కెన్యా రాజధాని నైరోబీలో వందలాది మహిళలు సోమవారం భారీ ప్రదర్శన నిర్వహించారు. మహిళల హత్యలు, వారిపై జరుగుతున్న హింసాత్మక ఘటనలు పెరుగుతున్నాయని పేర్కొంటూ వాటిపై తక్షణ దర్యాప్తు చేపట్టాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
మహిళల హక్కుల సంఘాలు లింగ ఆధారిత హింసను జాతీయ సంక్షోభంగా ప్రకటించాలని ప్రభుత్వాన్ని కోరుతున్నాయి. ఇటీవల ఓ గాయని మీద పెట్రోలు పోసి సజీవదహనం చేసిన ఘటనను ప్రస్తావిస్తూ ప్రజల మద్దతు కూడగట్టుతున్నాయి.
వీధుల్లో ర్యాలీ...పోలీసుల భద్రత మధ్య నైరోబీ వీధుల్లో మహిళలు శవపేటికను మోస్తూ ర్యాలీ నిర్వహించారు. "మహిళల హత్యలు ఆపండి" అని రాసిన ప్లకార్డులు ప్రదర్శించారు. ఇటీవల చిన్నారుల అదృశ్య ఘటనలు పెరుగుతున్నాయన్న నివేదికలపై కూడా అవగాహన కల్పించేందుకు ప్రయత్నించారు. ఈ అదృశ్యాలపై వెంటనే దర్యాప్తు చేపట్టాలని లింగ సమానత్వ శాఖ మంత్రి హన్నా వెండోట్ గతవారం అధికారులను ఆదేశించారు.నిరసనలో పాల్గొన్న రూబీ అబురా తన వ్యక్తిగత అనుభవాన్ని వెల్లడించారు. తన ప్రియుడు తనపై కత్తితో దాడి చేశాడని, తన తల్లిని హత్య చేశారని చెప్పారు. "నా తల్లి ఒక్క ఉదాహరణ మాత్రమే. చాలా మంది మహిళలు హత్యలకు గురయ్యారు. కానీ ఎవరూ పట్టించుకోవడం లేదు. మహిళా నాయకులు కూడా స్పందించడం కనిపించడం లేదు. ఇది సరైన పరిస్థితి కాదు" అని ఆమె అన్నారు.లింగ ఆధారిత హింస కేసుల కోసం...లింగ ఆధారిత హింస కేసుల దర్యాప్తు కోసం ప్రత్యేక విభాగాన్ని ఏర్పాటు చేసినట్లు గత నెల చివర్లో పోలీసులు ప్రకటించారు. ఇందులో నేర గూఢచారి విశ్లేషకులు, ఫోరెన్సిక్ నిపుణులు, హత్య కేసుల దర్యాప్తు అధికారులు తదితరులు పనిచేస్తారని తెలిపారు. కుటుంబ కలహాలు, భాగస్వాముల మధ్య హింస, లైంగిక నేరాలు, దాడులు, పరిష్కారం కాని కుటుంబ వివాదాలే ఎక్కువ కేసులకు కారణమవుతున్నాయని పోలీసులు పేర్కొన్నారు.కెన్యా మహిళా న్యాయవాదుల సమాఖ్య తెలిపిన వివరాల ప్రకారం, నైరోబీ, మొంబాసా, కిసుము నగరాల్లోని తమ మూడు కార్యాలయాలకు వారానికి సుమారు 70 లింగ ఆధారిత హింస కేసులు వస్తున్నాయి.మే 21న పలు సంఘాలు ప్రభుత్వానికి 40 రోజుల గడువు విధించాయి. లింగ ఆధారిత హింసను జాతీయ సంక్షోభంగా ప్రకటించాలని, లేకపోతే దేశవ్యాప్తంగా ఆందోళనలు చేపడతామని హెచ్చరించాయి. అయితే నిర్ణయించిన గడువు ముగియకముందే నిరసనలు ప్రారంభించాలని అవి నిర్ణయించాయి.

