Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
Israel Lebanon conflict : దక్షిణ లెబనాన్ లో... ఇజ్రాయెల్-లెబనాన్ ప్రత్యక్ష చర్చలు

Israel Lebanon conflict : దక్షిణ లెబనాన్ లో... ఇజ్రాయెల్-లెబనాన్ ప్రత్యక్ష చర్చలు

TeluguPost.com 4 months ago

దక్షిణ లెబనాన్‌లో ఇజ్రాయెల్ దళాలు శుక్రవారం తెల్లవారుజామున మరింత లోతుగా చొచ్చుకెళ్లాయి. మార్జాయూన్ పట్టణం సమీపంలోని డిబ్బిన్ గ్రామంలోకి ప్రవేశించాయి.

ఇదే సమయంలో అమెరికాలోని పెంటగాన్‌లో లెబనాన్, ఇజ్రాయెల్ సైనికాధికారులు ప్రత్యక్షంగా సమావేశమై చర్చలు జరిపారు. ఇజ్రాయెల్ వైమానిక దాడుల్లో కనీసం ఆరుగురు మృతిచెందారు. డీర్ కనౌన్ అల్ నహర్, అబ్బాసియెహ్ గ్రామాలపై జరిగిన దాడిలో ఐదుగురు చనిపోయారు. ఎబ్బా గ్రామంలో మున్సిపల్ పోలీసు అధికారి ఒకరు ప్రాణాలు కోల్పోయినట్లు ప్రభుత్వ మీడియా వెల్లడించింది.

పెంటగాన్‌లో ప్రత్యక్ష భేటీ...

వాషింగ్టన్‌లో ఆరుగురు సభ్యులతో కూడిన లెబనాన్ సైనిక ప్రతినిధి బృందం శుక్రవారం ఇజ్రాయెల్ సైనికాధికారులను కలిసింది. రెండు దేశాల మధ్య దశాబ్దాల తర్వాత జరిగిన తొలి ప్రత్యక్ష సైనిక చర్చలు ఇవే. చర్చలు ఫలప్రదంగా జరిగాయని పెంటగాన్ ప్రకటించింది. అయితే ఎలాంటి స్పష్టమైన ఒప్పందాలు కుదిరాయో వెల్లడించలేదు. ప్రాంతీయ భద్రత, స్థిరత్వానికి అవసరమైన కార్యాచరణ రూపకల్పనపై చర్చలు జరిగాయని తెలిపింది. ఈ సమావేశాల్లో వచ్చిన అంశాలు వచ్చే వారం రాజకీయ నాయకులతో జరగనున్న చర్చలకు ఉపయోగపడతాయని పేర్కొంది. గత నెల నుంచి ఇజ్రాయెల్, లెబనాన్ ఉన్నతాధికారుల మధ్య చర్చలు కొనసాగుతున్నాయి. అయితే ఇజ్రాయెల్ లక్ష్యంగా ఉన్న హిజ్బుల్లా ఈ చర్చల్లో పాల్గొనడం లేదు. వాటి ఫలితాలను కూడా అంగీకరించబోమని స్పష్టం చేసింది. ఏప్రిల్ 17న కాల్పుల విరమణ అమల్లోకి వచ్చింది. లెబనాన్ సైనిక ప్రతినిధి బృందానికి నాయకత్వం వహిస్తున్న ఆపరేషన్స్ విభాగాధిపతి బ్రిగేడియర్ జనరల్ జార్జ్ రిజ్కల్లా ఆ ఒప్పందాన్ని పూర్తిస్థాయిలో అమలు చేసే దిశగా ప్రయత్నిస్తారని లెబనాన్ సైనిక అధికారి ఒకరు తెలిపారు.2024 చివర్లో అమెరికా మధ్యవర్తిత్వంతో కుదిరిన కాల్పుల విరమణ అమలును పర్యవేక్షించే కమిటీని మళ్లీ క్రియాశీలం చేయాలని కూడా లెబనాన్ కోరనున్నట్లు చెప్పారు.

కాల్పుల విరమణ అమలుపైనే...

లెబనాన్ అధ్యక్షుడు జోసెఫ్ అవున్‌కు అమెరికా విదేశాంగ మంత్రి మార్కో రూబియో శుక్రవారం ఫోన్ చేశారు. లెబనాన్ పరిస్థితులు, మధ్యప్రాచ్య పరిణామాలపై ఇద్దరూ చర్చించారు. కాల్పుల విరమణ అమలుపైనే దృష్టి పెట్టాలని అవున్ కోరినట్లు అధ్యక్ష కార్యాలయం వెల్లడించింది. అదే ఇతర అంశాల పరిష్కారానికి ప్రధాన మార్గమని ఆయన చెప్పినట్లు తెలిపింది.గత ఏప్రిల్‌లో కూడా లెబనాన్, ఇజ్రాయెల్ ప్రతినిధులు మూడు దశాబ్దాల తర్వాత తొలి ప్రత్యక్ష చర్చలు జరిపారు.

ఖాళీ చేయించిన గ్రామాలు...

దక్షిణ లెబనాన్‌లోని పలు ప్రాంతాలకు ఇజ్రాయెల్ సైన్యం శుక్రవారం హెచ్చరికలు జారీ చేసింది. దీంతో వందలాది కుటుంబాలు ఉత్తర ప్రాంతాలకు తరలిపోయాయి. నబాతియెహ్ నగరం సమీపంలోని యోహ్మోర్, జవ్తార్ అల్ షర్కియెహ్ గ్రామాల వద్ద హిజ్బుల్లా యోధులతో ఇజ్రాయెల్ దళాలు తలపడ్డాయి. వ్యూహాత్మక ప్రాధాన్యం ఉన్న లిటానీ నదిని దాటి ముందుకు సాగాయి. ఏప్రిల్‌లో కాల్పుల విరమణ అమలులోకి వచ్చినప్పటికీ లిటానీకి దక్షిణంగా ఉన్న విస్తార ప్రాంతాలు ఇప్పటికీ ఇజ్రాయెల్ నియంత్రణలోనే ఉన్నాయి.యోహ్మోర్ గ్రామంలోకి వచ్చిన ఇజ్రాయెల్ దళాలపై దాడులు చేసినట్లు హిజ్బుల్లా ప్రకటించింది.ఈ రెండు గ్రామాలు ఇజ్రాయెల్ సరిహద్దుకు సుమారు 15 కిలోమీటర్ల దూరంలో ఉన్న చారిత్రక బోఫోర్ట్ కోట సమీపంలో ఉన్నాయి. ఆ కోటను స్వాధీనం చేసుకోవడమే ఇజ్రాయెల్ లక్ష్యమా అన్నది స్పష్టంగా తెలియరాలేదు.

సందర్శించిన నెతన్యాహు...

ఇజ్రాయెల్ ప్రధాని బెంజిమన్ నెతన్యాహు శుక్రవారం ఉత్తర సరిహద్దు ప్రాంతాన్ని సందర్శించారు. సైనికులతో మాట్లాడిన ఆయన, "మా దళాలు లిటానీని దాటాయి. కీలక ప్రాంతాలను నియంత్రణలోకి తీసుకున్నాయి. ఫలితాలు ఎంతో ప్రభావవంతంగా ఉన్నాయి" అన్నారు."బీరూట్, బెకా లోయతో పాటు మొత్తం యుద్ధ రంగంలో మేము చర్యలు కొనసాగిస్తున్నాం. హిజ్బుల్లాకు భారీ దెబ్బ తగులుతోంది" అని చెప్పారు.

ఇరాన్-అమెరికా చర్చల ప్రభావం?...

మూడు నెలలుగా కొనసాగుతున్న యుద్ధంలో కాల్పుల విరమణను మరో 60 రోజులు పొడిగించేందుకు అమెరికా, ఇరాన్ ప్రతినిధులు తాత్కాలిక అవగాహనకు వచ్చినట్లు అమెరికా అధికారి ఒకరు తెలిపారు. ఇరాన్ అణు కార్యక్రమంపై కొత్త చర్చలు ప్రారంభించే అంశంపైనా అంగీకారం కుదిరినట్లు చెప్పారు.అయితే ఇరాన్ అధికారికంగా దీనిని ధ్రువీకరించలేదు. అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ కూడా ప్రాథమిక అవగాహన ఉన్నట్లు చెప్పారు. అయితే దీనికి అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఆమోదం లభిస్తుందో లేదో తెలియదన్నారు. హిజ్బుల్లా ఎంపీ హసన్ ఫద్లల్లా మాట్లాడుతూ, ఇరాన్-అమెరికా ఒప్పందం కుదిరితే లెబనాన్‌పై ఇజ్రాయెల్ దాడులు ఆగే అవకాశముందని అన్నారు. మార్చి 2న ప్రారంభమైన తాజా ఇజ్రాయెల్-హిజ్బుల్లా యుద్ధంలో ఇప్పటివరకు లెబనాన్‌లో 3,200 మంది మరణించారు. 10 లక్షల మందికిపైగా ప్రజలు నిరాశ్రయులయ్యారు.


Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Telugu Post Telugu