Tokyo : ఉక్రెయిన్, మధ్యప్రాచ్యంలోని యుద్ధాల్లో కృత్రిమ మేధ (ఏఐ), డ్రోన్ల వినియోగం యుద్ధ స్వరూపాన్నే మార్చిందని జపాన్ పేర్కొంది. అలాంటి కొత్త తరహా యుద్ధ విధానాలకు అనుగుణంగా మారాల్సిన అవసరం ఉందని, దేశీయ రక్షణ పరిశ్రమను మరింత బలోపేతం చేయాలని మంగళవారం విడుదల చేసిన వార్షిక రక్షణ శ్వేతపత్రంలో తెలిపింది.ఇటీవలి సంవత్సరాల్లో జపాన్ సైనిక సామర్థ్యాలు, రక్షణ వ్యయాన్ని పెంచింది.
చైనా సైనిక కదలికలను అడ్డుకునే చర్యల్లో భాగంగా దీర్ఘశ్రేణి క్రూయిజ్ క్షిపణుల మోహరింపునూ ప్రారంభించింది.మంత్రివర్గం ఆమోదించిన 598 పేజీల రక్షణ శ్వేతపత్రంలో చైనానే జపాన్‌కు అతిపెద్ద వ్యూహాత్మక సవాల్‌గా మరోసారి పేర్కొంది. పసిఫిక్ మహాసముద్రంలో చైనా యుద్ధనౌకల సంఖ్య, వాటి సంచారం పెరుగుతుండటంపై ఆందోళన వ్యక్తం చేసింది.ప్రతి ఏడాది విడుదల చేసే ఈ శ్వేతపత్రంలో జపాన్ సైనిక కార్యకలాపాలు, ప్రాధాన్యాలు, ఇతర దేశాల సైనిక ధోరణుల విశ్లేషణను పొందుపరుస్తారు. ప్రధాని సనయే తకైచి ప్రభుత్వం రక్షణ వ్యయం పెంపు, సైనిక విస్తరణకు ప్రజల మద్దతు పొందడంతో పాటు యువతను సైన్యంలోకి ఆకర్షించేందుకు ఈసారి కార్టూన్ ముఖచిత్రం, జపనీస్, ఇంగ్లిష్, చైనీస్ భాషల్లో వీడియోల లింకులనూ చేర్చింది.
డ్రోన్ల అభివృద్ధికి వేగం...
ఉక్రెయిన్ యుద్ధంలో డ్రోన్ల వినియోగాన్ని దృష్టిలో పెట్టుకుని కొత్త తరహా యుద్ధ విధానాలకు అనుగుణంగా మారడం అత్యవసరమని శ్వేతపత్రం పేర్కొంది. అనేక దేశాలు యుద్ధ డ్రోన్ల అభివృద్ధిలో పోటీపడుతున్న నేపథ్యంలో తీర రక్షణ కోసం దీర్ఘశ్రేణి క్షిపణులతో కలిపి వినియోగించే స్వదేశీ యుద్ధ డ్రోన్ల అభివృద్ధికి జపాన్ ప్రాధాన్యం ఇస్తోంది."వేగమే కీలకం" అని రక్షణ మంత్రి షింజిరో కోయిజుమి జులై ప్రారంభంలో అన్నారు.డ్రోన్ల వేగవంతమైన అభివృద్ధి కార్యక్రమం కోసం దరఖాస్తు చేసిన 38 సంస్థల్లో నాలుగింటిని కొనుగోలు, సాంకేతికత, లాజిస్టిక్స్ ఏజెన్సీ ఎంపిక చేసింది. ఆ సంస్థలు రూపొందించే నమూనాలను ఆగస్టు ప్రారంభంలో జపాన్ నౌకాదళం పరీక్షించనుంది. ఆ తర్వాత తుది ఎంపిక చేపడతారు.ఈ తరహా డ్రోన్ల అభివృద్ధిలో మరికొన్ని సంస్థలు కూడా పనిచేస్తున్నాయి. తోషిబా, స్టార్టప్ సంస్థ ప్రో డ్రోన్‌తో కలిసి యుద్ధ డ్రోన్లను అభివృద్ధి చేయనున్నట్లు ఇటీవల ప్రకటించింది.జనాభా తగ్గుతున్న నేపథ్యంలో సైన్యంలో చేరే వారి సంఖ్య కూడా క్షీణిస్తోంది. మానవ రహిత ఆయుధ వ్యవస్థలు ఈ లోటును కొంత మేర భర్తీ చేయగలవని అధికారులు భావిస్తున్నారు.అయితే జపాన్‌లో వాణిజ్య డ్రోన్ మార్కెట్‌పై చైనా దిగుమతుల ఆధిపత్యం ఉండటంతో పూర్తిగా స్వదేశీ డ్రోన్ల అభివృద్ధి సవాలుగా మారుతుందని నిపుణులు చెబుతున్నారు.
చైనా, రష్యా, ఉత్తర కొరియాపై ఆందోళన...
చైనా తన భూభాగమని ప్రకటిస్తున్న తైవాన్‌పై ఘర్షణ తలెత్తే అవకాశం ఉందన్న ఆందోళనతో జపాన్ ఇటీవల దక్షిణ పశ్చిమ దీవుల్లో సైనిక బలగాలను బలోపేతం చేసింది. దీర్ఘశ్రేణి క్రూయిజ్ క్షిపణుల మోహరింపునూ ప్రారంభించింది.పసిఫిక్‌లో చైనా యుద్ధనౌకల ఉనికి, వాటి సంచారం పెరగడం ప్రధాన ఆందోళనగా శ్వేతపత్రం పేర్కొంది. దీనిపై అధ్యయనం చేసి రక్షణ వ్యూహాలను బలోపేతం చేసేందుకు ప్రత్యేక విభాగాన్ని రక్షణ శాఖ ఏర్పాటు చేసింది.స్పష్టత లేకుండా చైనా సైనిక వ్యయాన్ని నిరంతరం పెంచుతోందని, అణు, క్షిపణి సామర్థ్యాలను వేగంగా విస్తరిస్తోందని శ్వేతపత్రం పేర్కొంది.గత డిసెంబరులో దక్షిణ పశ్చిమ జపాన్ సమీపంలో చైనా విమాన వాహక నౌకల విన్యాసాల సమయంలో చైనా యుద్ధ విమానాలు జపాన్ విమానాలపై రాడార్‌ను గురిపెట్టాయని తెలిపింది. ఇది క్షిపణి ప్రయోగానికి ముందు చేసే చర్యగా భావిస్తారు.గత జూన్‌లో దక్షిణ జపాన్‌లోని ఇవో జిమా సమీపంలో తొలిసారి రెండు చైనా విమాన వాహక నౌకలు కనిపించాయని, ఇది తూర్పు చైనా సముద్రం దాటి చైనా సైనిక కార్యకలాపాలు వేగంగా విస్తరిస్తున్నాయన్న ఆందోళనను మరింత పెంచిందని పేర్కొంది.తైవాన్‌పై చైనా సైనిక చర్య చేపడితే జపాన్ బలప్రయోగానికి అది కారణం కావచ్చని ప్రధాని సనయే తకైచి గత నవంబరులో వ్యాఖ్యానించిన తర్వాత టోక్యో-బీజింగ్ మధ్య ఉద్రిక్తతలు పెరిగాయి.జపాన్ రక్షణ శ్వేతపత్రంలో చైనాపై చేసిన వ్యాఖ్యలను బీజింగ్ మంగళవారం తిరస్కరించింది. ఈ పత్రంలో అసత్య ప్రచారం నిండిపోయిందని, సైనిక విస్తరణపై ఉన్న పరిమితులను సడలించేందుకు జపాన్ దీనిని సాకుగా చూపుతోందని చైనా జాతీయ రక్షణ మంత్రిత్వ శాఖ ప్రతినిధి చెన్ షీ ఆరోపించారు.జపాన్ పరిసరాల్లో చైనా-రష్యా సంయుక్త సైనిక విన్యాసాలు, బాంబర్ విమానాల సంయుక్త ప్రయాణాలు, యుద్ధనౌకల కార్యకలాపాలు కూడా తీవ్రమైన భద్రతా ఆందోళనగా శ్వేతపత్రం పేర్కొంది.ఉత్తర కొరియా హైపర్‌సోనిక్ క్షిపణులతో పాటు ఇతర క్షిపణి సామర్థ్యాలను వేగంగా అభివృద్ధి చేస్తోందని, రష్యాతో దాని సైనిక సంబంధాలు పెరగడం, ఉక్రెయిన్ యుద్ధానికి మద్దతు ఇవ్వడం కూడా ఆందోళన కలిగించే అంశాలని తెలిపింది.
రక్షణ పరిశ్రమకు ప్రోత్సాహం...
రక్షణ సామర్థ్యాల పెంపునకు ఆయుధాల తయారీ, సాంకేతిక పరిజ్ఞానం కీలకమని శ్వేతపత్రం పేర్కొంది. స్టార్టప్‌లు, శాస్త్రీయ పరిశోధనలకు ప్రభుత్వం నిధులను పెంచుతోంది.రెండో ప్రపంచ యుద్ధం తర్వాత శాంతివాద విధానాన్ని అనుసరించిన జపాన్‌లో ప్రాణాంతక ఆయుధాల తయారీకి అనేక పెద్ద సంస్థలు దూరంగా ఉన్నప్పటికీ, ద్వంద్వ వినియోగ సాంకేతికతను సైనిక అవసరాలకు మార్చే దిశగా స్టార్టప్‌లు ఆసక్తి చూపుతున్నాయని అధికారులు తెలిపారు.ప్రాణాంతక ఆయుధాల ఎగుమతులపై నిషేధాన్ని ఇటీవల సడలించడం కూడా రక్షణ పరిశ్రమకు ఊతమిస్తుందని ప్రభుత్వం భావిస్తోంది.ఆయుధ సాంకేతికత బదిలీ, సంయుక్త అభివృద్ధి, ఉత్పత్తి వల్ల దేశీయ రక్షణ పరిశ్రమ బలోపేతం కావడంతో పాటు భాగస్వామ్య దేశాలతో సంబంధాలు మరింత బలపడతాయని రక్షణ మంత్రి కోయిజుమి చెప్పారు. ఆయన విదేశీ పర్యటనల్లో ఆయుధాల విక్రయ ఒప్పందాలకు కూడా ప్రాధాన్యం ఇస్తున్నారు.ఆస్ట్రేలియాతో 11 అప్‌గ్రేడ్ చేసిన మొగామి తరగతి ఫ్రిగేట్‌ల సంయుక్త అభివృద్ధి, బదిలీకి జపాన్ ఇటీవల కీలక ఒప్పందం కుదుర్చుకుంది. న్యూజిలాండ్‌తో కూడా ఇదే తరహా ఒప్పందంపై చర్చలు సాగుతున్నాయి. ఫిలిప్పీన్స్‌కు సేవల నుంచి తప్పించిన డిస్ట్రాయర్‌ల విక్రయానికి కూడా ఒప్పందం చేసుకుంది.

