Andhra Pradesh : ఆంధ్రప్రదేశ్ లో కాపు సామాజికవర్గం ఓట్ల కోసం ఇప్పుడు రేసు ప్రారంభమయింది. అన్ని పార్టీలు కాపు సామాజికవర్గం ఓటు బ్యాంకును సొంతం చేసుకునేందుకు పోటీ పడుతున్నాయి.
కాపు సమావేశాల పేరిట ఆ సామాజికవర్గానికి దగ్గరయ్యే ప్రయత్నాలు చేస్తున్నాయి. వైసీపీ, టీడీపీ ఈ రకమైన ప్రయత్నాలు మొదలు పెట్టాయి. కాపులు తమ వెంటే ఉంటారని జనసేన మాత్రం కొంత వెనకబడి ఉన్నా పవన్ వెనకే ఉంటారన్న ధీమాలో ఉంది. ఇక బీజేపీ కూడా ఏ మాత్రం తగ్గడం లేదు. తరచూ సమావేశాలు పెట్టడంతో పాటు కాపు రిజర్వేషన్ల ఉద్యమాన్ని మరొకసారి తెరపైకి తెచ్చేందుకు వీరు ప్రయత్నిస్తున్నారు.
వైసీపీ ఏకం చేసే ప్రయత్నం...కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత కాపు సామాజికవర్గానికి అన్యాయం చేస్తుందని వైసీపీ ఆరోపిస్తుంది. కాపు కార్పొరేషన్ కు నిధులు మంజూరు చేయకపోగా వారికి పదవుల విషయంలోనూ ప్రాధాన్యత ఇవ్వడం లేదని చెబుతోంది. ప్రధానంగా తూర్పు, పశ్చిమ గోదావరి జిల్లాల్లో బలంగా ఉన్న కాపు సామాజికవర్గం ఓటు బ్యాంకును తమ వైపునకు రప్పించేందుకు ప్రయత్నాలు ప్రారంభించింది. ఇప్పటికే తోట త్రిమూర్తులు అంబేద్కర్ కోనసీమ జిల్లాలోని వెంకటాపురంలో వైసీపీ కాపు నేతలతో సమావేశమై రాష్ట్ర వ్యాప్త ఆందోళనలకు సిద్ధమవ్వాలని నిర్ణయించారు. వైసీపీ తర్వాత అన్ని ప్రాంతాల్లో సమావేశాలను ఏర్పాటు చేసి కాపు నేతలతో పాటు ప్రజలను కూడా ఏకతాటిపైకి తేవాలని ప్రయత్నిస్తున్నాయి. త్వరలోనే మరొక సమావేశాన్ని ఏర్పాటు చేసేందుకు వైసీపీ సిద్ధమవుతుంది. టీడీపీ కూడా కాపు సామాజికవర్గంలో...టీడీపీ కూడా కాపు సామాజికవర్గంలో బలం మరింత పెంచుకునే ప్రయత్నాలు ప్రారంభించింది. కాపు సామాజికవర్గం టీడీపీ నేతలు సమావేశమై దీనిపై చర్చించారు. అంతేకాకుండా ప్రభుత్వంపై కాపులకు రిజర్వేషన్లు కల్పించాలని ఒత్తిడి తేవాలని నిర్ణయించాయి. దీనికి బొండా ఉమామహేశ్వరరావు నాయకత్వం వహిస్తున్నారు. ఆయన కోస్తా జిల్లా నేత కావడంతో త్వరలోనే తూర్పు, పశ్చిమ గోదావరి జిల్లాల్లో పర్యటించి టీడీపీ కాపు సామాజికవర్గం నేతలను ఏకం చేయాలని ప్రయత్నంలో ఉన్నారు. మరొకవైపు టీడీపీ కాపులకు ఇస్తున్న ప్రాధాన్యత మరే ప్రభుత్వంలో ఇవ్వడం లేదని ప్రచారం చేయాలని కూడా నిర్ణయించారు. అధినాయకత్వం ఆశీస్సులతోనే ఈ కార్యక్రమానికి టీడీపీ కాపు సామాజికవర్గం నేతలు శ్రీకారం చుట్టినట్లు తెలిసింది. మొత్తం మీద ఈ రేసులో ఎవరిది పై చేయి అవుతుందన్నది రానున్న కాలమే చెబుతుంది.

