కేరళ ముఖ్యమంత్రిగా వీడీ సతీశన్ ను కాంగ్రెస్ నాయకత్వం ఎంపిక చేసింది. కాంగ్రెస్ పార్టీకి నమ్మకమైన నేతగా పనిచేస్తున్న వీడీ సతీశన్ ను నియమించారు.
2001లో తొలిసారి పరావూర్ నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా వీడీ సతీశన్ ఎన్నికయ్యారు. వరసగా ఎమ్మెల్యేగా ఎన్నికవుతూ వస్తున్నారు. గత ప్రభుత్వంలో వీడీ సతీశన్ ప్రతిపక్ష నేతగా వ్యవహరించారు. 2021లో కాంగ్రెస్ లో కీలక పదవి లభించింది. కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకు రావడానికి వీసీ సతీశన్ పనిచేశారు. సతీశన్ సొంత గ్రామం ఎర్నాకులం జిల్లా నెట్టూరు.
ఐదు సార్లు ఎమ్మెల్యేగా...
పరావూర్ నుంచి వరసగా ఐదు సార్లు ఎమ్మెల్యేగా గెలిచిన వీడీ సతీశన్ ఇటీవల జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ విజయానికి కృషి చేశారు. రాజకీయాల్లోకి రాకముందు హైకోర్టు న్యాయవాదిగా పనిచేసిన వీడీ సతీశన్ తక్కువ కాలంలోనే కాంగ్రెస్ పార్టీలో ఎదిగారు. వీడీ సతీశన్, కేసీ వేణుగోపాల్, రమేష్ చెన్నితాల వంటి ముగ్గురు నేతలు పోటీ పడినా చివరకు వీడీ సతీశన్ పేరును ఖరారు చేస్తూ కాంగ్రెస్ నాయకత్వం నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు కాంగ్రెస్ నేత దీపాదాస్ మున్షీ అధికారికంగా ప్రకటించారు.
కాంగ్రెస్ గెలుపులో...
కేరళలో జరిగిన ఎన్నికల్లో అభ్యర్థుల ఎంపిక నుంచి ప్రచారం వరకూ వీడీ సతీశన్ కీలక పాత్ర పోషించారు. మ్యానిఫేస్టో రూపకల్పనలో వీడీ సతీశన్ కీలక భూమిక వహించారు. మరొకవైపు ముగ్గురు నేతలు ముఖ్యమంత్రి అభ్యర్థికి పోటీ పడటంతో తాను ముఖ్యమంత్రి మినహా మరే పదవి తీసుకోనని, మంత్రి పదవి అక్కరలేదని వీడీ సతీశన్ తెలిపారు. మే 4వతేదీన కేరళ ఎన్నికల ఫలితాలు వెలువడ్డాయి. దాదాపు పది రోజుల పాటు తర్జన భర్జనలు పడిన తర్వాత వీడీ సతీశన్ పేరును కాంగ్రెస్ నాయకత్వం ఖరారు చేసింది.

