశీ 47 బంతుల్లో 96 పరుగులు చేసి జట్టుకు భారీ స్కోరు అందించాడు. అయితే అతడి పోరాటం ఫలితం ఇవ్వలేదు.
గిల్, సుదర్శన్ దూకుడు...
215 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన గుజరాత్‌కు శుభ్‌మన్ గిల్, సాయి సుదర్శన్ 32 బంతుల్లో 58 పరుగులు చేసి శుభారంభం అందించారు. ఇద్దరూ కలిసి కేవలం 77 బంతుల్లోనే 167 పరుగుల భాగస్వామ్యం నమోదు చేశారు. కచ్చితమైన క్రికెటింగ్ షాట్లతో మైదానం నలువైపులా పరుగులు రాబట్టారు. జోఫ్రా ఆర్చర్ వేగాన్ని కూడా గిల్ ఏమాత్రం భయపడకుండా ఎదుర్కొన్నాడు. పుల్ షాట్లు, కవర్ డ్రైవ్‌లతో అలరించాడు. జడేజా బౌలింగ్‌లో ఎక్స్‌ట్రా కవర్ మీదుగా బౌండరీ బాది శతకం పూర్తి చేసుకున్నాడు. చివరకు గుజరాత్ 18.4 ఓవర్లలోనే లక్ష్యాన్ని ఛేదించింది. సుదర్శన్ వరుసగా రెండో మ్యాచ్‌లోనూ హిట్‌వికెట్‌గా వెనుదిరగడం విశేషం.
వైభవ్ మెరుపులు...
రాజస్థాన్ ఆరంభంలోనే యశస్వి జైస్వాల్, ధ్రువ్ జురెల్ వికెట్లు కోల్పోయింది. దీంతో బాధ్యత తీసుకున్న సూర్యవంశీ పరిస్థితులకు తగ్గట్టు ఆడాడు. మహ్మద్ సిరాజ్, కగిసో రబాడా, ప్రసిద్ధ్ కృష్ణ అతడిని కట్టడి చేసేందుకు ప్రయత్నించినా ఫలితం లేకపోయింది. రబాడా గంటకు 153 కిలోమీటర్ల వేగంతో వేసిన బంతిని సూటిగా సిక్సర్‌గా మలిచిన షాట్ మ్యాచ్‌కే హైలైట్‌గా నిలిచింది. హెల్మెట్‌కు బంతి తాకినా వెనుకడుగు వేయకుండా దూకుడుగా ఆడాడు. 46 పరుగుల వద్ద సుదర్శన్ ఇచ్చిన క్యాచ్‌ను వదిలేయడంతో సూర్యవంశీకి అదృష్టం కలిసొచ్చింది. ఆ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని టోర్నీలో తన ఆరో అర్ధశతకం నమోదు చేశాడు. అయితే శతకానికి నాలుగు పరుగుల దూరంలో రబాడా బౌలింగ్‌లో థర్డ్‌మ్యాన్ వద్ద క్యాచ్ ఇచ్చి అవుటయ్యాడు.
చివర్లో ఫెరెరియా ధాటిగా...
నాలుగో స్థానంలో వచ్చిన రవీంద్ర జడేజా 35 బంతుల్లో 45 పరుగులతో కీలక ఇన్నింగ్స్ ఆడాడు. టెన్నిస్ ఎల్బో సమస్యతో కొంతసేపు రిటైర్డ్ హర్ట్‌గా వెళ్లిన అతడు మళ్లీ క్రీజులోకి వచ్చాడు. చివర్లో ఫెరెరియా 11 బంతుల్లో 38 పరుగులతో చెలరేగాడు.చివరి ఓవర్‌ను రషీద్ ఖాన్‌కు అప్పగించిన గుజరాత్‌కు అది కలిసిరాలేదు. ఫెరెరియా వరుస సిక్సర్లతో ఆ ఓవర్‌లో 27 పరుగులు రాబట్టాడు.ఇక ఆదివారం అహ్మదాబాద్‌లో జరిగే ఫైనల్లో గుజరాత్ టైటాన్స్ డిఫెండింగ్ చాంపియన్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుతో తలపడనుంది. 2022లో టైటిల్ గెలిచిన గుజరాత్ ఐదు సీజన్లలో మూడోసారి ఫైనల్‌కు చేరి తన నిలకడను మరోసారి చాటుకుంది.

